హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు
‘ఇంపాక్ట్ ఆఫ్ సెక్షన్ 41(ఏ)’పై సదస్సు
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కొత్తగా తీసుకువచ్చిన సెక్షన్ 41(ఏ) సవరణతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయడం ఇకపై అంత సులువు కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు చెప్పారు. ఈ సవరణ దుర్వినియోగం కాకుండా నిలువరించే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయని న్యాయవాదులకు ఉద్భోదించారు.
‘ఇంపాక్ట్ ఆఫ్ సెక్షన్ 41(ఏ) సీఆర్‌పీసీ’ అంశంపై న్యాయవాద పరిషత్ ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సును జస్టిస్ శివశంకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అరెస్ట్ అనేది న్యాయపరమైన అవసరాల కోసమేననే విషయం చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తిని అరెస్టు చేయాల్సి వస్తే సరైన కారణాలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని తెలిపారు.
పోలీస్ అధికారి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించాక ఆ వ్యక్తి వల్ల మరో నేరం జరగకుండా నియంత్రించాల్సిన పరిస్థితి ఉంటేనే అరెస్ట్ చేయాలన్నారు. ఏడేళ్లకు మించని శిక్ష పడే కేసుల్లో అరెస్ట్‌కు ముందు తప్పనిసరిగా నోటీసు జారీ చేయాలన్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. ఓ ప్రేమోన్మాది నుంచి కుటుంబ సభ్యులను ర క్షించేందుకు ఒక తండ్రి చేసిన ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిందేనన్నారు.
అప్పా డెరైక్టర్ డాక్టర్ ఎం.మాలకొండ య్య మాట్లాడుతూ.. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా తొందరపాటుతో అరెస్ట్‌లు చేయవద్దని మాజీ డీజీపీలు అరవిందరావు, హెచ్‌జె దొర ఆనాడే సర్క్యులర్లు జారీచేశారని చెప్పారు. అయితే.. కొన్నిచోట్ల పొరపాట్లు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సదస్సులో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, సిటీ యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, హరీశ్ తదిరులు పాల్గొన్నారు.
అరెస్టు ఇక అంత సులువుకాదు
Published Mon, Apr 20 2015 1:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement