ఆదిత్య థాక్రే
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే సర్కార్ త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు ఆదిత్య థాక్రే. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం అన్నారు. శివ్ సంవాద్ యాత్రలో భాగంగా పైఠణ్‌లో శివసేన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి ఉద్ధవ్ థాక్రేను శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు ఆదిత్య థాక్రే. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు అదను చూసి ద్రోహం చేశారని విమర్శించారు. పైఠణ్ ఎమ్మెల్యే, షిండే వర్గంలో ఒకరైన సందీపన్ భుమ్రేపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ హయాంలో నిధులు మంజూరు చేయలేదని ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయనకు ఐదుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలకు తాము చేసిందంతా తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని, కానీ ఇది ఏడవాల్సిన సమయం కాదు పోరాడాల్సిన సమయం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కొందరు బలవంతం చేయడం వల్లే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తన తండ్రిపై తిరుగుబాటు చేశారని ఆదిత్య థాక్రే ఆరోపించారు. వారంతా తిరిగి తమతో కలవాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి ఊహించని షాక్ ఇచ్చారు ఏక్‌నాథ్ షిండే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేజిక్కుంచుకున్నారు. శివసేన తమదే అని ఇప్పుడు థాక్రే, షిండే వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ బలం నిరూపించుకోవాలని ఎన్నికల సంఘం సూచించిన విషయం తెలిసిందే.
చదవండి: ఎన్‌డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్
Comments
Please login to add a commentAdd a comment