
అమెరికాలో మోదీకి భారతీయుల స్వాగతం
వాషింగ్టన్: అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ అక్కడి భారతీయులు ఘనస్వాగతం పలికారు. అక‍్కడి విలార్డ్ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ హోటల్‌కు మోదీ చేరుకునేసరికి హోటల్ బయట భారత ప్రజలు వేచి ఉన్నారు. ఆయన తన కారు దిగి సరాసరి భారతీయుల వద్దకు వెళ్లి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీంతో భారతీయులు పట్టరాని సంతోషంతో మోదీ.. మోదీ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
పర్యటనలో భాగంగా వర్జీనియాలో ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నిర్వహించే కార్యక్రమంలో 20 లీడింగ్ అమెరికన్ సీఈఓలతో మోదీ సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600మంది సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. రేపు మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. మోదీ రాకకోసం ఎదురుచూస్తున్నానని, నిజమైన స్నేహితుడితో వ్యూహాత్మక విషయాలపై చర్చిస్తామని ట్రంప్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.