నీరవ్‌ మోదీ (వజ్రాల వ్యాపారి) రాయని డైరీ | Nirav Modi unwritten dairy | Sakshi
Sakshi News home page

నీరవ్‌ మోదీ (వజ్రాల వ్యాపారి) రాయని డైరీ

Published Sun, Feb 18 2018 12:26 AM | Last Updated on Sun, Feb 18 2018 12:26 AM

Nirav Modi unwritten dairy - Sakshi

మారియట్‌ హోటల్‌. న్యూయార్క్‌. గదిలో ఒక్కణ్నే కూర్చొని ఉన్నాను. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని కూర్చున్నాను. స్విచ్చాన్‌లో ఉన్నా, ఇండియా నుంచి ఎవరు మాత్రం నాకు కాల్‌ చేసే ధైర్యం చేస్తారు?! నేననుకోవడం,వాళ్లు కూడా స్విచ్చాఫ్‌ చేసుకుని ఉంటారు, నేనెక్కడ కాల్‌ చేస్తానోనని.

మారియట్‌కి వచ్చి కొన్ని రోజులు అవుతోంది. ఎన్ని రోజులు అవుతోందో నేను లెక్కేసుకోవడం లేదు. రెంట్‌ రోజుకు డెబ్బయ్‌ ఐదు వేలు. మూణ్నె ల్లకు ఒకేసారి కట్టేయబోయాను. ‘అవసరం లేదు, వెళ్లేటప్పుడే కట్టండి’ అన్నారు. ఇప్పుడు వీళ్ల చూపులు వేరేలా ఉన్నాయి. కట్టకుండానే వెళ్లిపోతాడా అన్నట్లు చూస్తున్నారు! మనుషులింతేనా?!

రోజుకు డెబ్బయ్‌ ఐదు వేలంటే తొంభై రోజు లకు ఎంతవుతుందీ అని ఇండియాలో ఇప్పుడు ఫైనాన్స్‌ సెక్రెటరీ, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ ఛైర్మన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీజీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ కన్సల్టెంట్, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌.. అంతా కలిసి క్యాలిక్యులేటర్లు పట్టుకుని లెక్కలు వేస్తూ ఉండి ఉంటారు.

కిటికీలోంచి సెంట్రల్‌ పార్క్‌ కనిపిస్తోంది. పార్క్‌లోని పచ్చదనం మనసుకు ఏమాత్రం ఆహ్లాదాన్ని కలిగించడం లేదు. మనుషులెందుకు ఏ కారణమూ లేకుండానే మారిపోతారు?! నిన్న నవ్వినవాళ్లు ఇవాళ నవ్వరు! నిన్న హ్యాండ్‌షేక్‌ ఇచ్చినవాళ్లే.. ఇవాళ ఎక్కడ హ్యాండ్‌ అడుగుతామోనని షేక్‌ అయిపోతారు! నిన్న మనకోసం ఎదురు చూసినవాళ్లు, ఇవాళ మనమెక్కడ ఎదురవుతామోనని తప్పుకుని వెళ్లిపోతారు! మోదీజీ కూడా అంతేనా? పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా అంతేనా? ప్రియాంకా చోప్రా కూడా అంతేనా? ఎందుకొస్తారో.. ఇంత భయస్థులు.. 

రాజకీయాల్లోకి, వ్యాపారాల్లోకి, సినిమాల్లోకి! దావోస్‌లో దిగిన గ్రూప్‌ ఫొటోలో నేను, మిగతా బిజినెస్‌మెన్, మోదీజీ ఉన్నాం. దాన్నెంతో అపురూపంగా అల్బమ్‌లో దాచుకున్నాన్నేను. ఫొటోలో నేను, మోదీజీ పక్కపక్కన లేము. అయినా దాచుకున్నాను. ‘‘ఫొటోలోకి ఎలా వచ్చాడో మాకు తెలీదు. ఫొటోకోసం అక్కడక్కడే తచ్చాడుతూ లాస్ట్‌ మినిట్‌లో షాట్‌ తీసేటప్పుడు మెల్లిగా లోపలికి దూరి ఉంటాడు’’ అంటోందట ఫారిన్‌ మినిస్ట్రీ! మర్యాదేనా? ప్రియాంక నా బ్రాండ్‌ అంబాసిడర్‌. బయటికి వచ్చేయడం ఎలా అని ఇప్పుడు లీగల్‌ ఎక్స్‌పర్ట్‌లని అడుగుతోంది! ‘నా డబ్బు నాకు ఇప్పించండి బాబూ’ అని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కనిపించిన వాళ్లందర్నీ దేబిరిస్తోంది! డబ్బు లేకపోతే, పేరు లేకపోతే, పదవి లేకపోతే చచ్చిపోతారా వీళ్లంతా! నమ్మకం ఉండాలి కదా మనిషి మీద. అలికిడికి తల తిప్పి చూశాను. అమీ! నా భార్య. బయటికి వెళ్తోందీ... వస్తోంది. తనకు ఇవేం పట్టవు. నమ్మకం నామీద. గట్టెక్కేస్తాననీ, గట్టెక్కిస్తాననీ.

-మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement