విశ్లేషణ
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.
అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్‌లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు.
మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.
2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.
ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.
ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు.
కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.
ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది.
అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు.
1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్‌జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్‌సైట్‌లో అసలు పేరు నమ్రతా రణ్‌ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను.
ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.
ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.
అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది.
ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.
సందీప్ రాయ్
వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్
(‘మింట్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment