
ఐరాసలో రెహమాన్ సంగీత ఝరి
ఐరాస: స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీత ఝరిలో ఐక్యరాజ్య సమితి మైమరిచిపోయింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఆస్కార్ స్థాయి స్వర ప్రభంజనంలో ప్రపంచనేతలు ఓలలాడారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కచేరి సోమవారం వీనులవిందుగా సాగింది. సంగీత దిగ్గజం ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి, భారత 70వ స్వాతంత్య్ర దిన సందర్భంగా భారత శాశ్వత కార్యాలయం ఈ కార్యక్రమం నిర్వహించింది. రెహమాన్ వేదికపైకి రాగానే వివిధ దేశాల రాయబారులు, దౌత్యాధికారులు, భారతీయ అమెరికన్లు చప్పట్లతో స్వాగతం పలికారు.
తన ఇద్దరు సోదరీమణులు, బృంద సభ్యులతో కలసి.. సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీతం, సూఫీ, జయహో పాటల్ని ఆహూతులకు రెహమాన్ వినిపించాడు. రెహమాన్ సంగీత వాద్యాలతో సహకారం అందిస్తుండగా మరో బృందం సుబ్బులక్ష్మి కీర్తనల్ని ఆలపించింది. 50 ఏళ్ల కిందట 1966లో సుబ్బులక్ష్మి కచేరీ నిర్వహించిన చోటే ఆమెకు ఘనంగా నివాళులర్పించాడు.
సుమారు మూడు గంటల కచేరీలో దిల్ సే, బోంబే సినిమాల్లోని పాటలతో పాటు ‘వందేమాతరం’ రీమిక్స్‌ను ఆలపించి ఐరాసలో భారతీయతను మార్మోగేలా చేశాడు. సూఫీ సంగీతంతో(ఖ్వాజా మేరే ఖ్వాజా, మౌలా మౌలా, కున్ ఫాయా కున్) కొద్దిసేపు సభికుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. ప్రముఖ గాయకుడు జావెద్ అలీ, వాద్యకారుడు శివమణిలు సహకారం అందించారు. ఈ ప్రదర్శనతో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తర్వాత ఐరాసలో కచేరీ చేసిన సంగీత సామ్రాట్టుగా రెహమాన్ నిలిచాడు. అలాగే సన్‌షైన్ ఆర్కెస్ట్రా (నిరుపేద విద్యార్థులకు సంగీత శిక్షణ కోసం రెహమాన్ ఫౌండేషన్ స్థాపించిన సంస్థ) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘ఒకరినొకరు చంపుకోవడంతో ప్రపంచ సమస్యలకు పరిష్కారం లభించదు. నా జీవిత కాలంలో ప్రజలు గొడవ పడకుండా, ఒకరినొకరు చంపుకోకుండా ఉండే ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా. మన జీవితకాలంలో ఈ మార్పు చూస్తామని ఆశిద్దాం’ అంటూ చివర్లో శాంతి సందేశం వినిపించాడు. కార్యక్రమానికి భారత్‌కు చెందిన పౌర సంస్థ శంకర నేత్రాలయ సహకారం అందించింది.