
వాషింగ్టన్ వర్సిటీ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
న్యూయార్క్: అమెరికాలో భారతీయులు, భారతీయ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన శాస్త్రీయ నృత్య కళాకారుడొకరిని దుండగులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్సోరిలోని సెంట్ లూయీస్‌లో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా సూరికి చెందిన అమర్నాథ్ ఘోష్(34) పీహెచ్‌డీ కోసం అమెరికాలోని వెళ్లారు.
వాషింగ్టన్ వర్సిటీలో చేరారు. మంగళవారం ఉదయం 7.15 గంటల సమయంలో నడిచి వెళ్తుండగా సెంట్ లూయీస్ అకాడమీ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికకక్కడే చనిపోయారు. అమర్నాథ్‌కు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరు. ఆయన మృతి విషయం బంధువులకు ఆలస్యంగా చేరింది.
కూచిపూడి, భరతనాట్యాల్లో నిపుణుడైన ఆయన బాలె నేర్చుకుంటూ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆయన స్నేహితులు హిమా కుప్ప, రవి కుప్ప తెలిపారు. ఘోష్ మృతిపై షికాగోలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు, యూనివర్సిటీ అధికారుల తో చర్చించింది. ఆయనను పొట్టన బెట్టుకున్న దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరింది.