హైదరాబాదీ సత్య నాదెళ్లకు ఘన సన్మానం
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో సత్య నాదెళ్ల సహా నలుగురు భారతీయ అమెరికన్లను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూఎస్ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా సన్మానించింది. కార్నెగీ కార్పొరేషన్ సహకారంతో న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలో స్థిర పడిన భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్య నాదెళ్ల సహా ప్రముఖ హాస్య ప్రయోక్త, నటుడు ఆసిఫ్ మండ్వి, కార్నెగీ మెలాన్ వర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్, వర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా మాజీ ప్రెసిడెంట్ బెహెరజ్ సెత్నాలు అమెరికాలో విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించారు.
వీరితోపాటు మరో 36 మందిని కూడా సత్కరించారు. హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల.. సాంకేతిక రంగంలో శక్తిమంతమైన నాయకుడిగా అనతి కాలంలోనే ఎదిగి రికార్డు సృష్టించారు. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈవోగా పగ్గాలు చేపట్టారు. ముంబైకి చెందిన ఆసిఫ్ మండ్వి తొలుత ఇంగ్లాడ్‌కు వెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఇస్లాం, పశ్చిమాసియా, దక్షిణాసియాలపై తనదైన శైలిలో సైటర్లు వేసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. చెన్నైకి చెందిన సుబ్రా సురేష్ కార్నెగీ మెలాన్ వర్సిటీ 9వ అధ్యక్షుడిగా ఎదిగారు.