హిందువుల కోసం రంగంలోకి ట్రంప్ కొడుకు!
హిందువుల కోసం రంగంలోకి ట్రంప్ కొడుకు!
Published Sun, Nov 6 2016 3:56 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
ఓర్లాండో: ఈ నెల 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇండియన్ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి తన కొడుకును రంగంలోకి దింపారు. ట్రంప్ తనయుడు ఎరిక్ శనివారం ఫ్లోరిడాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించి.. హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట సూట్ వేసుకొని వచ్చిన ఎరిక్ (32) ఆలయం వద్ద భారతీయ సంప్రదాయ దుస్తులైన షెర్వాణీ ధరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి.. దేవుడికి హారతి ప్రాధాన్యం, హిందు సంప్రదాయాలు, ఆచారాల గురించి పూజారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎరిక్‌కు కాషాయ ప్రతిమను ప్రధాన పూజారి బహూకరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా కీలకంగా మారింది. ఫ్లోరిడాలో సంపన్న హిందూ జనాభా నానాటికీ పెరుగుతూ.. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇక్కడి హిందువులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. నరేంద్రమోదీ 2014 ఎన్నికల నినాదం ఆధారంగా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు ఇలా నేరుగా ఇండియన్ అమెరికన్ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Advertisement