
ముగ్గురు ఎంపీలకు గాయాలు
బెల్‌గ్రేడ్: బాల్కన్ దేశం సెర్బియా పార్లమెంట్ సమావేశం మంగళవారం వీధి పోరాటాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు స్మోక్ బాంబులు విసరడంతో అవి తాకి ముగ్గురు ఎంపీలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయించే విషయమై జరగాల్సిన ఓటింగ్‌ను ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ఈ సమావేశం అక్రమమని, ప్రధానమంత్రి మిలోస్ వుసెవిక్, ఆయన ప్రభుత్వం రాజీనామాను వెంటనే ధ్రువీకరించాలని డిమాండ్ చేశాయి.
సమావేశం మొదలైన అరగంటలోనే ప్రతిపక్ష సభ్యుల ఈలలు, కేకలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఎంపీలు ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నారు. ఆ తర్వాత పొగబాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రతిపక్షం ఉగ్రవాద ముఠాగా మారిపోయిందని స్పీకర్ అనా బిర్నాబిక్ అభివర్ణించారు.
అదే సమయంలో పార్లమెంట్ వెలుపల ప్రతిపక్షాల మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. వుసెవిక్ ప్రభుత్వం గద్దెదిగి, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీలకు నిధుల పెంపుపై చర్చ సాధ్యమని వామపక్ష నేత రదోమిర్ లజోవిక్ తేల్చి చెప్పారు.
గతేడాది నవంబర్‌లో కాంక్రీట్ నిర్మాణం కూలి 15 మంది చనిపోయారు. దీంతోపాటు మరికొన్ని ఘటనలను ఉదహరిస్తూ అవినీతి పెరిగిపోయిందంటూ విద్యార్థులు భారీ నిరసనలు చేపడుతున్నారు. విద్యారంగానికి ఎక్కువ నిధులు తదితర డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రధాని వుసెవిక్ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదిస్తేనే ప్రధాని రాజీనామా అమలవుతుంది. అధ్యక్షుడు అలెక్జాండర్ వుసిక్‌కు చెందిన అధికార సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీకి పార్లమెంట్‌లో మెజారిటీ ఉండటంతో వుసెవిక్ ప్రభుత్వం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment