రజనీకాంత్, సూపర్‌స్టార్ రాయని డైరీ | Rajinikanth not written dairy | Sakshi
Sakshi News home page

రజనీకాంత్, సూపర్‌స్టార్ రాయని డైరీ

Published Sun, May 8 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

రజనీకాంత్, సూపర్‌స్టార్ రాయని డైరీ

రజనీకాంత్, సూపర్‌స్టార్ రాయని డైరీ

ధ్యానంలో ఉన్నాను. దేహం ఒక్కటే కుదురుగా ఉంది! మనసు లగ్నం కావడం లేదు. ఇవాళెందుకో ఒక్క నా దేహాన్ని తప్ప, తమిళనాడులోని ప్రముఖ దేహాలన్నిటినీ పట్టుకు తిరుగుతోంది నా ఆత్మ. ఈ ఉదయమైతే.. నా దేహ ప్రవేశానికి ఎవరెవరివో ఆత్మలు వచ్చి వెళుతున్నాయి.
 
 మొదట కరుణానిధి వచ్చారు! ‘రజనీ.. నువ్వొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు కదా..’ అనుకుంటూ నేరుగా నా ధ్యాన మందిరంలోకి వచ్చేశారు. కాళ్లకు చెప్పుల్తోనే వచ్చేశారు. వీల్ చెయిర్‌లో ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా ఎలాగైనా వెళ్లిపోవచ్చని ఆయన అనుకుని ఉండొచ్చు. ‘ఓ.. కలైజ్ఞర్ కరుణానిధి.. రండి కూర్చోండి’ అన్నాను.. ఆయన కూర్చొనే ఉన్నారన్న సంగతి మర్చిపోయి!  ‘పోలింగ్ డేట్ దగ్గర పడింది రజనీ. నువ్వొక్క మాట చెప్పు ఈ రాష్ట్రానికి.. మేము వందసార్లు ప్రచారం చేసుకుంటాం’ అన్నారు. ‘పాలిటిక్స్‌కీ నాకూ పడదని వందసార్లు చెప్పాను కలైజ్ఞర్. మీరెవరూ ఒక్కసారి కూడా వినినట్లు లేదు’ అన్నాను. ఈ మాట కూడా ఆయన వినలేదు. ‘డీఎంకే పవర్‌లోకి రావడం ముఖ్యం కాదు రజనీ.. అన్నాడీఎంకేని రాకుండా చెయ్యడం అవసరం’ అంటున్నారు. అంటూనే సడెన్‌గా వీల్ చెయిర్ వెనక్కి తిప్పించారు కరుణ. ఏం జరిగిందా అని చూశాను. దూరంగా జయలలిత వస్తూ కనిపించారు.
 
 ‘రజనీ.. ఏంటిది! అంతా మీకు తెలిసే జరుగుతోందా?’ అన్నారు మేడమ్.. వచ్చీరాగానే. ‘కబాలీ ట్రైలర్‌ని కరుణానిధి నాకు యాంటీగా డబ్ చేసుకుంటే ఒక్కమాటైనా మాట్లాడకుండా మీ ధ్యానంలో మీరు ఉండిపోవడం నాకు నచ్చలేదు’ అంటున్నారు మేడమ్. ‘నాకు తెలీదు’ అన్నాను. ‘నాకు తెలుసు రజనీ’ అన్నారు మేడమ్!
 
 ‘మీరేమీ మారలేదు రజనీ. అవే సినిమాలు. అవే డైలాగులు. నైంటీ సిక్స్‌లో ఎలా ఉన్నారో.. టూ థౌజండ్ సిక్స్‌టీన్‌లోనూ అలాగే ఉన్నారు. నాకు ఓటేస్తే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడని అప్పుడు అన్నారు. కరుణానిధికి ఓటేయకపోతే తమిళనాడును ఏ దేవుడూ కాపాడలేడని ఇప్పుడు అనిపిస్తున్నారు. అంతే తేడా’ అంటూ కోపంగా వెళ్లిపోయారు. మేడమ్ ఇలా అదృశ్యం కాగానే, విజయకాంత్ అలా ప్రత్యక్షం అయ్యాడు. ‘రజనీ.. యాక్షన్ ఈజీ. పాలిటిక్సే కష్టం’ అనుకుంటూ వెళ్లిపోయాడు. నయం. ర్యాలీతో పాటు నా ధ్యాన మందిరంలోకి వచ్చేయలేదు.
 
 గట్టిగా కళ్లు మూసుకున్నాను. నా దేహాన్నీ, నా ఆత్మనీ కలిపి ఒకచోటికి తేగలుగుతున్నాను. క్రమంగా మానవ రూపాలన్నీ మాయమైపోతున్నాయి. అప్పుడు సాక్షాత్కరించాడు జి.బాలు! నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా ఈడు వాడు. నా సోదర సమానుడు.  ‘రజనీ సార్.. మీరు ఏ పార్టీలో ఉన్నారని కాదు... మేం ఏ పార్టీలో ఉన్నామని కాదు. మీరు మా లీడర్. మీరు మా గాడ్‌ఫాదర్. మీరే ఎప్పటికీ మా సూపర్‌స్టార్’ అంటున్నాడు.  అభిమానం రాబిన్‌హుడ్‌ని చేస్తుంది. రాఘవేంద్రస్వామినీ చేస్తుంది. పాలిటిక్స్‌లో ఇంత ఆరాధన ఉంటుందా?
 - మాధవ్ శింగరాజు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement