హెచ్1బీ వీసాలకు 2.5 లక్షల దరఖాస్తులు
ఇచ్చేవి 65 వేలు..
డ్రా ద్వారా త్వరలో ఎంపిక
వాషింగ్టన్: అమెరికాలోని సంస్థల్లో పనిచేసేందుకు విదేశీ నిపుణులకిచ్చే హెచ్1బీ వీసాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించగా, ఇప్పటివరకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి ఇచ్చే 20,000 హెచ్1బీల కోసం అంతకు రెండింతలమంది దరఖాస్తు చేసుకున్నారంది. వీటన్నింటిలో అర్హమైన వాటిని ఎంపిక చేసి, కంప్యూటరైజ్డ్ డ్రాలో ఎంపికైనవారికి త్వరలో వీసాలు మంజూరు చేస్తామని తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది.