సాక్షి ప్రతినిధి, చెన్నై/ సాక్షి నాలెడ్జ్ సెంటర్: జయలలిత కన్నుమూతతో ‘రెండాకులు’ రాలిపోయాయి. కరుణ మరణంతో ‘ఉదయసూర్యుడు’ అస్తమించాడు. తమిళనాడు రాజకీయాల్లో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేవారు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. తమిళనాడులో కామరాజ్ నాడార్ హయాంలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లింది. అన్నాదురై నేతృత్వంలో ఉదయించిన ద్రవిడ సిద్ధాంతాల డీఎంకే తిరుగులేని పార్టీగా మారింది.
తర్వాత ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నాయకత్వంలో ఏర్పడిన అన్నాడీఎంకే తమిళనాట మరో బలీయమైన రాజకీయ పార్టీగా నిలిచింది. ఎంజీఆర్ జనాకర్షణ ధాటికి కరుణానిధి సైతం తల్లడిల్లిపోయారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఇక తమకు తిరుగులేదని ఆశించిన డీఎంకేకు నిరాశే మిగిలింది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీని పరుగులు పెట్టించారు. ఎంజీఆర్‌కు ధీటుగా కరుణకు గట్టిపోటీ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే చాయిస్. ఎంజీఆర్ హయాంలో రెండుసార్లు, జయ హయాంలో ఒకసారి మినహా ప్రతిసారీ ఈ రెండు పార్టీలూ ఐదేళ్లకొకసారి అధికారాన్ని పంచుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేంత స్థాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల అధినేతలు జయలలిత, కరుణానిధి రెండేళ్ల వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో తమిళనాట వారిద్దరి స్థాయి ప్రజాకర్షణ, రాజకీయ చాతుర్యం కలిగిన నేతలు ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చే స్థాయి ఎవరికి ఉందనే చర్చ మొదలైంది.
కమల్, రజనీకాంత్‌ల ప్రభావమెంత?
పురచ్చితలైవి జయలలిత జీవించి ఉన్నంతకాలం రాజకీయ ప్రవేశానికి వెనకడుగు వేసిన నటులు.. కమల్‌హాసన్, రజనీకాంత్ జయ మరణం తర్వాత తామున్నామంటూ ముందుకు వచ్చారు. అన్నాడీఎంకే ఆస్తికత్వం, డీఎంకే నాస్తికత్వం సిద్ధాంతాలతో రాజకీయాలు నెరిపాయి. అలాగే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ముగ్గురూ సినీ నేపథ్యంతో ప్రాచుర్యం పొందినవారే. రజనీకాంత్, కమల్ సైతం సినీ క్రేజుపైనే ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవలతో మమేకమైన సందర్భాలు ఇద్దరికీ లేవు. అంతేకాకుండా అన్నాడీఎంకే, డీఎంకే మాదిరిగానే రజనీ, కమల్ ఆస్తిక, నాస్తిక సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు.
తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ ప్రకటించారు. ఇక కమల్ పూర్తిగా నాస్తికుడు అనేది ప్రజలందరికీ తెలిసిందే. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఏర్పాటు, జిల్లాల్లో పర్యటనలతో కమల్ తన రాజకీయ ప్రయాణ వేగాన్ని పెంచగా, పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ 8 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక తమిళనాడులో సర్వే చేసి కమల్, రజనీ ఇద్దరికీ అధికారంలోకి వచ్చేంత సామర్థ్యం లేదని తేల్చింది. ఇద్దరికీ కలిపి కనీసం పది శాతం మంది కూడా వారి పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. సినీనటులు రాజకీయాల్లో రాణించే రోజులు అంతరించిపోయాయని సర్వేలో పేర్కొంది.
స్టాలిన్‌కి తిరుగులేనట్టే..
కరుణానిధి తన రాజకీయ వారసుడిగా మూడో కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఫలితంగా కరుణ రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఆయన మేనల్లుడి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రవ్యాప్తంగా ‘నమక్కు నామే (మనకు మనమే)’ పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. జయ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన లుకలుకలను అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి రాకుండా సంయమనం పాటించారు. ఈ నిదానమే ప్రజలకు నచ్చిందో ఏమో ఇటీవల జరిగిన సర్వేలో రాబోయేది డీఎంకే ప్రభుత్వం.. కాబోయే సీఎం స్టాలిన్ అని తేలింది.
రజనీ చేతుల్లోకి అన్నాడీఎంకే!
అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన స్థాయిలో జయలలిత పార్టీని నడిపారు. ఆమె మరణం తర్వాత సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయకత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే అన్నాడీఎంకే బలహీనపడే ప్రమాదం ఉంది.
అలాంటి పరిస్థితిలో శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం’ అన్నాడీఎంకేను చీల్చి కొంతమేరకు బలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలం, అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో అన్నాడీఎంకే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తేల్చిచెబుతున్నారు.
వాస్తవానికి ‘అమ్మ’ మరణంతో అనాథగా మారిన అన్నాడీఎంకేకు ఆసరాగా నిలవడం ద్వారా తమిళనాట వేళ్లూనుకోవాలని బీజేపీ తాపత్రయపడింది. అయితే అధికార పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం వల్ల బీజేపి ప్రయత్నాలకు గండిపడింది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసిన బీజేపీకి తన మిత్రుడు రజనీకాంత్ కంటపడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విముఖత ప్రదర్శించిన రజనీకాంత్‌ను అన్నాడీఎంకే అధినేతగా చేసి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది.
అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీ ప్రకటనలో జాప్యాన్ని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో రజనీ నాయకత్వంలోని అన్నాడీఎంకే, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రత్యర్థులుగా తలపడతాయి. షెడ్యూల్ ప్రకారం తమిళనాడు అసెంబ్లీకి 2021లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడేళ్ల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment