Rajinikanth Political Entry: Super Star RajiniKanth Political Party Effect On TamilNadu Politics | ఆ పార్టీల్లో ప్రకంపనలు - Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ: ఆ పార్టీల్లో ప్రకంపనలు

Published Sat, Dec 5 2020 11:06 AM | Last Updated on Sat, Dec 5 2020 12:30 PM

Rajinikanth Party Will Impact On Tamil Nadu Politics - Sakshi

సాక్షి, చెన్నై: ఇదిగో అదుగో అంటూ వచ్చిన నటుడు రజనీకాంత్‌ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడం రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ప్రకంపనలకు కారణమైంది. రజనీ పార్టీ వల్ల తమ పార్టీకి లాభనష్టాలను బేరీజు వేసుకోవడంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. బీజేపీతో ఇప్పటికే కూటమి ఖరారు చేసుకున్న అన్నాడీఎంకే, కమలనాథుల ద్వారా రజనీతో సఖ్యత పెంచుకోవాలని ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు రజనీ అంగీకరిస్తారా అనేది సందేహమే. ఎడపాడి పళనిస్వామికి రాబోయే ఎన్నికల్లో రజనీ నుంచి సవాళ్లు ఎదురుకావచ్చు.

విజయకాంత్‌ 2006లో పార్టీ పెట్టి ఒంటరిగా పోటీకి దిగినపుడు కేవలం ఒక్క సీటు (విజయకాంత్‌) మాత్రమే గెలుచుకున్నా 8.5 శాతం ఓట్లను చీల్చడం ద్వారా వంద నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపారు. వచ్చే ఎన్నికల్లో రజనీ వల్ల అదే పరిస్థితి ఎదురైతే అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరికి నష్టం అనే అంశంపై భిన్నాభిప్రాయలున్నాయి. రెండురోజుల క్రితం వరకు అధికారం ఖాయమని ధీమావ్యక్తం చేసిన డీఎంకే శ్రేణులు రజనీ ప్రకటన తరువాత డీలాపడిపోయారు. డీఎంకే రజనీని ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలు రచించాల్సి ఉంది. రజనీ పార్టీ పెట్టడం సందేహమని ప్రచారం జరుగుతున్న తరుణంలో తమ పార్టీ గెలుపునకు ఆయన మద్దతు కోరుతానని కమల్‌ తెలిపారు.  చదవండి:  (రాజకీయాల్లోకి రజనీ)

అయితే పార్టీ స్థాపిస్తున్నట్లు రజనీ ప్రకటించిన తరువాత కమల్‌ స్పందించలేదు. రజనీది ఒంటరి పోరా, కూటమా అనేది స్పష్టం అయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. ఒంటరిగా పోటీచేస్తే ఎన్నిసీట్లు దక్కుతాయనేది ప్రశ్నార్థకమని ఇటీవల రజనీ జరిపించిన సర్వేలో స్పష్టం కావడంతో కూటమికే ఆయన మొగ్గుచూపుతారని అంచనా వేస్తున్నారు. కమల్‌హాసన్‌ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే కనీసం 20 శాతం ఓట్లు ఖచ్చితంగా చీలుస్తారని తెలుస్తోంది. ఈ పరిణామం అన్నాడీఎంకే, డీఎంకేలకు నష్టం. రజనీ పార్టీతో మక్కల్‌ నీది మయ్యం, డీఎండీకే కూటమిగా ఏర్పడవచ్చని కొందరు అంచనావేస్తున్నారు. రజనీ ప్రవేశం ఏపార్టీని ప్రధానంగా బాధిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి, మార్చి వరకు వేచిచూడాల్సిందే.   చదవండి:  (భయపెడుతున్న బురేవి)

పార్టీ రిజిస్ట్రేషన్‌కు సన్నాహాలు
కొత్తపార్టీ స్థాపనకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని రజనీకాంత్‌ స్థాపించబోయే పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావాలతో కూడిన నిజాయితీ రాజకీయాలను నడుపుతారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులు 28 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రజనీ చిత్రం పూర్తయిన తరువాతనే పార్టీని రిజిస్ట్రే్టషన్‌ చేస్తామన్నారు. బీజేపీకి గురువారం ఉదయమే ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి జనాకర్షణ నేతలు లేరు. ఈ పరిస్థితుల్లో రజనీ మాత్రమే ప్రజల మన్ననలు పొందగలిగిన నేతగా తెరపైకి వచ్చారు. కరోనా ఆంక్షల కారణంగా అన్ని పార్టీలూ ఎన్నికల ప్రచారాలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడక తప్పదు. బూత్‌ కమిటీల వరకు రజనీ పార్టీ ఇప్పటికే బలమైన శక్తిగా నిలిచి ఉంది. పార్టీ ప్రకటనలో రజనీ ఆలస్యం చేశారనడం సరికాదు, సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.  చదవండి:  (విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement