డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సెనేట్ ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 223 స్థానాల్లో డెమోక్రాట్లు గెలుపొందగా, 196 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 28 స్థానాలను కూడా డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో హౌస్‌లో డెమోక్రాట్లు మోజార్టీని పొందారు.
ఇక సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీ ఎట్టకేలకు తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరగగా.. 32 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలనంతరం సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 46 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇంకా మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇక 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఫలితాలతో డెమోక్రటిక్ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు. రిప్రజెంటేటివ్స్ హౌస్, సెనేట్‌ను కలిపి అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment