
భారతీయ అమెరికన్లకు కృతజ్ఞతలు
మోదీ సంస్కరణలపై ట్రంప్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓర్లాండో, ఫ్లోరిడాలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ అమెరికన్లు, భారత్‌కు చెందిన హిందువులు తన గెలుపుకు కృషి చేశారని కొనియాడారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ఇండియన్ అమెరికన్లు అత్యధికంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్యూబన్ సంతతి వారికి కూడా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కశ్మీర్, బంగ్లాదేశ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లోని హిందూ బాధితుల కోసం నిధుల సేకరణకు ఎన్నికలకు రెండు వారాల ముందు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ట్రంప్ హాజరయ్యారు.
అమెరికా–భారత్ సంబంధాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తానన్నారు. వైట్ హౌస్‌కు భారత్ బెస్ట్ ఫ్రెండ్ కాబోతుందని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని మీరు నమ్మండి, అమెరికానూ నమ్మండ’ని చెప్పారు. అందరం కలసి అమెరికాను గొప్పగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారత ప్రధాని మోదీ తీసుకున్న ఆర్థిక సంస్కరణలను మెచ్చుకున్నారు. అమెరికా ఎన్నికల్లో మోదీ తరహాలో ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’’ నినాదాన్ని ప్రచారం చేయడం తెలిసిందే.