roundup2013
-
చిన్నారుల ఉసురు తీసిన 'మధ్యాహ్న భోజనం'
దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది చిన్నారులను బడిబాట పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రారంభం నాటి నుంచి ఆ పథకం అమలు తీరు లోపాల పుట్టగా మారిందని అటు స్వపక్షం, ఇటు విపక్షంలోని సభ్యులు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. అయిన ప్రభుత్వం తన మొద్దు నిద్రను విడలేదు. ప్రభుత్వ మొద్దు నిద్రకు 23 మంది చిన్నారులు శాశ్వత నిద్రలోకి నెట్టిసింది. మరో 30 మంది చిన్నారులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. అత్యంత హృదయవిధారకరమైన సంఘటన బీహార్ శరన్ జిల్లా చాప్రా డివిజన్లోని గందమయి దర్మసత్ గ్రామ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఏడాది జులైలో చోటు చేసుకున్న ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద వడ్డించిన ఆహారంలో విషతుల్యం కావడంతో పెద్ద సంఖ్యలో చిన్నారులు మరణించారు. మరికొంత మంది అనారోగ్యం పాలైయ్యారు. దాంతో స్థానిక ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. అనారోగ్యం పాలైన చిన్నారులను వెంటనే పాట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఆ దుర్ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాయి. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మీనాదేవి, ఆమె భర్త అర్జున్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కింద వడ్డిస్తున్న ఆహారం ఆధ్వాన్నంగా ఉందని విద్యార్థులు ఇంటి వద్ద మొత్తుకుంటున్నారని వారి తల్లిదండ్రులు స్థానిక అధికారుల వద్ద చెవిన ఇల్లుకట్టుకుని పోరారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించాల్సిన సరకులన్నింటిని మీనాదేవి భర్త అర్జున్ రాయ్ కొనుగోలు చేసి పలు అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మీనా దేవి భర్త రాజకీయ పలకుబడి కారణంగా ఆయనపై చర్యల తీసుకునేందుకు అధికారులు వెనకడుగేశారు. దాంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో క్రిమిసంహారక మందులకు సంబంధించిన అనవాళ్లు ఉన్నాయని ఆహార పరీక్ష నివేదికలో నిగ్గుతేలింది. ఆ దుర్ఘటనలో మరణించిన విద్యార్థులు ఒకొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని నితీష్ ప్రభుత్వ ప్రకటించింది. శరన్ ఎంపీ, మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆ ఘటనపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఏ విధంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నితీష్ ప్రభుత్వం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని లాలూ పేర్కొన్నారు. -
గూగుల్ సెర్చ్‌లో నరేంద్ర మోడీ టాప్
నరేంద్రమోడీ ఎవరు? గుజరాత్ ముఖ్యమంత్రి, మహా అయితే భారతీయ జనతా పార్టీ తన ప్రధాని అభ్యర్థిగా ఇటీవలే ఎంపిక చేసింది. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఆ రాష్ట్రాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆయన తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహ పరుస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. దీంతో భారత రాజకీయాల్లో నరేంద్రమోడీ కీలకమైన శక్తిగా క్తిగా మారారు. అంతేకాకుండా కురువృద్ధుల పార్టీ కాంగ్రెస్‌ను పక్కకు తొసి తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు. దీంతో నరేంద్ర మోడీ ఎవరు అని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెబ్సైట్ వీక్షకులు గూగుల్‌ను ఆశ్రయించారు. అలాగే బాలీవుడ్ చిత్ర రంగంలో పలువురు హీరో హీరోయిన్లు కోసం ఆ సైట్‌ను ఆశ్రయించారు. దాంతో గూగుల్‌కు చెందిన జిట్జియస్ట్- 2013 నివేదికను ఇటీవలే విడుదల చేసింది. గూగుల్ సెర్చ్ ఇంజన్లో భారతీయ నాయకుల్లో మోడీ అగ్రస్థానాన్ని అక్రమించారు.ఆ తర్వాత స్థానాలు వరుసగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత వరుసగా మిగతా నాలుగు స్థానాల్లో నిలిచారని పేర్కొంది. న్యూఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీ చేసి ఆమెను డీలా చేయడమే కాకుండా, ఆ పార్టీని ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోస్థానాన్ని సొంతం చేసుకున్నారు. వారితో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌లు వరుసగా ఏడు నుంచి పది స్థానాలలో నిలిచారు. -
2013.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్
కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం దాపురించిందా ? అవుననే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి. మిజోరాం మినహా మధ్యప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో అవినీతి అరచేతి మందాన మేట వేయడం, తారాపథానికి చేరుకున్న ధరలు, సామాన్యుల కష్టాలు వెరసి కాంగ్రెస్ పార్టీని కిలోమీటరు లోతున గొయ్యితీసి కప్పెట్టేశాయి. న్యూఢిల్లీలో ఆ పార్టీ పరువు గంగలో కలిసింది. సీఎం షీలా పాలనలో విద్యుత్తు, తాగునీటి ఛార్జీలు ఆకాశాన్నంటాయి. నిర్భయపై అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిర్భయ చట్టం తెచ్చినా కూడా న్యూఢిల్లీలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో హస్తిన వాసులు షీలాపై ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ సమర శంఖం పూరించారు. ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. స్వయంగా కేజ్రీవాల్ సీఎం షీలాపై పోటీచేసి విజయం సాధించారు. న్యూఢిల్లీ శాసన సభకు మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 32 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాత్రం కేవలం 7 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఇటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చాయి. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకుగాను బీజేపీ 165, కాంగ్రెస్ 58 స్థానాలను గెలుచుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు బీజేపీ 49, కాంగ్రెస్ 39, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుస్తుందేమోనని ఓ దశలో అనిపించినా, కమలవికాసాన్ని అరచేయి ఆపలేకపోయింది. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకు ఆ రాష్ట్ర వాసులు మంగళం పాడారు. ఇక్కడ బీజేపీకి పట్టం కట్టారు. మొత్తం 199 స్థానాల్లో 162 బీజేపీ, 21 కాంగ్రెస్, 16 ఇతరులు గెలుపొందారు. దీంతో బీజేపీ నాయకురాలు వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠంపై మరోసారి అధిష్టించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. నీచాతి నీచమైన స్థానానికి దిగజారిపోయింది. ఇక మిగిలింది మిజోరాం. ఆ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎలాగోలా అధికారం సంపాదించింది. మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్ 33, ఎమ్ఎన్ఎఫ్ 7 స్థానాల్లో గెలిచాయి. దీంతో కాంగ్రెస్ నాయకుడు లాల్ తన్వాలా మిజోరాం పీఠాన్ని అధిష్టించారు. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే వాటిలోనూ పునరావృతం కావచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. -
వైట్‌హౌస్‌లో ఎన్నారైల హవా!
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇప్పటికే నిరూపించుకున్న ఇండియన్స్ ప్రభుత్వ ఉన్నత పదవుల్లోనూ పాగా వేస్తున్నారు. అమెరికా సర్కారులో పదవులు దక్కించుకుంటున్న ఎన్నారైల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా 2013 ప్రవాసులకు బాగా కలిసొచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు సంఖ్యలో ఎన్నారైలకు వైట్‌హౌస్‌లో పదవులు దక్కడం విశేషం. అమెరికాలో 30 లక్షలకు పైగా జనాభాతో బలమైన వర్గంగా విరాజిల్లుతున్న భారతీయులకు అధ్యక్ష భవనంలో ఈ ఏడాది సముచిత రీతిలో పదవులు దక్కాయి. 50 మందిపైగా ఎన్నారైలు శ్వేతసౌధంలో పదవులు దక్కించుకున్నారు. ఇందులో 12 మందిపైగా కీలక స్థానాల్లో కొలువుదీరారు. వైట్‌హౌస్‌లో ఇంతమందికి ముఖ్యమైన పదవులు ఇదే తొలిసారి. ఒబామా సర్కారులో ఐదుగురు ఇండియన్-అమెరికన్స్ అత్యంత కీలక స్థానాల్లో ఉన్నారు. వీరి నియామకానికి సెనేట్ ఆమోదం కూడా లభించింది. యూఎస్ ఎయిడ్ సారథిగా కొనసాగుతున్న రాజీవ్ షా అత్యంత ఉన్నత పదవిలో ఉన్న ఎన్నారై. ఈ ఏడాది జరిగిన నియామకాల్లో నిషా దేశాయ్ బిశ్వాల్ ముఖ్యమైనది. అమెరికా విదేశాంగ శాఖ(దక్షిణాసియా వ్యవహారాలు) సహాయమంత్రిగా ఆమె నియమితులయ్యారు. ఆమెకు సహాయకుడిగా అతుల్ కశ్యప్‌ను ఇటీవల నియమించారు. అజిత రాజీవ్(వైట్‌హౌస్ ఫెలోషిప్‌పై అధ్యక్ష కమిషన్‌లో సభ్యురాలు), ఇస్లాం సిద్ధిఖీ(చీఫ్ అగ్రికల్చర్ నెగోషియేటర్), వినయ్ తుమ్మలపల్లి(బెలీజ్ రాయబారి) సెనేట్ ఆమోదంతో ఉన్నత పదవులు అలంకరించారు. వినయ్ తుమ్మలపల్లి ప్రవాసాంధ్రుడు కావడం విశేషం. యూఎస్ పోలిటికల్ మిలటరీ ఎఫైర్స్‌లో అసిస్టెంట్ సెక్రటరీ పదవికి భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ నియామకానికి ఇటీవలే సెనేట్ ఆమోదం తెలిపింది. బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి ఏడాదే ఎన్నారైలకు అధిక సంఖ్యలో పదవులు కట్టబెట్టారు. భారతీయులు తెలివైన వారని, కష్టపడి పనిచేస్తారని ఆయనకు సదాభిప్రాయం ఉంది. సమయం దొరికినప్పుడల్లా భారతీయులను ఆయన ప్రశంసిస్తుంటారు. తమ దేశ వ్యాపార, విద్య, శాస్త్రీయ రంగాల్లో ఇండియన్స్ పాత్ర ఎంతో ఉందని చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. ఈ సారి మిస్ అమెరికా కిరీటాన్ని గెల్చుకున్నారని మెచ్చుకున్నారు. మిస్ అమెరికా కిరీటాన్ని తెలుగమ్మాయి నీనా దావులూరి ఈ ఏడాది గెల్చుకున్న సంగతి తెలిసిందే. -
2013 - ప్రభుత్వం దెబ్బకు తగ్గిన బంగారం దిగుమతులు
బంగారానికి సంబంధించి ఈ ఏడాది మన దేశంలో కీలక అంశాలు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగడం, తగ్గడం కూడా జరిగింది. అలాగే బంగారం దిగుమతులను తగ్గించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం మూడుసార్లు దిగుమతి సుంకం పెంచింది. దాంతో దిగుమతులు బాగా తగ్గాయి. బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాక అదే స్థాయిలో పతనమైంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏడాది మొత్తంలో దాదాపు 8 వేల రూపాయల వరకు వ్యత్యాసంతో అమ్మకాలు జరిగాయి. మే నెలలో 25 వేల రూపాయలకు పడిపోతే, ఆగస్ట్‌లో 33 వేల రూపాయలు దాటి పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న 30.860 రూపాయలు ఉన్న ధర ఏప్రిల్ నెలలో 25, 654 రూపాయలకు పతనం అయింది. మళ్లీ మూడు నెలల్లో ఆగస్ట్‌లో 33,640 రూపాయలకు చేరింది. డిసెంబరు 23కు వచ్చేసరికి 28,550 రూపాయల వద్ద అమ్మకాలు జరుగాయి. బంగారం దిగుమతులు విదేశీ మారకద్రవ్యాన్ని హరించివేస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తున్న పసిడిపై మోజు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రజలను బతిమిలాడారు. దేశ భవిష్యత్తు ప్రయోజనాల కోసమైనా దయచేసి బంగారాన్ని కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. బంగారం దిగుమతి తగ్గకపోగా, బంగారు ఆభరణాల ఎగుమతి కూడా తగ్గిపోతోంది. ఇది మరీ ఆందోళన కలిగించింది. భారత్ ఎగుమతులు-దిగుమతుల విధానంపై బంగారం తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఒక దశలో వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. బంగారం దిగుమతి పెరగడంతో రూపాయిపై వత్తిడి కూడా పెరిగిపోతోంది. ఇక ప్రభుత్వానికి కఠిన చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ తగ్గించేందుకు పసిడిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 8 శాతానికి, 8 నుంచి 10 శాతానికి, 10 నుంచి 15 శాతానికి మూడు సార్లు ప్రభుత్వం పెంచింది. బంగారం డిమాండ్ తగ్గించడానికి, దిగుమతికి కళ్లెం వేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఈ ఏడాది 900 టన్నుల వరకు దిగుమతి అయ్యే అవకాశం ఉందని తొలుత భావించారు. అయితే కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ బంగారం 400 టన్నులు మాత్రమే దిగుమతి అయింది. 2011లో 969 టన్నుల బంగారం దిగుమతి కాగా, 2012లో 860 టన్నులు దిగుమతి అయింది. ఈ ఏడాది పుత్తడి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 40 శాతం వరకు తగ్గి 500 టన్నులకు మించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రమాదం వచ్చి పడింది. దిగుమతి సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే మన దేశంలో పసిడి ధర అధికంగా ఉండటం వల్ల అక్రమ రవాణా పెరిగింది. ఈ విషయాన్ని శీతాకాల లోక్‌సభ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది బంగారం ధరల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నెల ప్రారంభంలో ధర చివరిలో ధర జనవరి రూ.30,860 రూ.30.212 ఫిబ్రవరి రూ.29,856 రూ.29,735 మార్చి రూ.29,588 రూ.29,448 ఏప్రిల్ రూ.29411 రూ.27,183 మే రూ.26,895 రూ.27185 జూన్ రూ.26,897 రూ. 25,563 జూలై రూ.25,665 రూ. 28,641 ఆగస్ట్ రూ. 28,182 రూ. 33,010 సెప్టెంబర్ రూ. 32,980 రూ. 30,737 అక్టోబర్ రూ. 30,450 రూ. 30,225 నవంబర్ రూ. 29,825 రూ.30,249 డిసెంబర్ రూ. 30,221 రూ. 29,620 s.nagarjuna@sakshi.com -
2013 - జగన్ అలుపెరుగని పోరాటం
ఈ ఏడాది మన రాష్ట్రంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతోంది. సమైక్య శంఖారావం పూరించి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైన నేతగా జగన్ నిలిచారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల దుర్మరణం తరువాత ఆయన ఆశయాల సాధనకు, ఆయన ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు అనివార్యంగా జగన్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. జననేతగా జగన్ రోజురోజుకు ఎదిగే క్రమంలో లేనిపోని అభాండాలన్నీ మోపి అతనిని 2012 మే 27న అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ ఏడాదే సమైక్య ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి జైలు నుంచే జగన్ మద్దతు పలికారు. అంతేకాకుండా జైలులో ఉండే సమైక్య రాష్ట్రం కోసం నిరవధిక దీక్ష చేశారు. జనానికి ఇంకా చేరువయ్యారు. న్యాయం జగన్ పక్షాన ఉండటంతో ఎంతకాలం జైలులో ఉంచగలరు? ఈ ఏడాది అక్టోబరు 24న బెయిలుపై విడుదలయ్యారు. పడిన కెరటం మళ్లీ పైకి లేచింది. సమైక్య శంఖారావం పూరించారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్టోబరు 26న భారీ స్థాయిలో సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. సమైక్యవాదుల ఆశాజ్యోతిగా నిలిచారు. జాతీయ స్థాయిలో సమైక్యవాణి వినిపించారు. దేశమంతటా పర్యటించి జాతీయ నాయకులను కలిశారు. సమైక్యతకు మద్దతు కూడగట్టారు. దేశమంతా రాష్ట్రం వైపు చూసే విధంగా లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిజాయితీగా, పట్టుదలతో పోరాడుతున్న ఏకైక నేత జగన్. రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు నదీ జలాలు - ఉద్యోగులకు జీతాలు - యువతకు ఉద్యోగాలు - కొత్త రాజధాని ఏర్పాటు.... వంటి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని హెచ్చరించారు. నీటి కోసం నిత్యం తన్నుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచడం కోసం చివరి క్షణం వరకు పోరాడతానని శపథం చేశారు. ఆ శపథానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. -
బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు
2013సంవత్సరంలో బాలీవుడ్ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగించే, విషాదానికి గురిచేసే, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని వార్తలు ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వగా, మరికొన్ని విషాదాన్ని నింపాయి. అలాంటి సంఘటనలను మరోసారి నెమరువేసుకుందామా! హృతిక్‌కు సుజానే గుడ్‌బై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న 17 ఏళ్ల ప్రేమవ్యవహారం, 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ఆయన సతీమణి సుజానే ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. దాంతో బాలీవుడ్లో రొమాంటిక్ జోడి రిలేషన్‌కు ఒక్కసారిగా తెరపడింది. బాలీవుడ్ ప్రేక్షకులను, హృతిక్ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. క్రిష్3తో హిట్ సాధించి జోరు మీద ఉన్న హృతిక్‌కు ఈ సంవత్సరం చేదు అనుభవ మే. అనురాగ్ బసు, కల్కి బై..బై దర్శకుడు అనురాగ్ బసు కాశ్యప్, కల్కి కోచ్లిన్లు రెండేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వర్ధమాన తార హ్యూమా ఖురేషితో అనురాగ్ బసు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. షారుక్‌కు సర్రోగసి కష్టాలు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దంపతులు సర్రోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనివ్వడం వివాదస్పదంగా మారింది. అప్పటికే షారుక్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే మూడో బిడ్డ అబ్రామ్ను సర్రోగసి పద్దతి కనడానికి ముందు లైంగిక నిర్ధారణ పరీక్షలు జరిపించారని ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఇబ్బందుల్లోకి నెట్టింది.తొలుత దిగువ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసినా.. ప్రస్తుతం బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. తన మూడో బిడ్డ అబ్రామ్ను కొద్ది రోజులతర్వాత మీడియా పరిచయం చేశారు. మళ్లీ కలిసిన సల్మాన్, షారుక్! కొద్ది సంవత్సరాల క్రితం బాలీవుడ్ తార కత్రీనా కైఫ్ జన్మదిన వేడుకల్లో అగ్రతారలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవకు ముందు సల్మాన్, షారుక్ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఆతర్వాత వారిద్దరూ మధ్య విభేదాలు ముదిరాయి. అయితే విభేధాలను తెరదించుతూ.. రంజాన్ పండగ సందర్భంగా జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో వారిద్దరూ కౌగిలించుకోవడం అభిమానులకు ఆనందం కలిగించింది. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగినా షారుక్‌తో తన రిలేషన్లో ఎలాంటి తేడా లేదని చెప్పడం గమనార్హం. అయితే ఇఫ్తార్ తర్వాత మరే సందర్భంలో కూడా సల్మాన్, షారుక్‌లు కనిపించిన దాఖలాలు కనిపించలేదు. జియాఖాన్ ది ఆత్మహత్యా? హత్యా? రాంగోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ చిత్రం ద్వారా అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి పేరు ముడిపడి ఉండటం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ కేసులో సూరజ్‌ను అరెస్ట్ చేశారు కూడా. అయితే జియాది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆమె తల్లి ఆరోపించడం మరింత సంచలనం రేపింది. నేను వర్జిన్‌నే: సల్మాన్ కాఫీ విత్ కరణ్ ఓ టెలివిజన్ ఛానెల్లో నాలుగవ ఎడిషన్ ప్రారంభమైంది. అయితే ఆరంభంలో అగ్రనటులు అమీర్, సల్మాన్‌ను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కరణ్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సల్మాన్, అమీర్లు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తాను ఇంకా బ్రహ్మచారి(వర్జిన్) అని చెప్పడం, షారుక్‌తో విభేధాలను వెల్లడించడం గమనార్హం. కరణ్ జోహార్ అంటే ఇష్టం లేకపోవడం వల్లే ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దూరంగా ఉన్నానని ఆయన ముఖం మీదే అమీర్ చెప్పడం అందర్ని ఆకర్షించింది. వివాదస్పదమైన క్రిష్3 కలెక్షన్లు ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కిష్3రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించిన కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారనే వార్త అందర్ని ఆశ్చర్య పరిచింది. వాస్తవ కలెక్షన్లకు 60 కోట్ల రూపాయలను అదనంగా చేర్చారనే వార్తల బాలీవుడ్ సంచలనానికి తావిచ్చింది. బాలీవుడ్లో అతిపెద్ద కుంభకోణమని వచ్చిన దర్శక నిర్మాత రాకేశ్ రోషన్ ఖండించారు. అయితే ఈవార్త వెనుక వాస్తవాలు వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. రాణీ చోప్రాగా మారిన రాణి ముఖర్జీ దిల్వాలే దుల్హనియా లేజాయింగేతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆదిత్య చోపా, బాలీవుడ్ నటి రాణి ముఖర్జీల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని.. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రాణితో కలిసి ఉంటున్నాడనే వార్తలకు బలం చేకూర్చే విధంగా.. ఇటీవల ఓ కార్యక్రమంలో షాట్‌గన్ శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. అదే వేదికపై ఉన్న రాణీ ముఖర్జీని రాణి చోప్రాగా సంభోదించడం అందర్ని అశ్చర్య పరిచింది. దాంతో వారిద్దరి మధ్య జరుగుతున్న సీక్రెట్ వ్యవహారానికి షాట్‌గన్ తెరదించాడు. -
బాలీవుడ్ సూపర్ హిట్స్..డిజాస్టర్స్
2013లోస్వదే శంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హవా కొనసాగింది. ఈ సంవత్సరం భారతీయ సినిమా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఎప్పూడూ లేనంతగా దక్షిణాదిలోనూ హిందీ చిత్రాలకు ఆదరణ పెరుగగా.. విదేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు పాగా వేశాయి. పెరూ, పనామా, మోరాకో లాంటి దేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు ఈ సంవత్సరం విడుదలై మంచి కలెక్షన్లనే రాబట్టాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పెరుగుదల బాలీవుడ్‌కు కలిసి వచ్చిన అంశం. బాలీవుడ్‌ను నాలుగు దశాబ్దలపాటు ఏలిన అమితాబ్ బచ్చన్‌ను ’ది గ్రేట్ గాడ్స్బై’ చిత్రం ద్వారా హాలీవుడ్ కూడా అక్కున చేర్చుకుంది. బాలీవుడ్‌కు కొత్తగాపరిచయమైన వారికి కూడా మంచి ప్రోత్సాహమే దక్కింది ధనుష్(రాంజ్నా), తాప్సీ (చష్మే బద్దూర్), తమన్నా(హిమ్మత్వాలా), సుశాంత్ సింగ్ కపూర్ (కాయ్ పో చే)రాంచరణ్ (జంజీర్), వాణీ కపూర్(శుద్ద్ దేశీ రొమాన్స్), పూనమ్ పాండే(నషా)లకు ఆదరణ లభించింది. హడావిడి లేకుండా వచ్చిన లంచ్‌బాక్స్, మద్రాస్ కేఫే, షార్ట్స్, బాంబే టాకీస్, ఏబీసీడీ, షిప్ ఆఫ్ థీసీస్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక 2013లో భారీ అంచనాలతో వచ్చిన పెద్ద, చిన్న చితక చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మండంగా పేలగా.. మరికొన్ని తుస్సుమన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సంవత్సరం భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలను, బోల్తా పడిన చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం! హిట్ చిత్రాలు ధూమ్ 3 ఈ సంవత్సరాంతంలో విడుదలైన ధూమ్3 చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులను తిరగరాస్తోంది. గత ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 313(గ్రాస్) వసూలు చేయగా దేశీయ మార్కెట్లో 229 కోట్లు గ్రాస్(నికరం 173 కోట్లు) వసూలు చేసింది. అమీర్ ఖాన్ వన్ మ్యాన్ షో ప్రేక్షకులను ఆలరిస్తోంది. కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్‌ల నటన ఈ చిత్రానికి ప్లస్‌గా మారింది. క్రిష్ 3 సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్‌లు నటించారు. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 374 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, దేశీయంగా 240 కోట్ల నికరాన్ని వసూలు చేసింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తమిళ నేపథ్యంతో తెరకెక్కిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం క్రిటిక్స్‌ను కూడా నివ్వెరపరిచి.. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. షారుఖ్, దీపికా పదుకొనేలు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 422 కోట్ల రూపాయలను వసూలు చేసి అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. దేశవాలీ మార్కెట్లో చెన్నై ఎక్స్‌ప్రెస్ 226 కోట్ల రూపాయలను రాబట్టింది. యే జవానీ హై దీవానీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్లోనే కాకుండా విదేశాల్లోనూ జాదూ చేసింది. రణ భీర్ క పూర్, దీపీకా పదుకోనెల కెమిస్ట్రీ కాసుల పంటగా మార్చింది. వీరికి తోడు మాధురీ దీక్షిత్ ప్రత్యేక పాటలో కనిపించి ఆలరించింది. గ్లోబల్ మార్కెట్లో 309 కోట్లు గ్రాస్ కలెక్షన్లు, ఇండియాలో 190 కోట్ల నికర వసూళ్లను సొంతం చేసుకుంది. రామ్‌లీలా షోమ్యాన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక, నిర్మాణంలో రూపొందిన రామ్‌లీలా టైటిల్‌పై కొంత వివాదం నెలకొన్నా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేల కెమిస్ట్రీ, మ్యూజిక్, భారీ సెట్టింగులకు ప్రేక్షకుల్ని ఆలరించడంతో భారత్‌లోనే 110 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. భాగ్ మిల్కా భాగ్ ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రాకేశ్ ఓంప్రకాశ్ మిశ్రా రూపొందించిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫరాన్ అక్తర్, సోనమ్ కపూర్, రెబెక్కా బ్రీడ్స్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 102 కోట్లు వసూలు చేసి.. వందకోట్ల క్లబ్లో చోటు సంపాదించింది. ఇదే కోవలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన గ్రాండ్ మస్తీ 102 కోట్లు, రేస్2 100 కోట్లకు పైగా, ఆషీకి2 85 కోట్లు, స్పెషల్ చ బ్బీస్ 70 కోట్లు కొల్లగొట్టాయి. బోల్తా కొట్టాయి... జంజీర్ గతంలో అమితాబ్ నటించిన జంజీర్ చిత్రం రీమేక్‌గా రాంచరణ్ బాలీవుడ్లో ఇచ్చిన ఎంట్రీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల రూపాయలనే వసూలు చేసింది. జిల్లా ఘజియాబాద్ సంజయ్ దత్, అర్షద్ వార్సీలు నటించిన ఈ చిత్రం 36 కోట్ల వ్యయంతో రూపొందగా.. కేవలం 16 కోట్ల వసూళ్లకే పరిమితమై నిరాశపరిచింది. . బాస్ మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన బాస్ చిత్రంలో అక్షయ్ కుమార్, అదితిరావ్, మిథున్ చక్రవర్తి, డానీలు నటించారు. ఈ చిత్ర వ్యయం 72 కోట్లు. వసూలు చేసింది 54, నష్టం 18 కోట్లు బుల్లెట్ రాజా సోనాక్షి సిన్హా, సైఫ్ ఆలీ ఖాన్ల క్రేజి కాంబినేషన్‌తో బుల్లెట్ రాజాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని కూడగట్టుకుంది. 50 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 33 కోట్లు మాత్రమే వసూలు చేసి 17 కోట్ల లోటును నమోదు చేసుకుంది. గోరి తేరే ప్యార్ మే ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ల క్రేజి కాంబినేషన్ కూడా చిత్రానికి లాభాల్ని సాధించిపెట్టలేకపోయింది. 30 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగితే 14 కోట్లకే పరిమితమై.. 16 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. బేషరమ్ యే జవానీ హై దీవానీ విజయంతో ఊపు మీద ఉన్న రణ భీర్ కపూర్‌కు బేషరమ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 75 కోట్ల వ్యయానికి 59 కోట్లు మాత్రమే వసూలు చేసి 15 నష్టాన్ని నిర్మాతకు పంచింది. వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా అక్షయ్ కుమార్‌కు వరుసగా రెండవ పరాజయాన్ని మిగిల్చిన చిత్రం. సోనాక్షి, ఇమ్రాన్ ఖాన్‌లాంటి భారీ తారాగణం కూడా కలెక్షన్లను రాబట్టలేక వసూళ్ల వెనుకపడింది. 80 కోట్లు నిర్మాణానికి ఖర్చుకాగా, 65 కోట్లు రాబట్టడంతో 15 నష్టం వాటిల్లింది. సత్య2 రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన సత్య2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. 15 కోట్లకు గాను, కేవలం 2 కోట్లు వసూలు చేసి 13 నష్టాన్ని రిజిస్టర్ చేసింది. రజ్జో కంగనా రనౌత్ నటించిన రజ్జో కు ఖర్చు పెట్టింది 12 కోట్లుకాగా వచ్చింది 2కోట్లే.. హిమ్మత్వాలా గతంలో జితేంద్ర నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీమేక్ చేశారు. అజయ్ దేవగన్, తమన్నాలు న టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లలో వెనకబడి 5 కోట్ల నష్టంతో చతికిలపడింది.