అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే! | US Presidential Electios 2024: Here's The Details Of 6 Indian Americans Who Win Elections Of House Of Representatives | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్నారైలు.. ఎంతమంది గెలిచారంటే!

Published Wed, Nov 6 2024 4:04 PM | Last Updated on Wed, Nov 6 2024 4:57 PM

US Election Results: Indian Americans who win elections of House of Representatives

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నారు. పాపులర్‌ ఓటింగ్‌ ద్వారానే ఆయన తన గెలుపును ఖరారు చేశారు. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతి పౌరులు (ఎన్నారై) సైతం తమ సత్తా చాటారు. 

అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. వీరిలో ఆరుగురు విజయాన్ని సొంతం చేసుకున్నారు.  మరోసారి బరిలోకి దిగిన ఐదుగురు సీనియర్‌ నాయకులు.. విజయాన్ని దక్కించుకున్నారు.

1. రాజా కృష్ణమూర్తి(51): డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన బలమైన నాయకుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌(8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి వరుసగా అయిదోసారి గెలుపొందారు.  2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2. రో ఖన్నా(48): డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన రో ఖన్నా..2017 నుంచి కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడే బరిలో దిగిన ఆయన మరోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి అనితా చెన్‌ను ఓడించి విజయం సాధించారు.

3. సుహాస్‌ సుబ్రమణ్యం(38): డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా వర్జీనియా (10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి బరిలో దిగిన సుహాస్‌ సుబ్రమణ్యం.. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మైక్‌ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన... డెమొక్రాట్లకు కంచుకోట  రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సుబ్రమణ్యన్‌ రికార్డు సృష్టించారురు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్‌ హౌస్‌ సలహాదారుగా కూడా సుహాస్‌ పనిచేశారు.

4. శ్రీథానేదార్‌(69): మిచిగాన్‌ (13వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్‌  విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల  తేడాతో ఓడించి, రెండవసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

5. డాక్టర్‌ అమిబెరా(59): వృత్తి పరంగా వైద్యుడు అయిన అమిబెరా.. సీనియర్‌ మోస్ట్‌ ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యుడు.2013 నుంచి కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు.

6. ప్రమీలా జయపాల్(59): డెమోక్రటిక్‌ నేత ప్రమీలా జయపాల్ వాషింగ్టన్( 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌) నుంచి 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత  డాన్ అలెగ్జాండర్‌ను  ఓడించి తిరిగి ఎన్నికయ్యారు.

అమిష్‌ షా: భారతీయ సంతతికి చెందిన అమిష్ షా... అరిజోనా(1వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతను రిపబ్లికన్‌కు చెందిన  డేవిడ్ ష్వీకర్ట్‌ కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డేవిడ్‌ స్క్యూకెర్ట్‌తో అమిష్‌ తలపడుతుండడం గమనార్హం.  కాగా అరిజోనా రాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడు సార్లు(2018, 2020, 2022) ఎన్నికయ్యారు షా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement