అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇద్దరు భారతీయ అమెరికన్లను తమ వాణిజ్య విధానం, చర్చల సలహా కమిటీలో నియమించారు. వారిలో ఒకరు ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి, మరొకరు నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈవో మనీష్ బాప్నా.
ప్రెసిడెంట్ నియమించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ సిఫార్సు చేసినవారు 45 మంది వరకు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి అంశాలలో నైపుణ్యం కలిగి వారు, ఫెడరల్ ప్రభుత్వాలకు సంబంధం లేని కార్మిక, పరిశ్రమ, వ్యవసాయం, స్మాల్ బిజినెస్, సేవల ప్రతినిధులను ఇందులో సభ్యులుగా నియమిస్తారు. పరిశ్రమలు, రిటైలర్లు, ప్రభుత్వేతర పర్యావరణ, పరిరక్షణ సంస్థలు, వినియోగదారుల సంస్థలకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం ఉంటుంది.
వరుసగా నాలుగు సార్లు పవర్‌ఫుల్ బిజినెస్ వుమెన్
ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ వ్యూహాత్మక దిశను రూపొందించి తయారీ రంగంలో కొత్త శకాన్ని నిర్వచిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఫ్లెక్స్‌కు ముందు అద్వైతి ఈటన్ కంపెనీ ఎలక్ట్రికల్ సెక్టార్ వ్యాపారానికి ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేశారు. అమెరికాస్, హనీవెల్‌లో కూడా పని చేసిన ఆమె ఉబెర్, కేటలిస్ట్ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా సేవలందించారు.
అద్వైతి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సీఈవో కమ్యూనిటీకి ఉపాధ్యక్షత వహిస్తున్నారు, సీఈవో క్లైమేట్ లీడర్స్ డబ్ల్యూఈఎఫ్ అలయన్స్‌లో చేరారు. రేవతి వరుసగా నాలుగు సార్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన వ్యాపార జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే భారత్‌లోని బిజినెస్ టుడే సంస్థ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఎంపికయ్యారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఆమె థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
పర్యావరణ రంగంలో విశేష అనుభవం
దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ముఖ్యమైన పర్యావరణ మైలురాళ్లు, పర్యావరణ చట్టాల రూపకల్పన వెనుక మనీష్ బాప్నా ప్రెసిడెంట్, సీఈవోగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్‌ఆర్‌డీసీ) ఉందని వైట్ హౌస్ తెలిపింది. మనీష్ బాప్నా 25 ఏళ్ల అనుభవంలో పేదరికం, వాతావరణ మార్పుల మూలాలను కనుగొనేందుకు విశేష కృషి చేశారు. ఆయన వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఆర్థికవేత్త కూడా అయిన మనీష్ బాప్నా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో న్యాయవాద వృత్తిని కొనసాగించే ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ప్రపంచ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్‌తో పాటు పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో ఆయన మాస్టర్ డిగ్రీలు పొందారు. అంతకుముందు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment