Justice Shiva Shankar Rao
-
కేంద్రాన్ని వివరణ కోరడం సమంజసం కాదు
సాక్షి, హైదరాబాద్ : రికార్డుల్లో తప్పుగా నమోదైన తన పుట్టిన తేదీని సవరించేందుకు చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి కార్యాలయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. పుట్టిన తేదీ సవరణ విషయంలో చట్ట నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని జస్టిస్ శివశంకరరావుకు హైకోర్టు గుర్తు చేసింది. పుట్టిన తేదీ సవరణ విషయంలో 1996 నుంచి పిటిషనర్ పెట్టుకున్న వినతి పత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం ఎంత మాత్రం సమంజసంగా ఉండదని, ఇలా అడిగితే, అది సమాజానికి తప్పుడు సంకేతం పంపినట్లవుతుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తుల పుట్టిన తేది గురించిన ప్రశ్న ఏదైనా తలెత్తినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 217(3) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని సంప్రదించి, రాష్ట్రపతి ఓ నిర్ణయం తీసుకుంటారని, ఈ అధికారాన్ని ఉపయోగించేందుకు కొన్ని పరిమితులున్నాయని హైకోర్టు పేర్కొంది. దీన్ని రాష్ట్రపతి ఇప్పటి వరకు 3–4 సార్లు మాత్రమే ఉపయోగించారంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.1959 మార్చి 29న తాను పుట్టానని, రికార్డుల్లో అది 1957 ఏప్రిల్ 10గా నమోదైందని, ఈ తప్పును సవరించాలని కోరుతూ రెండు దశాబ్దాలుగా వినతిపత్రాలు సమర్పిస్తున్నా, కేంద్రం స్పందించడం లేదని, అందువల్ల మార్చి 31లోపు ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జస్టిస్ శివశంకరరావు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.జగన్నాథశర్మ వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, పుట్టిన తేదీ సవరణ విషయంలో పిటిషనర్ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు పిటిషన్లు వేశారని, వాటిని హైకోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందని గుర్తు చేసింది. దీనికి శర్మ స్పందిస్తూ, పునః సమీక్షా పిటిషన్లో సుప్రీంకోర్టు తమకు కొంత వెసులుబాటు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ వ్యాజ్యంలో ముందుకెళ్లకుండా విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
తప్పుకోను.. నేనే విచారిస్తా
'మత్తయ్య పిటిషన్' విచారణ నుంచి తప్పుకోవాలని కోరడంపై జస్టిస్ శివశంకరరావు ఎవరో ఏదో చెప్పారని న్యాయమూర్తిపైనే ఆరోపణలా? ఆధారాల్లేకుండా విచారణ నుంచి తప్పుకోవాలని అంటారా?.. ఇలాంటివి వ్యవస్థ మనుగడకే ముప్పు స్టీఫెన్సన్ తీరు కోర్టు ధిక్కారమే.. ఆయనపై చర్యలు చేపట్టాలంటూ రిజిస్ట్రీకి ఆదేశం అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి అవసరమైతే మత్తయ్య పిటిషన్‌పై విచారణను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని వెల్లడి సీజే నుంచి అనుమతులు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం... ఆ తర్వాతే విచారణ చేపడతామని స్పష్టం సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు'వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలంటూ నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు స్పష్టం చేశారు. ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ మేరకు స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేకాక స్టీఫెన్‌సన్‌పై కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఆదేశించారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతవారం వాదనలు విన్న జస్టిస్ శివశంకరరావు సోమవారం ఉదయం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా స్టీఫెన్సన్ తీరుపై జస్టిస్ శివశంకరరావు మండిపడ్డారు. ప్రజాప్రతినిధిననే విషయం మర్చిపోయి, న్యాయమూర్తిపైనే తీవ్ర ఆరోపణలు చేశారని తప్పుపట్టారు. విచారణ జరిగినప్పుడు కోర్టులో లేకుండానే, ఎవరో ఏదో చెప్పారని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో జరిగింది ఎవరు చెప్పారు, వారితో తనకున్న సంబంధం ఏమిటి? తదితర వివరాలను స్టీఫెన్సన్ ఎక్కడా తన పిటిషన్లో పేర్కొనకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. కోర్టులో ఏదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇలా విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయమూర్తులను తప్పించుకుంటూ వెళ్లడమేనని తీర్పులో పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మొత్తం వ్యవస్థ మనుగడకే ప్రమాదమని వ్యాఖ్యానించారు. పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసేందుకు తగిన కారణాలుండాలని... ఒకవేళ కారణమున్నా కూడా న్యాయమూర్తిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరే హక్కు లేదని స్పష్టం చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలనడం గదమాయింపు తప్ప మరొకటి కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ధిక్కారమే.. కోర్టు హాలులో నుంచి తాను న్యాయవాదులందరినీ వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాన నడంలో ఎటువంటి వాస్తవం లేదని, ఇటువంటి ఆరోపణ కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు తన తీర్పులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్-14 కింద నిర్దేశించిన విధివిధానాలకు, దీనిపై హైకోర్టు రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. చర్యలు చేపట్టే ముందు అవసరమైతే నిబంధనల మేరకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రీకి సూచించారు. కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడమంటే... న్యాయమూర్తిగా తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనంటూ సుబ్రతారాయ్-సహారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ శివశంకరరావు తీర్పులో ప్రస్తావించారు. విచారణ నుంచి తప్పుకోవాలని అడిగినంత మాత్రాన తప్పుకోవాల్సిన అవసరం లేదని, ఈ కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిష్పక్షపాత విచారణకు ఇరుపక్షాలూ సహకరించాలన్నారు. సీజే అనుమతిస్తే ప్రొసీడింగ్స్ చిత్రీకరణ ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించామని జస్టిస్ శివశంకరరావు తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో ఆన్ రికార్డ్ ఉన్న న్యాయవాదులు, కేసుతో సంబంధమున్న సీనియర్ న్యాయవాదులు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండబోదని స్పష్టం చేశారు. హైకోర్టులో మొదటిసారిగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, ఇది కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన అనుమతులు తీసుకుని.. ఆడియో, వీడియో రికార్డింగ్ కోసం తగిన ఏర్పాటు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాతే మత్తయ్య పిటిషన్‌ను విచారణకు వేయాలని స్పష్టం చేశారు. -
అరెస్టు ఇక అంత సులువుకాదు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు ‘ఇంపాక్ట్ ఆఫ్ సెక్షన్ 41(ఏ)’పై సదస్సు సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కొత్తగా తీసుకువచ్చిన సెక్షన్ 41(ఏ) సవరణతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయడం ఇకపై అంత సులువు కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు చెప్పారు. ఈ సవరణ దుర్వినియోగం కాకుండా నిలువరించే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయని న్యాయవాదులకు ఉద్భోదించారు. ‘ఇంపాక్ట్ ఆఫ్ సెక్షన్ 41(ఏ) సీఆర్పీసీ’ అంశంపై న్యాయవాద పరిషత్ ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సును జస్టిస్ శివశంకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అరెస్ట్ అనేది న్యాయపరమైన అవసరాల కోసమేననే విషయం చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తిని అరెస్టు చేయాల్సి వస్తే సరైన కారణాలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని తెలిపారు. పోలీస్ అధికారి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించాక ఆ వ్యక్తి వల్ల మరో నేరం జరగకుండా నియంత్రించాల్సిన పరిస్థితి ఉంటేనే అరెస్ట్ చేయాలన్నారు. ఏడేళ్లకు మించని శిక్ష పడే కేసుల్లో అరెస్ట్‌కు ముందు తప్పనిసరిగా నోటీసు జారీ చేయాలన్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. ఓ ప్రేమోన్మాది నుంచి కుటుంబ సభ్యులను ర క్షించేందుకు ఒక తండ్రి చేసిన ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిందేనన్నారు. అప్పా డెరైక్టర్ డాక్టర్ ఎం.మాలకొండ య్య మాట్లాడుతూ.. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా తొందరపాటుతో అరెస్ట్‌లు చేయవద్దని మాజీ డీజీపీలు అరవిందరావు, హెచ్‌జె దొర ఆనాడే సర్క్యులర్లు జారీచేశారని చెప్పారు. అయితే.. కొన్నిచోట్ల పొరపాట్లు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సదస్సులో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, సిటీ యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, హరీశ్ తదిరులు పాల్గొన్నారు.