
ఇండియన్ అమెరికన్ల ఓటు ఎవరికో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లలో భారత సంతతి అమెరికన్లు ఎవరికి ఓటేయనున్నారు? అమెరికాలో ప్రభావవంతమైన కమ్యూనిటీల్లో ఒక్కటైన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఎవరికి మద్దతుగా నిలువనుంది?.. అనేదానిపై తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇమ్మిగ్రేషన్, మతస్వేచ్ఛ, ఔట్ సోర్సింగ్ వంటి విషయాల్లో ఇండియన్ అమెరికన్స్ ట్రంప్ కన్నా హిల్లరీ క్లింటన్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తేలింది.
ఇమ్రిగ్రేషన్ విషయంలో హిల్లరీకి 59శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతుగా నిలువగా.. ట్రంప్‌కు 29శాతం మంది ఓటువేస్తామని చెప్పారు. ఇక మత స్వేచ్ఛ విషయంలో హిల్లరీకి 67శాతం మంది, ట్రంప్‌కు 27శాతం మంది, ఔట్‌సోర్సింగ్ విషయంలో హిల్లరీకి 52శాతం మంది, ట్రంప్‌కు 22శాతం మంది మద్దతు పలికారని తమ సర్వేలో తేలిందని ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డయాస్పొర స్టడీస్ తెలిపింది.
అయితే, ఉగ్రవాదం విషయంలో హిల్లరీ కన్నా ట్రంప్‌కే ఇండియన్ అమెరికన్లు కొంచెం ఎక్కువ మద్దతు పలికారు. ఈ విషయంలో హిల్లరీకి 43శాతం మంది, ట్రంప్‌కు 48శాతం మంది అండగా నిలిచారు. భారత్‌తో సంబంధాల విషయంలోనూ హిల్లరీ (40శాతం మంది) కన్నా ట్రంప్‌కే (47శాతంమంది) ఎక్కువమొగ్గు ఉండటం గమనార్హం. మొత్తంగా ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ట్రంప్ కన్నా హిల్లరీకే ఇండియన్ అమెరికన్ల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.