సీఎన్‌ఎన్ విలేకరి నుంచి మైక్రోఫోన్‌ను లాగేస్తున్న మహిళా సిబ్బంది
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు రెఫరెండంగా భావించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతిపక్షానికి బాసటగా నిలిచే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశమైందని ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. కానీ, ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధారణ మెజారిటీ కన్నా కనీసం 23 సీట్లు అధికంగా గెలుచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమొక్రాట్లకు 193 సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు సుమారు 27 సీట్లు కైవసం చేసుకున్నారని ప్రాథమిక ఫలితాలు వెల్లడించాయి. కొత్త సభ వచ్చే జనవరిలో కొలువుదీరుతుంది. నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. వారంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. ఈసారి రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభకు ఎన్నికయ్యారు.
అందులో 28 మంది తొలిసారి ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల నాన్సీ పెలోసి ప్రతినిధుల సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యే చాన్సుంది. ఈ పదవి భారత్‌లో లోక్‌సభ స్పీకర్ హోదాతో సమానం. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. మరోవైపు, 35 స్థానాలకు ఎన్నికలు జరిగిన సెనెట్ (మొత్తం సభ్యులు 100)లో రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కొనసాగించారు. తాజా ఎన్నికల తరువాత ఎగువ సభలో వారి బలం 51 పైనే ఉందని స్థానిక మీడియా తేల్చింది.
ఇండో–అమెరికన్ల విజయం..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికవగా, మరో డజను మందికి పైగా రాష్ట్రాల స్థాయిలో జరిగిన అసెంబ్లీ, సెనెట్, అటార్నీ జనరల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇలినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాలో రాజా క్రిష్ణమూర్తి మళ్లీ గెలిచారు. కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ జిల్లాలో అమీ బేరా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సిలికాన్ వ్యాలీలో రో ఖన్నా గెలిచారు.
ప్రతినిధుల సభలో ఏకైక మహిళా ఇండో అమెరికన్ ప్రమీలా జయపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోష్ కౌల్.. అటార్నీ జనరల్‌గా ఎన్నికై, ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో–అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీకే చెందిన నీమా కులకర్ణి కెంటుకీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అమీశ్, కెవిన్ థామస్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ముజతబా మొహమ్మద్ ఉత్తర కరోలినాసెనెట్‌కు ఎన్నికయ్యారు.
మీడియాపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: మీడియాపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తరువాత బుధవారం శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా సీఎన్‌ఎన్ పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ట్రంప్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి నిరాకరించి మైక్రోఫోన్‌కు దూరంగా జరిగారు.
ట్రంప్ నేరగాళ్లుగా అభివర్ణించిన మధ్య అమెరికా ప్రజల వలసల గురించి సీఎన్‌ఎన్ పాత్రికేయుడు ప్రశ్నించగా..‘మీ పని మీరు చూసుకోండి..దేశ పాలనను నన్ను చేయనీయండి’ అని ట్రంప్ బదులిచ్చారు. రిపబ్లికన్ పార్టీ శ్వేత జాతీయులకు మద్దతిస్తోందా? అని మహిళా జర్నలిస్ట్ అడగ్గా.. ఆమె జాత్యహంకార ప్రశ్నలు వేస్తోందని మండిపడ్డారు. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన సీఎన్‌ఎన్ విలేకరి ప్రెస్ ప్రవేశ అర్హతా పత్రాల్ని వైట్‌హౌజ్ రద్దుచేసింది. మీడియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రవర్తన హద్దులు మీరిందని సీఎన్‌ఎన్ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment