
వీసా కేసులో భారత అమెరికన్లు
వాషింగ్టన్: హెచ్ 1బీ వీసా మోసాలకు పాల్పడినట్లు నలుగురు భారతీయ అమెరికన్లపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. సిలికాన్ వ్యాలీలో నివాసముంటున్న భార్యాభర్తలైన సునీత, వెంకట్ గుంటిపల్లితో పాటు ప్రతాప్ బాబు కొండమూరి, సంధ్య రామిరెడ్డిలపై హెచ్ 1 బీ వీసాల కోసం తప్పుడు పత్రాలు సమర్పణ, ప్రభుత్వాన్ని మోసగించడం వంటిఅభియోగాలు నమోదు చేసినట్లు కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం తెలిపింది.
సునీత, వెంకట్‌లు డీఎస్ సాఫ్ట్‌టెక్ అండ్ ఈక్వినెట్ సంస్థను, ఉద్యోగావకాశాలు కల్పించే మరో సంస్థను నెలకొల్పి వీసాల కోసం తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తులు చేశారంది. ఎస్‌ఐఎస్‌ఎల్ నెట్‌వర్క్స్ సంస్థను నెలకొల్పిన నెవడాకు చెందిన ప్రతాప్, ఈ సంస్థల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్న ప్రతాప్ సోదరి సంధ్య.. కూడా సునీత, వెంకట్‌లతో ఈ కుట్రలో పాలు పంచుకున్నారని ఆరోపించింది. 2010-2014 మధ్య వందకు పైగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు సమర్పించారని, మోసపూరితంగా 33 లక్షల డాలర్ల నికర లాభాలు ఆర్జించారని వివరించింది.