
వాషింగ్టన్: అపరిచితులకు ఆశ్రయమిచ్చి, పోలీసుల నుంచి సుమారు 70 మందిని రక్షించినందుకు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రాహుల్ దూబేను మీడియా హీరోగా కొనియాడుతోంది. అమెరికాలోని మినియాపోలిస్‌లో గత వారం ఒక పోలీస్ అధికారి చేతిలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందగా.. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్‌లో రాహుల్ దూబే ఇంటికి సమీపంలో కొంతమంది ఆందోళనలు నిర్వహిస్తూండగా.. కర్ఫ్యూ సమయం సమీపిస్తున్న తరుణంలో పోలీసులు వారిని చుట్టుముట్టారు.
ఆ సమయంలో రాహుల్ వారందరినీ తన ఇంట్లోకి రావాల్సిందిగా కోరారు. వాషింగ్టన్‌లో 17 ఏళ్లుగా ఉంటున్న రాహుల్ అల్వారేజ్ దూబే ట్రేడింగ్ కంపెనీని నడుపుతున్నారు. ఇంట్లోకి వచ్చిన అపరిచితులకు ఆహారం ఇవ్వడంతోపాటు రాత్రంతా ఉండేందుకు, తద్వారా వారు పోలీసుల చేత చిక్కకుండా కాపాడారని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ‘దాదాపు 75 మంది ఉన్నారు. కొందరు సోఫాల్లో సర్దుకున్నారు. వచ్చిన వాళ్లలో తల్లీ బిడ్డలతో కూడిన కుటుంబం ఉంది. వాళ్లు నా కొడుకు గదిలో విశ్రాంతి తీసుకున్నారు’అని 44 ఏళ్ల దూబే చెప్పారు.
చేసింది గొప్ప పనేమీ కాదు: రాహుల్
తాను కొంతమందికి ఆశ్రయం కల్పించడం గొప్ప పనేమీ కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘రాత్రి 8.30 గంటలపుడు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా వారందరూ మా ఇంటివైపు పరుగెత్తుతూ వచ్చారు. వచ్చినవాళ్లను వచ్చినట్లే లోపలకు లాగేసుకున్నాం’అని రాహుల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment