ప్రమీల జయపాల్, అమిబేరా
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.
అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment