‘మధ్యంతర ఎన్నికలకు సిద్ధం.. మళ్లీ గెలుస్తాం’
ముంబయి: మధ్యంతర ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ శివసేన పార్టీకి స్పష్టతనిచ్చారు. ప్రజలు తమతోనే ఉన్నారని విశ్వాసం తనకు ఉందని అన్నారు. రైతుల ఆందోళన, నిరసనలు, వ్యవసాయ సంక్షోభం కారణంగా మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు సవాల్ చేశారు.
‘కొంతమంది ప్రజలు(శివసేన పార్టీ నేతలు) మా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. వారి మద్దతు ఉపసంహరించుకుంటామని చెబుతున్నారు. మధ్యంతర ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. మేం మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’ అని ఫడ్నవీస్ నేరుగా శివసేన పార్టీ పేరును ప్రస్తావించకుండా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలు ప్రకటించకుంటే తాము మద్దతును ఉపసంహరించుకుంటామని శివసేన ఎంపీ సంజయ్ రావత్ ఓ మరాఠీ టీవీ చానెల్‌కు చెప్పిన నేపథ్యంలో ఫడ్నవీస్ చేసిన ఈ సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.