వైట్హౌస్లో ఎన్నారైల హవా!
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇప్పటికే నిరూపించుకున్న ఇండియన్స్ ప్రభుత్వ ఉన్నత పదవుల్లోనూ పాగా వేస్తున్నారు. అమెరికా సర్కారులో పదవులు దక్కించుకుంటున్న ఎన్నారైల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా 2013 ప్రవాసులకు బాగా కలిసొచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు సంఖ్యలో ఎన్నారైలకు వైట్హౌస్లో పదవులు దక్కడం విశేషం.
అమెరికాలో 30 లక్షలకు పైగా జనాభాతో బలమైన వర్గంగా విరాజిల్లుతున్న భారతీయులకు అధ్యక్ష భవనంలో ఈ ఏడాది సముచిత రీతిలో పదవులు దక్కాయి. 50 మందిపైగా ఎన్నారైలు శ్వేతసౌధంలో పదవులు దక్కించుకున్నారు. ఇందులో 12 మందిపైగా కీలక స్థానాల్లో కొలువుదీరారు. వైట్హౌస్లో ఇంతమందికి ముఖ్యమైన పదవులు ఇదే తొలిసారి. ఒబామా సర్కారులో ఐదుగురు ఇండియన్-అమెరికన్స్ అత్యంత కీలక స్థానాల్లో ఉన్నారు. వీరి నియామకానికి సెనేట్ ఆమోదం కూడా లభించింది.
యూఎస్ ఎయిడ్ సారథిగా కొనసాగుతున్న రాజీవ్ షా అత్యంత ఉన్నత పదవిలో ఉన్న ఎన్నారై. ఈ ఏడాది జరిగిన నియామకాల్లో నిషా దేశాయ్ బిశ్వాల్ ముఖ్యమైనది. అమెరికా విదేశాంగ శాఖ(దక్షిణాసియా వ్యవహారాలు) సహాయమంత్రిగా ఆమె నియమితులయ్యారు. ఆమెకు సహాయకుడిగా అతుల్ కశ్యప్ను ఇటీవల నియమించారు. అజిత రాజీవ్(వైట్‌హౌస్ ఫెలోషిప్‌పై అధ్యక్ష కమిషన్‌లో సభ్యురాలు), ఇస్లాం సిద్ధిఖీ(చీఫ్ అగ్రికల్చర్ నెగోషియేటర్), వినయ్ తుమ్మలపల్లి(బెలీజ్ రాయబారి) సెనేట్ ఆమోదంతో ఉన్నత పదవులు అలంకరించారు. వినయ్ తుమ్మలపల్లి ప్రవాసాంధ్రుడు కావడం విశేషం. యూఎస్ పోలిటికల్ మిలటరీ ఎఫైర్స్లో అసిస్టెంట్ సెక్రటరీ పదవికి భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ నియామకానికి ఇటీవలే సెనేట్ ఆమోదం తెలిపింది.
బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి ఏడాదే ఎన్నారైలకు అధిక సంఖ్యలో పదవులు కట్టబెట్టారు. భారతీయులు తెలివైన వారని, కష్టపడి పనిచేస్తారని ఆయనకు సదాభిప్రాయం ఉంది. సమయం దొరికినప్పుడల్లా భారతీయులను ఆయన ప్రశంసిస్తుంటారు. తమ దేశ వ్యాపార, విద్య, శాస్త్రీయ రంగాల్లో ఇండియన్స్ పాత్ర ఎంతో ఉందని చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. ఈ సారి మిస్ అమెరికా కిరీటాన్ని గెల్చుకున్నారని మెచ్చుకున్నారు. మిస్ అమెరికా కిరీటాన్ని తెలుగమ్మాయి నీనా దావులూరి ఈ ఏడాది గెల్చుకున్న సంగతి తెలిసిందే.