‘బాస్’పై ఏసీబీ దృష్టి!
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై నిగ్గుతేల్చేందుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం టీడీపీ చేసిన కుట్రలో ‘పెద్ద’ల పాత్రను నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చినబాబు నారా లోకేశ్‌పై దృష్టిసారించిన ఏసీబీ... తదుపరి చర్యగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు మరి కొందరు నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రహస్యంగా చిత్రీకరించిన వీడియోలో రేవంత్ పదే పదే తమ ‘బాస్’ ఆదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లుగా ఆడియో రికార్డు సైతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో, ఆడియో టేపులు సైతం నిజమైనవే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ సైతం ధ్రువీకరించింది. దీంతో వారి స్వర నమూనాలపై దృష్టిపెట్టిన ఏసీబీ... ఇప్పటికే ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల వాయిస్ స్యాంపిల్స్‌ను అసెంబ్లీ రికార్డుల నుంచి తెప్పించుకొని వాటిని పరీక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు ‘మా వాళ్లు బ్రీఫుడ్ మీ’ అంటూ మాట్లాడిన ఆడియోను వాస్తవమైనదిగా ఎఫ్‌ఎస్‌ఎల్ ధ్రువీకరించడంతో ఆయన స్వర నమూనా కోసం ఏసీబీ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలు రేవంత్, సండ్రల మాదిరిగా కోర్టును ఆశ్రయించి అసెంబ్లీ రికార్డుల నుంచి తెప్పించుకోవాలా..? లేదా అనుమతి తీసుకొని తాజాగా ఆయన వాయిస్‌ను నమోదు చేసుకోవాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.
ఆశ్రయమిచ్చిన వారికి నోటీసులు
‘ఓటుకు కోట్లు’ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేసిన వారు హాజరు కాకపోవడంతో ఏసీబీ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. విచారణకు డుమ్మా కొడుతున్న వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డితోపాటు నెల క్రితం నోటీసులు అందుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు సైతం ఏపీలో ఆశ్రయం పొందిన ప్రాంతాలను ఏసీబీ గుర్తించింది. వీరితోపాటు కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్న జెరూసలెం మత్తయ్య సైతం ఏపీలో ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను మూసేయడంతో అతను ఉద్దేశపూర్వకంగా తప్పించుకు తిరుగుతున్నట్లు ఏసీబీ అభిప్రాయపడుతోంది.
విచారణ నుంచి తప్పించుకొని తిరుగుతున్న వారికి ఏపీలో కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఆశ్రయం ఇచ్చినట్లు పక్కా ఆధారాలను సేకరించింది. దీంతో వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు ఒకట్రెండు రోజుల్లో పలువురు రాజకీయ నేతలు, పోలీసు అధికారులకు నోటీసులిచ్చే అవకాశం ఉంది.