
కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ
కోల్‌కతా: వినియోగదారుల ఫోరంలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ జైలులో నిర్బంధించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రమే అధికారముంటుందని పేర్కొంది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.
తన ఆదేశాల అమలు కోసం సీపీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)కింద వారెంట్ ఇచ్చేందుకు అధికారం లేదని పేర్కొంది. ఇటువంటి ఆదేశాలు వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధనల పరిధిని అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలు కోసం 2013లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. అతడు రూ.25,716 బకాయి చెల్లించలేదంటూ ఫైనాన్స్ కంపెనీ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుంది.
దీంతో, బకాయిని పూర్తిగా చెల్లించిన ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తనకు తిరిగి ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆదేశాలను ఫైనాన్స్ కంపెనీ యజమాని పట్టించుకోలేదు. దీంతో, ఫోరం అతడి అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. ఫోరం అధికారాలను సవాల్ చేస్తూ అతడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఫోరం వారెంట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.