ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి స్పష్టీకరణ
* కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదైనా విచారణ జరగాల్సింది ఇక్కడే
* ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీస్‌స్టేషన్లు ఉండవు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరంపై తమ వద్ద ఉన్న ఆధారాలతో సీఆర్‌పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద ఎవరినైనా విచారించే విశేషాధికారాలు ఏసీబీకి ఉన్నాయని మాజీ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి ఆధారాలుంటే ఆయనకూ నోటీసులివ్వొచ్చన్నారు.
‘ఓటుకు కోట్లు’ కేసు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ ్యంలో దినేష్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..
⇒ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఫిర్యాదు మేరకు ఏసీబీ స్టింగ్ ఆపరే షన్ నిర్వహించింది. దీనికి ఆడియో విజువల్ సాక్ష్యాలున్నాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుగుతోంది. ఏసీబీ దర్యాప్తులో నిందితులుగా భావించిన వారెవరికైనా, సీఎంకైనా నోటీసులు జారీచేసే అధికారాన్ని సీఆర్‌పీసీ కల్పిస్తోంది. దీనికి ఎవరి అనుమతులూ అక్కర్లేదు.
⇒గవర్నర్ రాజ్యాంగబద్ధంగా పనిచేసే పౌరుడు. రెండు రాష్ట్రాల గవర్నర్‌గా ఆయనకు రెండు ప్రాంతాల ప్రజలూ ముఖ్యమే. పక్షపాతంగా వ్యవహరిస్తారని నేననుకోను. రెండు రాష్ట్రాల వివాదంలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోదు. గవర్నర్‌కే బాధ్యతను అప్పగిస్తుంది.
⇒ కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదైనా.. ట్యాపింగ్ హైదరాబాద్‌లోజరిగిందంటున్నప్పుడు విచారణా ఇక్కడే జరగాలి. ఇక్కడ కేసులు పెడితే న్యాయం జరగదని ఏపీ ప్రభుత్వం భావిస్తే గవర్నర్ ఈ అంశాన్ని కోర్టుకే అప్పగిస్తారు. హైదరాబాద్ టీ సర్కార్, పోలీసుల పరిధిలో ఉంది. ఇక్కడ వేరే రాష్ట్రాలకు చెందిన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం సరికాదు.
⇒ సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు నష్టం కలిగించే విధంగా టీ సర్కార్, పోలీసులు వ్యవహరిస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు. కానీ మొత్తం శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్లడం అనేది కాదు. కేవలం రాష్ట్రపతి పాలనలో మాత్రమే రాష్ట్ర శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ పర్యవేక్షిస్తారు.