వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?  | Sakshi Guest Column On Indian Population | Sakshi
Sakshi News home page

వృద్ధ భారత్‌కు పరిష్కారమేది? 

Published Thu, Aug 4 2022 2:12 AM | Last Updated on Thu, Aug 4 2022 2:12 AM

Sakshi Guest Column On Indian Population

భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2061 నాటికి దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి 60 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు. ఒక దేశంగా, కుటుంబాలు, వ్యక్తులుగా ఇంత వేగంగా పెరుగుతున్న ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న. పైగా భారత్‌ సంపన్న దేశం కావడానికి ముందే వృద్ధాప్యంలో కూరుకుపోనుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, ముసలివాళ్లలోనే దారిద్య్ర స్థాయి ఎక్కువ. వీరిలో ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేవారు 52 శాతం కాగా, పాక్షికంగా ఆధారపడేవారు 18 శాతం. తప్పనిసరి ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు అరవై ఏళ్లు దాటినా పని చేస్తున్నారు. కార్పొరేట్లు, పౌర సమాజం తోడ్పాటుతో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో క్రియాశీలకమైన విధానాలతో వృద్ధాప్య సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే, ప్రస్తుతం మన యువత పేలవమైన నైపుణ్యాలతో సతమతమవుతున్నట్లుగానే భవిష్యత్తులో వృద్ధాప్యం కూడా పరిష్కరించలేని సమస్యగా మారిపోతుంది. 

దశాబ్దాలుగా సంతాన నిరోధక చర్యలు, మరణాల రేటును తగ్గించడంలో భారత్‌ ఎంతో సముచితంగా వ్యవహరించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జనాభాపరమైన పరివర్తన కారణంగా దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలకు పైబడిన జనాభా పెరుగుతున్న పరిస్థితి వైపు మనం అడుగు లేస్తున్నాము. అయితే ప్రభుత్వం, పలు ఇతర ఏజెన్సీలు వెలువరించిన జనాభా ధోరణులను  పరిశీలిస్తే... వృద్ధాప్యం భారత్‌కు ఆందోళనకరమైన సమస్యగా మారబోతోంది. ఇది రాజకీయపరంగా, విధానపరంగా తీవ్రమైన, తక్షణ ప్రభావాలను కలిగించనుంది.

యాభై ఏళ్లలో నాలుగు రెట్లు
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభా మొత్తంలో వృద్ధుల శాతం (8.6 శాతం) తక్కువ గానే కనిపిస్తున్నప్పటికీ, వృద్ధుల సంఖ్య (10.4 కోట్లు) ఎక్కువగానే ఉంది. 2036 నాటికి ఇది రెట్టింపై 22.5 కోట్లకు పెరగనుందనీ, 2061 నాటికి 42.5 కోట్లకు చేరనుందనీ అంచనా. అంటే 50 ఏళ్లలో వీరి సంఖ్య నాలుగు రెట్లు పెరగనుంది. మొత్తం జనాభాలో వృద్ధుల నిష్పత్తి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటోంది. ఈశాన్య, మధ్య భారత రాష్ట్రాల్లో తక్కువగానూ, దక్షిణాదిలో ఎక్కువగానూ ఉంది. బిహార్‌లో ఇది 7.4 శాతం కాగా, కేరళలో 12.6 శాతం. ఈ లెక్కప్రకారం, 2041 నాటికి బిహార్‌లో 11.6 శాతం, కేరళలో 23.9 శాతానికి పెరుగుతుందని అంచనా. వివిధ రాష్ట్రాల్లో వృద్ధుల కోసం ప్రణాళికలు రూపొందిం చడానికి విభిన్నమైన వైఖరి చేపట్టవలసిన అవస రాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

భారతదేశంలో వృద్ధాప్యం శరవేగంతో విస్తరి స్తోంది. ఫ్రాన్స్, స్వీడన్‌లలో వీరి జనాభా 7 నుంచి 14 శాతానికి అంటే రెట్టింపు కావడానికి 110, 80 సంవత్సరాల సమయం పట్టింది. కానీ భారత్‌లో ఈ పరిణామం సంభవించడానికి 20 ఏళ్లు మాత్రమే పడుతుందని అంచనా. 2011 నుంచి 2061 వరకు, అంటే 50 ఏళ్ల కాలంలో మన జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 32 కోట్లకంటే ఎక్కువ కాబోతోందని అంచనా. 2030 నాటికి జనాభాలో 12.5 శాతం అవుతుందనీ, 2050 నాటికి 20 శాతానికి చేరుకుంటుందనీ అంచనా. 2061కి 25 శాతం కానుంది. అంటే అప్పటికి భారతీయుల్లో ప్రతి నాలుగో వ్యక్తి 60 ఏళ్లకు పైబడినవారే అయివుంటారు. ఒక దేశంగా, కుటుంబాలు, వ్యక్తులుగా ఈ సమస్యను ఎదు ర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న.

అరవై దాటినా తప్పని పని
భారత్‌ సంపన్న దేశం కావడానికి ముందే వృద్ధాప్యంలో కూరుకుపోనుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ 2012లో చేసిన అధ్యయనం ప్రకారం, ముసలివాళ్లలోనే దారిద్య్ర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేవారు 52 శాతం కాగా, పాక్షికంగా ఆధారపడేవారు 18 శాతం. తప్పనిసరి ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరిలో చాలామంది పని చేయడం కొనసాగిస్తున్నారు. 2019–20లో మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద లబ్ధి పొందినవారిలో 93 లక్షల మంది 61 ఏళ్ల పైబడిన వారే అనేది దీనికి రుజువుగా నిలుస్తోంది. 2021లో ఈ పథకం కింద లబ్ధిపొందిన వారిలో 10 శాతం మంది 61, లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారే.

భారతదేశంలోని శ్రామికుల్లో 90 శాతం మంది అనియత రంగంలోనే ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వీరు పొదుపు చేయగలిగేది సాపేక్షికంగా తక్కువే కాబట్టి, సామాజిక రక్షణ పెద్దగా ఉండదనేది వాస్తవం. పెన్షన్‌ అందు కుంటున్నవారిలో 85 శాతం మంది ఆహారం, ఇతర జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసమే తమ పించన్‌ ఉపయోగించుకుంటూ ఉంటారు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన వారిలో 10 శాతం (సుమారు కోటిమంది) మంది శారీరకంగా కదలలేని స్థితిలో ఉంటున్నారు. మరో పది శాతం మంది ప్రతి సంవత్సరం ఆసుపత్రి పాలవు తుంటారు. 

ఇక 70 సంవత్సరాల వయస్సులో 50 శాతం మంది ఒకటి లేదా ఎక్కువ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక 60 నుంచి 84.1 సంవత్సరాల పైబడిన వారిలో ప్రతి 1000 మందిలో 51.8 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. అదే సాధారణ జనాభాలో వెయ్యిమందిలో 22.1 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. మన దేశంలో ముసలివాళ్లకు ఎన్నో పథకాలు ఉంటున్నాయి కానీ అవి వారి జీవితాలపై అర్థవంతమైన ప్రభావం కలిగించడం లేదు.

1999లో వృద్దుల విషయంలో ఒక జాతీయ విధానాన్ని దేశం తీసుకొచ్చింది. తర్వాత సంవత్స రాలపాటు విధాన పథకాలను అమలు చేశారు. చెప్పాలంటే వృద్ధాప్యంపై ‘మాడ్రిడ్‌ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను ముందుకు తీసుకుపోయిన ఘనత భారత్‌కు దక్కాలి. ఒకరకంగా ఆ ప్లాన్‌ని భారత్‌ ప్రభావితం చేసిందని కూడా చెప్పాల్సి ఉంటుంది. వృద్ధుల జనాభా భారీ సంఖ్యలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలు పంచాయతీ స్థాయి నుంచి వృద్ధుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ వచ్చాయి. గత రెండేళ్లకాలంలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కొన్ని సృజనాత్మకమైన పరిష్కా రాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అయినా కూడా వీటిని పూర్తిగా అమలు చేయడానికి ఈ శాఖకు ఆర్థిక మద్దతు కష్టంగా ఉంటోంది. కాబట్టి వృద్ధుల పేలవమైన ఆర్థిక ప్రతిపత్తి, అమల వుతున్న పథకాలకు ఆర్థిక మద్దతు లేకపోవడం నేపథ్యంలో ఈ అంశంపై అత్యున్నత స్థాయిలో రాజకీయ జోక్యం అవసరం.

విధానపరమైన జోక్యం అవసరం
ఈ రంగానికి సంబంధించినంతవరకు తైవాన్, చైనా వంటి దేశాల అనుభవాల నుంచి మనం నేర్చుకోవలిసింది చాలానే ఉంది. కార్పొరేట్లు, పౌర సమాజం తోడ్పాటుతో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో క్రియాశీలకమైన విధానాలు, కార్య క్రమాలను చేపట్టడం ద్వారా వృద్ధాప్య సమస్యలను ఇప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే, ప్రస్తుతం మన యువత పేలవమైన నైపుణ్యాలతో సతమతమవుతున్నట్లు గానే, వృద్ధాప్య సమస్య కూడా పరిష్కరించలేని సమస్యగా మారిపోతుంది. దశాబ్దాలకు ముందు నుంచే యువత సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్ల వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గ్రహించాలి. దేశ సామూహిక చైతన్యం నుంచి వృద్ధులు పక్కకు తొలిగే పరిస్థితిని భారత్‌ భరించలేదు. 
 

– వెంకటేశ్‌ శ్రీనివాసన్, దేవీందర్‌ సింగ్‌
‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫంఢ్‌’లో
ఇండియా మాజీ ఉద్యోగులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement