Immigration Department
-
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
అమెరికాలో భారత విద్యార్థుల హవా
వాషింగ్టన్: అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ విభాగం శుక్రవారం విడుదలచేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం 2017లో అమెరికాలో 2,49,763 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ జాబితాలో 4,81,106 మంది విద్యార్థులతో చైనా తొలిస్థానంలో నిలవగా, దక్షిణకొరియా(95,701), సౌదీ అరేబియా(72,358), జపాన్(41,862) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక 24 నెలల గడువుండే సైన్స్–టెక్నాలజీ–ఇంజనీరింగ్–గణితం(స్టెమ్) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో సైతం భారతీయ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఇమిగ్రేషన్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికాలో స్టెమ్ డిగ్రీ విద్యార్థులకు అదనంగా ఉండే ఈ కోర్సులో గతేడాది 89,839 మంది విదేశీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. వీరిలో భారతీయులు(53,507 మంది) తొలిస్థానంలో ఉండగా, చైనీయులు(21,705), దక్షిణకొరియా (1,670), తైవాన్(1,360), ఇరాన్(1,161) విద్యార్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు. ట్రంప్‌పై విద్యా సంస్థల న్యాయపోరాటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం వీసా విధానంలో చేపట్టిన మార్పులపై 4 అమెరికన్ విద్యాసంస్థలు దావా వేశాయి. ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారత్ సహా విదేశాల నుంచి తమ కళాశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుందని గుల్ఫోర్డ్ కాలేజ్ ఇంటర్నేషనల్ క్లబ్, ది న్యూ స్కూల్, ఫుట్‌హిల్ డీ అన్జా కమ్యూనిటీ కాలేజ్, హెవర్ఫోర్డ్ కాలేజ్‌లు డిస్ట్రిక్ కోర్ట్ ఇన్ నార్త్ కరోలినాను ఆశ్రయించాయి. ప్రపంచానికి విద్యా కేంద్రంగా భాసిల్లుతున్న అమెరికా తన ప్రాభవాన్ని కోల్పోతుందన్నాయి. -
ఇంగ్లీష్‌లో ఓవర్ క్వాలిఫై : వీసా తిరస్కరణ
ఇంగ్లీష్‌లో ఓవర్ క్వాలిఫై అయిందని ఓ భారతీయ మహిళ వీసా అప్లికేషన్‌ను యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్కు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇంగ్లీష్ భాషలో ఆమె నైపుణ్యం కలిగి ఉన్నట్టు అధికారులు చెప్పడం గమనార్హం. అలెగ్జాండ్రియా రింటుల్.. మేఘాలయలోని షిల్లాంగ్ ప్రాంతానికి చెందిన ఆమె. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్‌లో అడ్వాన్స్డ్ వెర్షన్లో ఆమె పాస్ అయ్యారు. కానీ వీసాకు అవసరమయ్యే ఎగ్జామ్ చాలా తేలికగా ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్‌ను పాస్ అవ్వాలంటూ అలెగ్జాండ్రియా వీసాను తిరస్కరించారు. దీనికి రుజువుగా ఐలెట్స్ సర్టిఫికేట్‌ను అందజేయాలని, అయితే ఈ ప్రమాణపత్రం యూకేవీ కోసం ఆమోదయోగ్యమైన ఐలెట్స్ సర్టిఫికేట్ కాదని గుర్తించినట్టు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఓ లెటర్‌ను అలెగ్జాండ్రియాకు పంపించింది. అంతేకాక అలెగ్జాండ్రియా ఇంగ్లీష్‌పై కూడా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ అనుమానాలు వ్యక్తంచేసింది. మెజార్టీ ఇంగ్లీష్ మాట్లాడే భాషా దేశాల జాబితాలో కూడా అలెగ్జాండ్రియా దేశం లేదని పేర్కొంది. అలెగ్జాండ్రియా ఈ క్రిస్మస్ ను స్కాటిష్ నేషనల్లో ఉంటున్న తన భర్త బాబీ రింటుల్తో జరుపుకోవాలని వీసాను దరఖాస్తు చేసుకున్నారు. కానీ యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె వీసాను తిరస్కరించారు. యూకే ప్రభుత్వం కనీసం పార్టనర్, డిపెండెంట్ లేదా జీవిత భాగస్వామిగా పరిగణించి ఈ తిరస్కరణ చేపట్టకుండా ఉండాల్సిందని అలెగ్జాండ్రియా అన్నారు. భారత్ ఇంగ్లీష్ మాట్లాడే దేశం కాదనే రుజువు వారి వద్ద లేదని తెలిపారు. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ మీడియాను ఆమె మౌంట్ కార్మెల్ కాలేజీ బెంగళూరులో అలెగ్జాండ్రియా చదువుకున్నారు. మే 2న స్కాటిష్ జాతీయుడిని ఆమె వివాహం చేసుకున్నారు. మరోసారి వీసాను రీఅప్లయ్ చేశానని, ఇదంతా చాలా ఖరీదుతో కూడుకున్నదని చెప్పారు. ప్రతి వీసా డాక్యుమెంట్ 2వేల బ్రిటిష్ పౌండ్ల అని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆప్షన్ లేదని అలెగ్జాండ్రియా చెప్పారు. -
పోలీసులను పరుగులు పెట్టించారు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో విహారయాత్రకు వచ్చిన నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువతులు ముంబైతో పాటు సిటీ పోలీసుల్నీ పరుగులు పెట్టించారు. వారం రోజుల క్రితం ముంబైలో అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ఏకంగా యూఏఈ కాన్సులేట్ రంగంలోకి దిగింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన ముంబై పోలీసులు ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంలో హైదరాబాద్ లింకు సంపాదించారు. సోమవారం సిటీకి వచ్చిన ముంబై పోలీసు టీమ్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారుల సాయంతో నలుగురి ఆచూకీ కనిపెట్టగలిగారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ముంబై పోలీసులు కాన్సులేట్ ముందు హాజరుపరచడానికి నలుగురినీ తీసుకుని వెళ్ళారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న మిష్రీగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు కొన్నేళ్ళ క్రితం దుబాయ్‌కు వలసవెళ్ళారు. అక్కడే దుబాయ్ షేక్ల్ని వివాహం చేసుకుని స్థిరపడ్డారు. వీరికి జన్మించిన ఇద్దరు యువతులకు యూఏఈ పౌరసత్వం వచ్చింది. ప్రస్తుతం దాదాపు 18 ఏళ్ళ వయస్సులో ఉన్న వీరిద్దరితో పాటు వీరి స్నేహితులైన మరో ఇద్దరూ విహారయాత్ర కోసం భారత్‌కు బయలుదేరారు. గత మంగళవారం ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆపై వీరు తల్లిదండ్రులతో టచ్‌లో లేకుండా పోయారు. రెండు రోజుల పాటు ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆచూకీ లేకపోవడంతో తీవ్రంగా ఆందోళనకు లోనయ్యారు. విషయాన్ని యూఏఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు ముంబైలో ఉన్న యూఏఈ కాన్సులేట్‌ను అప్రమత్తం చేశారు. దుబాయ్ నుంచి సమాచారం అందడంతో రంగంలో దిగిన కాన్సులేట్ అధికారులు నలుగురు యువతుల ఆచూకీ కనిపెట్టాల్సిందిగా కోరుతూ ముంబై పోలీసు కమిషనర్ దత్త పద్సాల్గికర్‌కు అధికారిక పత్రం అందించారు. మరోపక్క యూఏఈ కాన్సులేట్ నుంచి సమాచారం అందుకున్న విదేశీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖల అధికారులూ ముంబై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ముంబై పోలీసు కమిషనర్ వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. మూడు రోజుల పాటు అక్కడి అనేక ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. అయితే ప్రత్యేక బృందం శనివారం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని కలిసి ఈ యువతుల విషయం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే వారు ఇమ్మిగ్రేషన్ చెక్‌లో భాగంగా తాము నలుగురం హైదరాబాద్‌లోని హుస్సేనిఆలంలో ఉంటున్న ఇరువురి బంధువుల వద్దకు వెళ్తున్నట్లు నమోదు చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న ముంబై పోలీసులు సీసీఎస్ పోలీసుల సహాయం కోరారు. సోమవారం ఉదయం సీసీఎస్ స్పెషల్ టీమ్స్ సాయంతో పాతబస్తీకి వెళ్ళిన ముంబై పోలీసులు అక్కడి హుస్సేని ఆలంలో ఉన్న యువతుల బంధువుల ఇల్లు గుర్తించారు. యూఏఈకి చెందిన నలుగురూ అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అదృశ్యంపై ముంబై పోలీసులు నలుగురు యువతుల్నీ ప్రశ్నించారు. తాము అదృశ్యం కాలేదని, యూఏఈలో తీసుకున్న తన సెల్‌ఫోన్ సిమ్‌కార్డులకు ఇంటర్నేషనల్ రోమింగ్ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్త సిమ్‌కార్డులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దానికి కొంత సమయం పట్టడంతోనే తల్లిదండ్రుల్ని సంప్రదించలేకపోయామని వివరించారు. ఈ నలుగురినీ ముంబై తీసుకువెళ్ళిన పోలీసులు అక్కడి కాన్సులేట్ అధికారులు ముందు హాజరుపరచనున్నారు. -
ఇక లాటరీ ద్వారా హెచ్1బీ వీసా..
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం అమెరికా మంజూరు చేసే హెచ్ 1బీ వీసాలకు పోటీ పెరిగింది. ద్రవ్యోల్భణంతో ఆర్థిక ప్రగతి మందగించి తిరిగి 2011లో పుంజుకున్న తర్వాత అమెరికాలోని సంస్థల్లో పనిచేయాలని నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఏటా ఈ వీసాల కోసం ఎక్కువగా భారత్ నుంచే దరఖాస్తులు వస్తుంటాయి. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తులు చేస్తుంటాయి. అయితే దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి వీసాలు మంజూరు చేయనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది. అంటే నైపుణ్యంతోపాటూ అశావహులకు కూడా అదృష్టం ఉండాలన్నమాట. ఇంతకు ముందు(గత ఆర్థిక ఏడాదికి గానూ) మంజూరు చేసిన హెచ్1-బీ వీసాలకు మూడు రేట్ల దరఖాస్తులు అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించింది. వీటికి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. వీరిలో అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి 20,000 హెచ్1బీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. -
హెచ్1బీ వీసాలకు 2.5 లక్షల దరఖాస్తులు
ఇచ్చేవి 65 వేలు.. డ్రా ద్వారా త్వరలో ఎంపిక వాషింగ్టన్: అమెరికాలోని సంస్థల్లో పనిచేసేందుకు విదేశీ నిపుణులకిచ్చే హెచ్1బీ వీసాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించగా, ఇప్పటివరకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి ఇచ్చే 20,000 హెచ్1బీల కోసం అంతకు రెండింతలమంది దరఖాస్తు చేసుకున్నారంది. వీటన్నింటిలో అర్హమైన వాటిని ఎంపిక చేసి, కంప్యూటరైజ్డ్ డ్రాలో ఎంపికైనవారికి త్వరలో వీసాలు మంజూరు చేస్తామని తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది.