న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ నరేంద్రమోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమానికి, షెడ్యూల్ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమం, సంస్కృతి మరియు పర్యాటకం, పర్యావరణం మరియు వాతావరణ మార్పు అనే మూడు విభాగాలుగా సమాజ సంక్షేమాన్ని విభాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు థీమ్స్‌కు అనుగుణంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. మహిళల వివాహానికి కనీస వయసును పునఃసమీక్షించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నామని, ఈ టాస్క్‌ఫోర్స్ ఆరునెలల్లో నివేదిక అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బలహీన వర్గాలు, స్త్రీ, శిశు సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధులు పెంచామని తెలిపారు.
స్త్రీ, శిశు.. సాంఘిక సంక్షేమం..
బేటీ బచావో– బేటీ పడావో పథకం బాగా విజయవంతమైందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్థూల బాలికల నమోదు గణాంకాలు(94.32 శాతం) బాలుర గణాంకాల(89. 28 శాతం)కన్నా మెరుగయ్యాయని చెప్పారు. పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల పౌష్టికత మెరుగుదలకు ప్రారంభించిన పోషన్ అభియాన్ కింద ఆరు లక్షల అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్స్ అందించామని, వీటితో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు పౌష్టికత అప్‌డేట్స్ అంది స్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి, మాన్యువల్ స్కావెం జింగ్ అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో సాంకేతికతను వినియోగిస్తామని వివరించారు.
బడ్జెట్లో సంక్షేమ కేటాయింపులు..
►పౌష్టికాహార కార్యక్రమాల కోసం రూ. 35,600 కోట్లు, స్త్రీ సంక్షేమ పథకాలకు రూ. 28,600 కోట్లు కేటాయించారు.
►షెడ్యూల్ కులాల సంక్షే మం, ఓబీసీల సంక్షేమానికి రూ. 85 వేల కోట్లను, షెడ్యూల్ తెగల కోసం రూ. 53700 కోట్లను కేటాయించారు.
►దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ. 9,500 కోట్లు అందించనున్నారు.
►సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ. 10,103.57 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ. 8,885 కోట్లు.
►మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు.
►బాలల కోసం కేటాయింపులు గత బడ్జెట్‌తో పోలిస్తే 0.13 శాతం తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment