2013 - ప్రభుత్వం దెబ్బకు తగ్గిన బంగారం దిగుమతులు
బంగారానికి సంబంధించి ఈ ఏడాది మన దేశంలో కీలక అంశాలు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగడం, తగ్గడం కూడా జరిగింది. అలాగే బంగారం దిగుమతులను తగ్గించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం మూడుసార్లు దిగుమతి సుంకం పెంచింది. దాంతో దిగుమతులు బాగా తగ్గాయి. బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాక అదే స్థాయిలో పతనమైంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏడాది మొత్తంలో దాదాపు 8 వేల రూపాయల వరకు వ్యత్యాసంతో అమ్మకాలు జరిగాయి. మే నెలలో 25 వేల రూపాయలకు పడిపోతే, ఆగస్ట్లో 33 వేల రూపాయలు దాటి పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న 30.860 రూపాయలు ఉన్న ధర ఏప్రిల్ నెలలో 25, 654 రూపాయలకు పతనం అయింది. మళ్లీ మూడు నెలల్లో ఆగస్ట్లో 33,640 రూపాయలకు చేరింది. డిసెంబరు 23కు వచ్చేసరికి 28,550 రూపాయల వద్ద అమ్మకాలు జరుగాయి.
బంగారం దిగుమతులు విదేశీ మారకద్రవ్యాన్ని హరించివేస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తున్న పసిడిపై మోజు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రజలను బతిమిలాడారు. దేశ భవిష్యత్తు ప్రయోజనాల కోసమైనా దయచేసి బంగారాన్ని కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. బంగారం దిగుమతి తగ్గకపోగా, బంగారు ఆభరణాల ఎగుమతి కూడా తగ్గిపోతోంది. ఇది మరీ ఆందోళన కలిగించింది. భారత్ ఎగుమతులు-దిగుమతుల విధానంపై బంగారం తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఒక దశలో వాణిజ్య కార్యదర్శి ఎస్‌ఆర్ రావు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. బంగారం దిగుమతి పెరగడంతో రూపాయిపై వత్తిడి కూడా పెరిగిపోతోంది. ఇక ప్రభుత్వానికి కఠిన చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ తగ్గించేందుకు పసిడిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 8 శాతానికి, 8 నుంచి 10 శాతానికి, 10 నుంచి 15 శాతానికి మూడు సార్లు ప్రభుత్వం పెంచింది.
బంగారం డిమాండ్ తగ్గించడానికి, దిగుమతికి కళ్లెం వేయడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఈ ఏడాది 900 టన్నుల వరకు దిగుమతి అయ్యే అవకాశం ఉందని తొలుత భావించారు. అయితే కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ బంగారం 400 టన్నులు మాత్రమే దిగుమతి అయింది. 2011లో 969 టన్నుల బంగారం దిగుమతి కాగా, 2012లో 860 టన్నులు దిగుమతి అయింది. ఈ ఏడాది పుత్తడి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 40 శాతం వరకు తగ్గి 500 టన్నులకు మించకపోవచ్చని భావిస్తున్నారు.
అయితే ఇప్పుడు మరో ప్రమాదం వచ్చి పడింది. దిగుమతి సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే మన దేశంలో పసిడి ధర అధికంగా ఉండటం వల్ల అక్రమ రవాణా పెరిగింది. ఈ విషయాన్ని శీతాకాల లోక్సభ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది బంగారం ధరల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
నెల ప్రారంభంలో ధర చివరిలో ధర
జనవరి రూ.30,860 రూ.30.212
ఫిబ్రవరి రూ.29,856 రూ.29,735
మార్చి రూ.29,588 రూ.29,448
ఏప్రిల్ రూ.29411 రూ.27,183
మే రూ.26,895 రూ.27185
జూన్ రూ.26,897 రూ. 25,563
జూలై రూ.25,665 రూ. 28,641
ఆగస్ట్ రూ. 28,182 రూ. 33,010
సెప్టెంబర్ రూ. 32,980 రూ. 30,737
అక్టోబర్ రూ. 30,450 రూ. 30,225
నవంబర్ రూ. 29,825 రూ.30,249
డిసెంబర్ రూ. 30,221 రూ. 29,620
s.nagarjuna@sakshi.com