'మత్తయ్య పిటిషన్' విచారణ నుంచి తప్పుకోవాలని కోరడంపై జస్టిస్ శివశంకరరావు
- ఎవరో ఏదో చెప్పారని న్యాయమూర్తిపైనే ఆరోపణలా?
- ఆధారాల్లేకుండా విచారణ నుంచి తప్పుకోవాలని అంటారా?.. ఇలాంటివి వ్యవస్థ మనుగడకే ముప్పు
- స్టీఫెన్‌సన్ తీరు కోర్టు ధిక్కారమే..
- ఆయనపై చర్యలు చేపట్టాలంటూ రిజిస్ట్రీకి ఆదేశం
- అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి
- అవసరమైతే మత్తయ్య పిటిషన్‌పై విచారణను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని వెల్లడి
- సీజే నుంచి అనుమతులు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం... ఆ తర్వాతే విచారణ చేపడతామని స్పష్టం
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు'వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలంటూ నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు స్పష్టం చేశారు. ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ మేరకు స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేకాక స్టీఫెన్‌సన్‌పై కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఆదేశించారు.
మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్‌సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతవారం వాదనలు విన్న జస్టిస్ శివశంకరరావు సోమవారం ఉదయం తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా స్టీఫెన్‌సన్ తీరుపై జస్టిస్ శివశంకరరావు మండిపడ్డారు. ప్రజాప్రతినిధిననే విషయం మర్చిపోయి, న్యాయమూర్తిపైనే తీవ్ర ఆరోపణలు చేశారని తప్పుపట్టారు. విచారణ జరిగినప్పుడు కోర్టులో లేకుండానే, ఎవరో ఏదో చెప్పారని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో జరిగింది ఎవరు చెప్పారు, వారితో తనకున్న సంబంధం ఏమిటి? తదితర వివరాలను స్టీఫెన్‌సన్ ఎక్కడా తన పిటిషన్‌లో పేర్కొనకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. కోర్టులో ఏదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు.
ఇలా విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయమూర్తులను తప్పించుకుంటూ వెళ్లడమేనని తీర్పులో పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మొత్తం వ్యవస్థ మనుగడకే ప్రమాదమని వ్యాఖ్యానించారు. పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసేందుకు తగిన కారణాలుండాలని... ఒకవేళ కారణమున్నా కూడా న్యాయమూర్తిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరే హక్కు లేదని స్పష్టం చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలనడం గదమాయింపు తప్ప మరొకటి కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కోర్టు ధిక్కారమే..
కోర్టు హాలులో నుంచి తాను న్యాయవాదులందరినీ వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాన నడంలో ఎటువంటి వాస్తవం లేదని, ఇటువంటి ఆరోపణ కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు తన తీర్పులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్-14 కింద నిర్దేశించిన విధివిధానాలకు, దీనిపై హైకోర్టు రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. చర్యలు చేపట్టే ముందు అవసరమైతే నిబంధనల మేరకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రీకి సూచించారు.
కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడమంటే... న్యాయమూర్తిగా తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనంటూ సుబ్రతారాయ్-సహారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ శివశంకరరావు తీర్పులో ప్రస్తావించారు. విచారణ నుంచి తప్పుకోవాలని అడిగినంత మాత్రాన తప్పుకోవాల్సిన అవసరం లేదని, ఈ కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిష్పక్షపాత విచారణకు ఇరుపక్షాలూ సహకరించాలన్నారు.
సీజే అనుమతిస్తే ప్రొసీడింగ్స్ చిత్రీకరణ
ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించామని జస్టిస్ శివశంకరరావు తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసు విచారణలో ఆన్ రికార్డ్ ఉన్న న్యాయవాదులు, కేసుతో సంబంధమున్న సీనియర్ న్యాయవాదులు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండబోదని స్పష్టం చేశారు. హైకోర్టులో మొదటిసారిగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, ఇది కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన అనుమతులు తీసుకుని.. ఆడియో, వీడియో రికార్డింగ్ కోసం తగిన ఏర్పాటు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాతే మత్తయ్య పిటిషన్‌ను విచారణకు వేయాలని స్పష్టం చేశారు.