
ప్రతినిధుల సభలో మెజారిటీ చేతులు మారడం ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని భావిస్తున్నారు. వలసలు, ఆర్థికం, వాణిజ్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఏకపక్షంగా అమలుచేస్తున్న అధ్యక్షుడి విధానాల్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష డెమొక్రాట్లకు తాజా ఫలితాలతో మంచి అవకాశం లభించనుంది. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల్ని మూకుమ్మడిగా ఎదిరిస్తామని కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇదివరకే ప్రకటించడం తెల్సిందే. ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల బలం పెరగడంతో ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అధ్యక్షుడి దుందుడుకు, విపరీత వైఖరిని కట్టడి చేయడానికి డెమొక్రాట్ల ముందున్న కొన్ని మార్గాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ స్థాయీ సంఘాలపై డెమొక్రాట్లకు మరింత నియంత్రణ లభిస్తే ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన పలు కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. ట్రంప్‌పై అభిశంసన చేపట్టేందుకు చర్యలు తీసుకునే చాన్సుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు బడ్జెట్ విషయంలో ట్రంప్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిలా ట్రంప్ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు.
ట్రంప్ గతంలో వెల్లడించడానికి నిరాకరించిన వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమొక్రాట్లు ప్రయత్నిస్తారు. ఈసారి కూడా ట్రంప్‌ను రిటర్న్స్ కోసం అడుగుతామని, ఆయన తిరస్కరిస్తే తమకున్న అధికార పరిధిలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్ నీల్ చెప్పారు. అక్రమ వలసల కట్టడికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేశారు. సంఖ్యాబలం పెరగడంతో డెమొక్రాట్లు గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు చర్యలు తీసుకోవచ్చు. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి పెంచే చాన్సుంది.
Comments
Please login to add a commentAdd a comment