
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఇక నుంచి నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు రాబోయే రోజుల్లో ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు గానూ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
ఈ ఏజెన్సీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడుతున్న నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలను గుర్తిస్తూ.. వాటిని సమన్వయం చేసుకుంటూ అన్నింటికీ ఒకటే పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన విధానం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు రకరకాల పరీక్షలు రాయాల్సి వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలకు కలిపి ఒకటే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. (స్వచ్ఛమైన గాలి కోసం భారీగా కేటాయింపు)