Santa Clara
-
యాపిల్‌లో 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన
వాషింగ్టన్: టెక్ దిగ్గజం యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కోవిడ్–19 తర్వాత యాపిల్ ఇంత భారీ స్థాయిలో ఉద్వాసనలకు తెర తీయడం ఇదే ప్రథమం. కోవిడ్ సమయంలో భారీగా రిక్రూట్మెంట్ చేపట్టిన చాలా మటుకు టెక్ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద యెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. -
మిడిసిపడుతున్నారు!
శాంటాక్లారా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసు అని భారతదేశంలో కొందరు మిడిసిపడుతున్నారని, అలాంటివారిలో మోదీ కూడా ఒకరని అన్నారు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో మంగళవారం ‘మొహబ్బత్ కీ దుకాణ్’ పేరిట ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన సదస్సులో వందలాది మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ప్రపంచం చాలా పెద్దదని, అందరూ అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా కష్టమని వివరించారు. భారత్‌లో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం తమకు అన్నీ తెలుసని వాదిస్తుంటారని అన్నారు. వారు తమకు అన్నీ తెలుసంటూ ఎవరినైనా ఒప్పించగల ఘనులు అని చెప్పారు. చరిత్ర గురించి చరిత్రకారులకు, సైన్స్ గురించి సైంటిస్టులకు, యుద్ధరీతుల గురించి సైన్యానికి పాఠాలు బోధించగల సమర్థులు అని ఎద్దేవా చేశారు. దేవుడితో సమానంగా కూర్చొని, ప్రపంచంలో ఏం జరుగుతోందో దేవుడికే చెప్పగలరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇతరులు చెప్పేది మాత్రం వారు వినబోరని పేర్కొన్నారు. అలాంటి ‘నమూనా’ మనుషుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారనడంలో సందేహం లేదన్నారు. ఈ సృష్టి ఎలా పనిచేస్తోందో దేవుడికి మోదీ చక్కగా పాఠాలు చెప్పగలరని తెలిపారు. అప్పుడు తాను సృష్టించిన ఈ సృష్టి పట్ల దేవు డు అయోమయానికి గురికావడం ఖాయమని వెల్లడించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభామందిరం నవ్వులతో దద్దరిల్లిపోయింది. సెంగోల్ పేరిట ఆర్భాటం భారత్ అనే భావన ఇప్పుడు దాడికి గురవుతోందని, సవాళ్లు ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్వేష వ్యాప్తి వంటి సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని, వాటిని పరిష్కరించేవారే లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవమని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి చట్టసభల్లో చర్చించడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే సెంగోల్ (రాజదండం) పేరిట ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కారు పచ్చి అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. అమెరికాలో భారతదేశం జెండాను సగర్వంగా ఎగురవేస్తున్న భారతీయ అమెరికన్లపై రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భారత్‌లో నేడు పేదలు, మైనార్టీ వర్గాల ప్రజలు నిస్సహాయులుగా మారిపోతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులు సహజంగా ఒకరినొకరు ద్వేషించుకోరని అన్నారు. దేశంలో వ్యవస్థను, మీడియాను నియంత్రిస్తున్న కొందరు వ్యక్తులు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వివరించారు. రాజకీయ వ్యవస్థ, వ్యాపారాలు, పాలక వర్గంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని రాహుల్ తేల్చిచెప్పారు. ఖలిస్తానీ మద్దతుదారుల కలకలం శాంటాక్లారాలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగా ఖలిస్తానీ మద్దతుదారులు కాసేపు హంగామా సృష్టించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. రాహుల్ నవ్వుతూ ప్రతిస్పందించారు. ‘‘స్వాగతం, స్వాగతం.. విద్వేషం అనే బజారులో ప్రేమ అనే దుకాణానికి స్వాగతం’’ అని అన్నారు. తాము అందరినీ ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెప్పారు. ఎవరినీ ద్వేషించబోమని, ఇతరులు చెప్పేది వింటామని పేర్కొన్నారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఖలిస్తానీ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌కు ఏమీ తెలియదు: బీజేపీ అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నకిలీ గాంధీ అని విమర్శించారు. రాహుల్ దృష్టిలో చరిత్ర అంటే ఆయన కుటుంబేమేనని అన్నారు. ఆయనకు ఏమీ తెలియదని, కానీ, అన్నింట్లోనూ నిష్ణాతుడయ్యాడని ఎద్దేవా చేశారు. భారతీయులు తమ చరిత్ర పట్ల గర్వపడతారని వివరించారు. రాహుల్ మాత్రం భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి విదేశీ గడ్డను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన విమర్శలను పలువురు బీజేపీ ముఖ్య నేతలు తప్పుపట్టారు. రాహుల్‌పై బీజేపీ నేతలు చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్విట్టర్లో ఖండించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రజలు సమస్యల్లో కూరుకుపోయిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, ఆయన భజనపరులు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
క్యూబాకు అమెరికా తొలి విమానం
సాంటాక్లారా: అమెరికా, క్యూబా దేశాల మధ్య బుధవారం మరో చరిత్రాత్మకమైన రోజు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాండర్డేల్ నగరం నుంచి బయల్దేరిన ‘జెట్‌బ్లూ ఫ్లయిట్-387’ అనే ప్రయాణికుల విమానం క్యూబా దేశంలోని సాంటాక్లారాకు చేరుకోవడానికి 51 నిమిషాలు పట్టింది. అందుకు ఇరు దేశాల ప్రజలు 55 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి క్యూబాతోని సరైన సంబంధాలు లేకపోవడం వల్ల ఇరుదేశాల మధ్య కమర్షియల్ విమానాలు నిలిచిపోయి 55 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత తొలి కమర్షియల్ విమానం అమెరికాలోని హాలివుడ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి బయల్దేరి క్యూబాలోని సాంటా మారియా విమానాశ్రయంలో దిగింది. అక్కడ అమెరికా విమానాశ్రయంలో నీటి ఫిరంగులతో విమానానికి వీడ్కోలు పలగ్గా, ఇక్కడ క్యూబా విమానాశ్రయంలో కూడా నీటి ఫిరంగులతో స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో విమానాశ్రయం అధికారులు, కార్మికులు, ప్రయాణికులు ఇరు దేశాల జెండాలు పట్టుకొని పాల్గొన్నారు. ముందుగా విమానం నుంచి అమెరికా రవాణా శాఖ మంత్రి ఆంథోని ఫాక్స్ దిగారు. ఆయనకు విమానాశ్రయం సిబ్బంది స్వాగతించారు. ఆయన వెంట జెట్‌బ్లూ ఫ్లైట్ కంపెనీ సీఈవో రాబిన్ హేస్ కూడా దిగారు. ఆయనకు నగర అధికారులు సాంటాక్లారా నగరం పెయింటింగ్స్‌ను బహుమానంగా ఇచ్చారు. ఒకప్పుడు క్యూబాకు రావాలంటే విమానాఞశ్రయానికి వెళ్లి టిక్కెట్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ప్రొపెల్లర్ విమానంలో రావాల్సి వచ్చేదని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయిందని హేస్ వ్యాఖ్యానించారు. ఇప్పడు ఆ లైన్లోనే టిక్కెట్లు కొనుక్కోవచ్చని, అమెరికాలోని పది నగరాల నుంచి క్యూబాకు రావచ్చని ఆయన తెలిపారు. త్వరలోనే మరిన్ని అమెరికా ఎయిర్‌లైన్స్ మరికొన్ని కమర్షియల్ విమానాలను క్యూబాకు నడపనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2014 డిసెంబర్ నెలలోనే క్యూబా అధ్యక్షులు రౌల్ కాస్ట్రోను కలసుకొని దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నప్పటికీ ఆర్థిక ఆంక్షలు కొనసాగడం వల్ల అమెరికా తొలి ప్రయాణికుల విమానం ఇక్కడికి రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఇరు దేశాల సంబంధాల్లో చరిత్రాత్మకమైన రోజని అమెరికాలోని క్యూబా అంబాసిడర్ జోస్ రామన్ కబనాస్ వ్యాఖ్యానించారు.