మిడిసిపడుతున్నారు! | PM Narendra Modi thinks he knows more than God, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

మిడిసిపడుతున్నారు!

Published Thu, Jun 1 2023 5:55 AM | Last Updated on Thu, Jun 1 2023 5:55 AM

PM Narendra Modi thinks he knows more than God, says Rahul Gandhi - Sakshi

శాంటాక్లారా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసు అని భారతదేశంలో కొందరు మిడిసిపడుతున్నారని, అలాంటివారిలో మోదీ కూడా ఒకరని అన్నారు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో మంగళవారం ‘మొహబ్బత్‌ కీ దుకాణ్‌’ పేరిట ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన సదస్సులో వందలాది మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ మాట్లాడారు.

ఈ ప్రపంచం చాలా పెద్దదని, అందరూ అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా కష్టమని వివరించారు. భారత్‌లో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం తమకు అన్నీ తెలుసని వాదిస్తుంటారని అన్నారు. వారు తమకు అన్నీ తెలుసంటూ ఎవరినైనా ఒప్పించగల ఘనులు అని చెప్పారు. చరిత్ర గురించి చరిత్రకారులకు, సైన్స్‌ గురించి సైంటిస్టులకు, యుద్ధరీతుల గురించి సైన్యానికి పాఠాలు బోధించగల సమర్థులు అని ఎద్దేవా చేశారు.

దేవుడితో సమానంగా కూర్చొని, ప్రపంచంలో ఏం జరుగుతోందో దేవుడికే చెప్పగలరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇతరులు చెప్పేది మాత్రం వారు వినబోరని పేర్కొన్నారు. అలాంటి ‘నమూనా’ మనుషుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారనడంలో సందేహం లేదన్నారు. ఈ సృష్టి ఎలా పనిచేస్తోందో దేవుడికి మోదీ చక్కగా పాఠాలు చెప్పగలరని తెలిపారు. అప్పుడు తాను సృష్టించిన ఈ సృష్టి పట్ల దేవు డు అయోమయానికి గురికావడం ఖాయమని వెల్లడించారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలతో సభామందిరం నవ్వులతో దద్దరిల్లిపోయింది.  

సెంగోల్‌ పేరిట ఆర్భాటం   
భారత్‌ అనే భావన ఇప్పుడు దాడికి గురవుతోందని, సవాళ్లు ఎదుర్కొంటోందని రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్వేష వ్యాప్తి వంటి సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని, వాటిని పరిష్కరించేవారే లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవమని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి చట్టసభల్లో చర్చించడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే సెంగోల్‌ (రాజదండం) పేరిట ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కారు పచ్చి అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. అమెరికాలో భారతదేశం జెండాను సగర్వంగా ఎగురవేస్తున్న భారతీయ అమెరికన్లపై రాహుల్‌ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు  
భారత్‌లో నేడు పేదలు, మైనార్టీ వర్గాల ప్రజలు నిస్సహాయులుగా మారిపోతున్నారని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులు సహజంగా ఒకరినొకరు ద్వేషించుకోరని అన్నారు. దేశంలో వ్యవస్థను, మీడియాను నియంత్రిస్తున్న కొందరు వ్యక్తులు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వివరించారు. రాజకీయ వ్యవస్థ, వ్యాపారాలు, పాలక వర్గంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని రాహుల్‌ తేల్చిచెప్పారు.  

ఖలిస్తానీ మద్దతుదారుల కలకలం  
శాంటాక్లారాలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తుండగా ఖలిస్తానీ మద్దతుదారులు కాసేపు హంగామా సృష్టించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. రాహుల్‌ నవ్వుతూ ప్రతిస్పందించారు. ‘‘స్వాగతం, స్వాగతం.. విద్వేషం అనే బజారులో ప్రేమ అనే దుకాణానికి స్వాగతం’’ అని అన్నారు. తాము అందరినీ ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెప్పారు. ఎవరినీ ద్వేషించబోమని, ఇతరులు చెప్పేది వింటామని పేర్కొన్నారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఖలిస్తానీ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు.  

రాహుల్‌కు ఏమీ తెలియదు: బీజేపీ
అమెరికాలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ నకిలీ గాంధీ అని విమర్శించారు. రాహుల్‌ దృష్టిలో చరిత్ర అంటే ఆయన కుటుంబేమేనని అన్నారు. ఆయనకు ఏమీ తెలియదని, కానీ, అన్నింట్లోనూ నిష్ణాతుడయ్యాడని ఎద్దేవా చేశారు. భారతీయులు తమ చరిత్ర పట్ల గర్వపడతారని వివరించారు.

రాహుల్‌ మాత్రం భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి విదేశీ గడ్డను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన విమర్శలను పలువురు బీజేపీ ముఖ్య నేతలు తప్పుపట్టారు. రాహుల్‌పై బీజేపీ నేతలు చేసిన విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ట్విట్టర్‌లో ఖండించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్‌ మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రజలు సమస్యల్లో కూరుకుపోయిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, ఆయన భజనపరులు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement