సీఎం చంద్రబాబుతో సత్య నాదెళ్ల భేటీ
♦ గంటన్నర పాటు కొనసాగిన సమావేశం వివిధ అంశాలపై చర్చ
♦ మైక్రోసాఫ్ట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ విషయంలో సీఎంవో తొట్రుపాటు!
♦ విశాఖలో ఏర్పాటుకు సత్య నాదెళ్ల అంగీకరించారని ముందు ప్రకటన
♦ అంతలోనే ఖండించిన మైక్రోసాఫ్ట్ వర్గాలు
♦ ప్రకటనను సవరించుకున్న సీఎం కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్యనిర్వహణ అధికారి సత్య నాదెళ్ల సోమవారం సమావేశం అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు కొనసాగింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఐటీ వినియోగం ద్వారా ఏపీకి మైక్రోసాఫ్ట్ సంస్థ ఎలా సాయపడగలదన్న అంశంపై వీరు చర్చించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పౌరసేవా రంగాల్లో ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అవసరమైన ఐటీ ఆధారిత సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ ఈ ఒప్పందం ద్వారా అందిస్తుంది.
రూ. 2,500 కోట్ల విలువైన ఈ ప్రగతి ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు సత్య నాదెళ్ల ఆసక్తి కనపరిచారు. ఈ అంశంపై సమగ్ర ప్రణాళికతో సియాటిల్‌ను సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్ల ఆహ్వానించగా నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు.అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బీఐ టెక్నాలజీ విధానాన్ని విద్య, వ్యవసాయ రంగాల్లో వినియోగించుకుంటారు. అనంతపురం జిల్లాలో పర్యటించాల్సిందిగా సత్య నాదెళ్లను చంద్రబాబు ఆహ్వానించగా ఈసారి పర్యటిస్తానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ హెడ్ అనిల్ బన్సాలీ, గవర్నమెంట్ బిజినెస్ హెడ్ నీరజ్ గిల్, ఏపీ ఐటీ కార్యదర్శి ఫణి కిషోర్ తదితరులున్నారు.
సత్య హామీ ఇచ్చారు..
కాదు పరిశీలిస్తామన్నారు..!
విశాఖపట్నంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల అంగీకారం తెలిపారంటూ సీఎంవో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సత్య నాదెళ్లతో చంద్రబాబునాయుడు అల్పాహార విందు భేటీ అనంతరం సీఎం కార్యాలయం ఈ ప్రకటనను విడుదల చేసింది. ఇద్దరు లీడర్ల అపూర్వ కలయిక.. సీఎంతో సత్య నాదెళ్ల కీలక చర్చలు, ఇ-ప్రగతిలో భాగస్వామ్యానికి మైక్రోసాఫ్ట్ ముందడుగు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఒప్పందాలు, విశాఖలో మైక్రోసాఫ్ట్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు, త్వరలో సియాటిల్‌కు ఏపీ ఐటీ బృందం...అంటూ వార్తలు వచ్చాయి.
అయితే... ఆ తరువాత కొద్ది సేపటికే రివైజ్డ్ పేరుతో అదే కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటును ‘పరిశీలిస్తామని’ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారని పేర్కొంది. మొదటేమో సత్య ఒప్పేసుకున్నారు.. అని ప్రకటన జారీ చేసి, ఆ తర్వాత మాత్రం పరిశీలిస్తామని మాత్రమే హామీ ఇచ్చారని ప్రభుత్వం తప్పును సరిదిద్దుకునే యత్నం చేసింది. సీఎంవో నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అంగీకారమని ప్రకటన వచ్చాకా..దాన్ని సవరిస్తూ పరిశీలన అని ప్రకటన రావడం వెనుక మైక్రోసాఫ్ట్ సంస్థ జోక్యమే కారణమని సమాచారం. తాము విశాఖలో ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించలేదని, పరిశీలిస్తామని హామీ మాత్రమే ఇచ్చామని ఆ సంస్థ స్పష్టం చేయటంతో సీఎంవో తన తప్పును సవరించుకుని మరో ప్రకటన జారీ చేసింది.