
ఐదుగురు భారతీయ అమెరికన్ల జయకేతనం
వాషింగ్టన్: అమెరికా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయులు మరోసారి సత్తా చాటారు. శుక్రవారం నాటి రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు జయకేతనం ఎగురవేశారు. వీరిలో ముగ్గురు లెజిస్లేటర్లుగా గెలుపొందగా.. మరో ఇద్దరు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారు. న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోల్‌కతాకు చెందిన రాజ్‌ముఖర్జీ.. 33వ లెజిస్లేటివ్ జిల్లా నుంచి ఘన విజయం సాధించారు.
29 ఏళ్ల ముఖర్జీ రాష్ట్ర అసెంబ్లీలోని అతి పిన్న వయసు గల సభ్యుల్లో ఒకడిగా నిలిచాడు. ఇదే రాష్ట్రంలో 16వ లెజిస్లేటివ్ జిల్లా నుంచి పోటీ చేసిన మరో భారతీయ అమెరికన్ ఉపేంద్ర చివుకుల (63) అసెంబ్లీలో తన స్థానాన్ని నిలుపుకున్నారు. తెలుగువాడైన ఉపేంద్ర 2002 నుంచి న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగుతుండటం విశేషం. న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రం వార్డ్ 8 నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన లతా మంగిపూడి 18 పాయింట్ల మార్జిన్‌తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల విషయానికి వస్తే.. న్యూజెర్సీలోని ఎడిసన్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో సప్నా షా, నార్త్ కరోలినా సిటీ కౌన్సిల్‌లోని మోరీస్‌విల్లే నుంచి స్టీవ్ రావ్ గెలుపొందారు.