బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని మన రాజ్యాంగం 24వ అధికరణం ద్వారా నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా, అందుకనుగుణంగా రకరకాల చట్టాలొచ్చినా... తదనంతరకాలంలో వాటికి సవరణలు తెచ్చినా అమలులో మాత్రం వరస వైఫల్యాలే ఎదురవుతున్నాయి. పదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని 1978లో తీర్మానించారు. 1988లో దాన్నే మరోసారి పునరుద్ఘాటించారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త గడువు విధించుకోవడం తప్ప సమస్య పరిష్కారం మాత్రం సాధ్యపడటంలేదు. అందువల్లే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ముందుకు మరింత పకడ్బందీగా బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది.
చేసిన చట్టాలు ఎందుకు చట్టుబండలయ్యాయో, లోపం ఎక్కడున్నదో గమనించుకుని అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదా అనే అనుమానం అందరికీ కలుగుతున్నది. వాస్తవానికి ఈ సవరణ బిల్లును రూపొందించి రెండేళ్లు దాటుతోంది. ఇన్నాళ్లకు ఇప్పుడు పార్లమెంటు ముందుకు వస్తున్నది. బాల కార్మికులు గనుల్లో లేదా పరిశ్రమల్లో ఉండరాదని భారతీయ కర్మాగారాల చట్టం (1948), గనుల చట్టం (1952) నిషేధించాయి.
ఆ తర్వాత చాన్నాళ్లకు బాలకార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం (1986) వచ్చింది. దానికి కొనసాగింపుగా జాతీయ బాలకార్మిక విధానం (1987) వచ్చింది. వీటన్నిటివల్లా తగిన ఫలితాలు రాలేదన్న ఉద్దేశంతో 1986 నాటి చట్టానికి 2006లో మరోసారి సవరణలు తీసుకొచ్చారు. ఇవిగాక బాలలందరూ తప్పనిసరిగా బడికెళ్లేలా చూడాలని 2010లో అమల్లోకొచ్చిన విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తున్నది. ఇంత చేసినా బాల కార్మికులు అడుగడుగునా తారసపడుతూనే ఉన్నారు.
మన వ్యవస్థ చేతగానితనాన్ని వెక్కిరిస్తూనే ఉన్నారు. కార్పెట్ పరిశ్రమల్లో, బీడీల తయారీలో, మరమగ్గాల పనుల్లో, క్వారీల్లో, ఇటుక బట్టీల్లో, రోడ్డు పక్కన కనబడే టీ దుకాణాల్లో, మెకానిక్ షెడ్లలో...ఎక్కడ చూసినా బాల కార్మికులే కనిపిస్తారు. వీరంతా 5-14 ఏళ్ల మధ్య వయసున్నవారే. కేవలం పేదరికం కారణంగానే బాల్యం చాకిరీలో మగ్గవలసి వస్తున్నదన్నది పాక్షిక సత్యమేనని... పిల్లలు చదువుకు దూరమై పనుల్లో ఉండటంవల్ల నిరుపేదలు ఎప్పటికీ అదే స్థితిలో కొనసాగవలసి వస్తున్నదని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నదాంట్లో నిజముంది. పిల్లలకైతే తక్కువ వేతనాలివ్వొచ్చునని, లెక్కకు మిక్కిలి సమయం పని చేయించుకున్నా నోరెత్తర ని యజమానులు భావిస్తున్నారు. కనుకనే నిరుపేద వర్గాలకు సాయం చేసే వంకన పిల్లలతో చాకిరీ చేయిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) లెక్కల ప్రకారం ఆఫ్రికన్ దేశాల తర్వాత అత్యధిక బాల కార్మికులున్న దేశం మనదే.
ఇన్ని చట్టాలున్నా, ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో బాల కార్మిక వ్యవస్థ అదృశ్యం కాకపోవడానికి కారణాలేమిటి? సమస్య మూలాల్లోకి వెళ్లి అందుకు అనుగుణమైన చట్టాలను తయారుచేయకపోవడంవల్లనా లేక వాటిని అమలు చేస్తున్న అధికార యంత్రాంగంలో అలసత్వమా అనే విషయంలో ఎంత వరకూ సమీక్ష జరిగిందో తెలియదు గానీ 1986 చట్టానికి మరిన్ని సవరణలు తీసుకురావడంతోపాటు దాన్ని బాలలు, కౌమార కార్మికుల నిషేధ చట్టంగా మార్చాలని రెండేళ్లక్రితం యూపీఏ సర్కారు సంకల్పించింది.
ఆ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపడం, ఆ సంఘం దాన్ని కూలంకషంగా పరిశీలించి కొన్ని సవరణలు సూచించడం పూర్తయింది. వాస్తవానికి నరక కూపంలో మగ్గుతున్న లక్షలాదిమంది పిల్లలకు విముక్తి కలిగించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు విషయంలో పార్లమెంటు ఇంకాస్త చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. కనీసం ఇన్నాళ్లకైనా ఈ బిల్లు సభ ముందుకు రాబోతుండటం మెచ్చదగిందే. 1986 నాటి చట్టప్రకారం వ్యవసాయంవంటి ప్రమాదరహిత రంగాల్లో బాల కార్మికులను పనిలో ఉంచుకోవడం శిక్షార్హమైన నేరం కాదు.
తాజా సవరణల ప్రకారం ఇకపై ఏ రంగంలో బాల కార్మికులతో పని చేయించినా నేరమే అవుతుంది. అలాగే, ప్రమాదకర పనుల్లో బాల కార్మికులను ఉంచితే ప్రస్తుత చట్టం ఏడాది జైలు, రూ. 20,000 జరిమానా నిర్దేశిస్తుండగా... వారిని ఏ పనులకు వినియోగించుకున్నా రెండేళ్ల జైలు, రూ. 50,000 జరిమానా విధించాలని ప్రస్తుత సవరణ చెబుతున్నది. అయితే, ఇవన్నీ పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన టాస్క్‌ఫోర్స్‌లుండాలి. వాటికి లక్ష్య నిర్దేశం జరగాలి.
మన దేశంలో అసలు చట్టాల రూపకల్పనలోనే లోపమున్నది. ఏ చట్టం రూపొందించినప్పుడైనా అందుకు సంబంధించి అప్పటికే అమల్లో ఉన్న ఇతర చట్టాలేమిటో పరిశీలించడం కనీస ధర్మం. కానీ, దాన్ని సరిగా పాటించడం లేదని పదే పదే రుజువవుతున్నది. ఉదాహరణకు విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. కానీ, అమలులో ఉన్న బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం ప్రకారం కొన్ని రంగాల్లో పిల్లలతో పనిచేయించుకోవడం నేరం కాదు. అలాగే, 2000నాటి జువెనైల్ చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు లోపువారిని బాలలుగానే పరిగణిస్తారు.
చట్టాలు ఇలా పరస్పర వైరుధ్యాలతో ఉన్నప్పుడు ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అమలు చేసేవారిలో అయోమయం ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకొస్తున్న సవరణ బిల్లుకు అనుగుణంగా ఇతర చట్టాల్లో నిబంధనలను కూడా సవరిస్తే ఈ లోపాన్ని కొంతవరకూ సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు...పిల్లలను బడికి పంపించే నిరుపేద కుటుంబాలకు నగదు రూపేణా సాయం చేస్తామని చెప్పడం వల్లా, వారి జీవనప్రమాణాలను పెంచేందుకు అవసరమైన ఇతర చర్యలు తీసుకోవడం వల్లా కాస్తయినా ఫలితం లభిస్తుంది.
బాల్యానికి భరోసా ఉన్నట్టేనా?!
Published Fri, Nov 28 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement