Sakshi News Guest Column On Sanskrit Language - Sakshi
Sakshi News home page

Sakshi Guest Column: సంస్కృతంలో వాళ్లెందుకు రాయరు?

Published Wed, Jul 19 2023 12:25 AM | Last Updated on Wed, Jul 19 2023 11:06 AM

Sakshi Guest Column On Sanskrit

సంస్కృతాన్ని ఇష్టపడే కొందరు భారతీయ అమెరికన్లు తమ పుస్తకాలను సంస్కృతంలో ఎందుకు రాయరు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను, విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి, రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు.

కానీ, ఇప్పుడు వాళ్లూ సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. అయినా ఆ అంతర్ధానానికి మాత్రం మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు.

దాదాపుగా భారతీయ అమెరికన్లతో కూడిన రాజీవ్‌ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఇటీవల ‘టెన్‌ హెడ్స్‌ ఆఫ్‌ రావణ: ఎ క్రిటిక్‌ ఆఫ్‌ హిందూఫోబిక్‌ స్కాలర్స్‌’ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంగ్లిషులో రాసిన ఈ పుస్తకం... ఈ రచయితతో సహా రొమిల్లా థాపర్, ఇర్ఫాన్‌ హబీబ్, శశిథరూర్, రామచంద్ర గుహ, దేవదత్‌ పట్నాయక్, షెల్డన్‌ పొలాక్, వెండీ డోనిగర్, ఆద్రీ త్రూష్కే, మైకేల్‌ విట్జెల్‌లను విమర్శించింది.

మల్హోత్రా బృందం ఈ పండితులను పౌరాణిక పాత్ర అయిన రావణుడితో పోల్చింది. ఈ పండితులు ప్రాచీన సంస్కృత పుస్తకాలు ప్రబోధించిన ధర్మాన్ని చంపేశారని ఆరోపించింది. ‘చారిత్రక రావణుడికి మల్లే ఈ పండితుల రచనల్లో నేడు చాలామంది హిందువులు అధర్మంగా భావిస్తున్న అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ పుస్తకంలో పది మంది సమకాలీన విద్వాంసులను లక్ష్యంగా’ ఎంచుకున్నట్లు మల్హోత్రా తన పరిచయంలో పేర్కొన్నారు. 

ఈ పుస్తకంలో లక్ష్యంగా ఎంచుకున్న నలుగురు విదేశీ పండితులు సంస్కృత భాషపై కృషి చేశారు. చాలాకాలం వివిధ పాశ్చాత్య విశ్వ విద్యాలయాలలో సంస్కృత భాషను బోధించారు. మరోవైపు, మల్హోత్రాకు అమెరికాలో ‘ఇన్ఫినిటీ ఫౌండేషన్‌’ అనే ఆర్థిక నెట్‌వర్క్‌ ఉంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఢిల్లీలోని ‘గరుడ ప్రకాశన్ ’ సంస్థనూ నడుపుతున్నారు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: సంస్కృతాన్ని ఇష్టపడే ఈ భారతీయ అమెరికన్లు తమ పుస్తకాన్ని సంస్కృతంలో ఎందుకు రాయలేదు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. సంస్కృతాన్ని గొప్ప ప్రపంచ సజీవ భాష అంటారు, కానీ ఆ భాషలో ఏ గ్రంథాన్నీ రాయరు. సంస్కృతాన్ని మృత భాష అని షెల్డన్‌ పొల్లాక్‌ సరిగ్గానే అన్నారు.

తమ దైనందిన జీవితంలో సంస్కృతాన్ని ఉప యోగించే, అందులో భావ వ్యక్తీకరణ చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక భాషను స్థానికంగా మాట్లాడేవారు లేనప్పుడు భాష మరణిస్తుంది. ఆధిపత్య నియంత్రణను కొనసాగించడానికి సంస్కృతాన్ని ఉపయోగించే వ్యక్తుల సమూహమే ఆ భాషను చంపేసింది. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను లేదా విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి లేదా రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. 

సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఇప్పుడు వాళ్లూ ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ అంతర్ధానానికి మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. ఇతర సంస్కృతులకు చెందిన యూదుల వంటివారు తమ ఆధునిక పుస్తకాలను హీబ్రూలో రాస్తున్నారు.

యువల్‌ నోవా హరారీ ప్రభావవంతమైన రచన ‘సేపియన్స్– ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ హ్యూమన్ కైండ్‌’ను మొదట హీబ్రూలోనే రాశారు. అలాగే గ్రీకులు గ్రీకు భాషలో రాస్తారు. అరబ్బులు అరబిక్‌లోనే రాస్తారు. బ్రాహ్మణ వాదులు మాత్రం సంస్కృతంలో రాయరు. శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీ కాన్ని మోసం చేయడానికి మాత్రమే సంస్కృతాన్ని పొగడటాన్ని నేటికీ కొనసాగిస్తున్నారా? 

బ్రాహ్మణవాద మేధావులకు ఆరెస్సెస్, బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా మద్దతు ఇస్తున్నాయి. భారతదేశ వ్యవసాయ చేతివృత్తుల చరిత్రను విస్మరిస్తూ సంస్కృత గతాన్ని మాత్రమే వీరు కీర్తిస్తున్నారు. వివిధ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్నంతటినీ సంస్కృత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతాల నుండే దొంగిలించారనే భావనను ప్రచారం చేస్తారు.

బ్రాహ్మణవాద శాస్త్రవేత్తలు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలన్నీ ప్రాచీన సంస్కృత పుస్తకాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పండితుల్లో ఎంతమంది సంస్కృతంలో ఆ పుస్తకాలను చదివారు? సంస్కృతంలో ఇంత అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ మేధావులు... ప్రపంచ తాత్విక, మే«ధాపరమైన రచనలను హరారీ వంటి వ్యక్తులకు ఎందుకు వదిలివేస్తున్నారు? 

భారతదేశ చరిత్ర పొడవునా సంస్కృతాన్ని ‘మాతృభాష’గా కాకుండా ‘పితృభాష’గా పరిగణిస్తూ వచ్చారు. సంస్కృతాన్ని ద్విజ కుటుంబాలలో కూడా మాతృభాషగా మారడానికి అనుమతించలేదని గుర్తుంచుకోవాలి. తల్లి, ఆమె బిడ్డల మధ్య సంభాషణతో సహా ఇంటిలో రోజువారీ జీవితంలో ఒక భాషను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే దానిని ‘మాతృభాష’గా పరిగణించవచ్చు. 

కులీన గృహాలలో కూడా సంస్కృతాన్ని మాతృభాషగా మారడానికి అనుమతించనప్పుడు, ఉత్పత్తి వర్గాల్లో దాన్ని స్వీకరించే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నాగరికతకు రక్షణకర్తలుగా తమను తాము గుర్తించుకునే ఈ భారతీయ అమెరికన్ల సమూహం... సంస్కృతంలో తమ పుస్తకాలను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించాల్సి ఉంది.

ఈ బృందం ప్రధానంగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నివసిస్తున్న వ్యక్తులలోని భారతీయ ఆలోచనా విధానాన్ని నిర్వలసీకరించడం, ఆర్థిక వనరులను సమీకరించడం లక్ష్యంగా పెట్టు కుంది. కానీ, భారతదేశంలో స్థాపించిన సంస్కృత పాఠశాలలు,సంస్కృత విశ్వవిద్యాలయాలకు వారు తమ పిల్లలను ఎందుకు పంపరు? బదులుగా వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్‌ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఎందుకు పంపాలని భావిస్తున్నారు?

‘టెన్‌ హెడ్స్‌ ఆఫ్‌ రావణ’ పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తులు,సంస్కృత పుస్తకాల నుండి వచ్చిన భారతదేశ నాగరికత మా లాంటి ఎవరికీ తెలియదని ఆరోపించారు. నాగరికత అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటి? పుస్తకాల ద్వారా నాగరికతను నిర్మించవచ్చా?

సంస్కృత పుస్తకాలకు చెందిన ఏదైనా అనువాదాన్ని చదివితే... శూద్ర, దళిత, ఆదివాసీ వర్గాల నుండి సామాజిక శక్తులు ఏవీ లేవని అది సూచిస్తుంది. ఇవి యుద్ధం, యజ్ఞాలు, క్రతువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఆహార ఉత్పత్తి, సేకరణ, జంతువుల మేతకు చెందిన వ్యవస్థలను ఈ పుస్తకాలలో ఏ కోశానా పొందుపర్చలేదు.

ఈ హిందూత్వ రచయితలతో సహా మానవులందరూ శూద్ర వ్యవసాయా ధారిత ప్రజానీకం ఉత్పత్తి చేసే ఆహారంతోనే జీవిస్తున్నారని గుర్తించడం ముఖ్యం. ఆ ‘సంస్కృత యుగం’లో భూమిని పండించిన వారి గురించి, జంతువుల మేత ద్వారా మాంసాన్ని, పాలను ఉత్పత్తి చేసిన వారి గురించి ఎప్పుడూ రాయలేదు.

హాస్యాస్పదంగా, ఈ భారతీయ అమెరికన్‌ కులీన వర్గాలు, ప్రత్యేకించి అమెరికాలో కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే ఇన్ఫినిటీ ఫౌండేషన్‌ సభ్యులు తమను తాము ‘మేధావులైన క్షత్రియులు’గా పేర్కొంటారు. అది కులతత్వం కాదా? మరోవైపున వీరి సంస్కృత యుగం పట్ల దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు.

ఇంగ్లిష్‌ యుగంలోకి వెళ్లాలనీ, జ్ఞానోత్పత్తికి సంబంధించిన అన్ని కేంద్రాల నుండి ఈ శక్తులను స్థానభ్రంశం చేయాలనీ, ఆహార ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించాలనీ వారు కోరుకుంటున్నారు. ఇది అమృత్‌ కాల్‌ కాదు; నిజానికి ఇది శూద్ర కాలం. ఈ యుగంలో సంస్కృత పుస్తకాలలో వర్ణించినట్లుగా ఉత్పత్తి అనేది లోకువైనది కాదు; ఇక్కడ ఉత్పత్తి చాలా పవిత్రమైనది. 
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement