మెప్పించని విన్యాసం     | Editorial On Union Budget | Sakshi
Sakshi News home page

మెప్పించని విన్యాసం    

Published Tue, Feb 4 2020 12:03 AM | Last Updated on Tue, Feb 4 2020 12:03 AM

Editorial On Union Budget - Sakshi

ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, మందగమనంతో అది అందరినీ భయపెడుతున్న వేళ... వృద్ధి రేటు పల్టీలు కొడుతూ, ద్రవ్యోల్బణం పైపైకి పోతున్న వేళ బడ్జెట్‌ విన్యాసం కత్తి మీది సాము. ఖజానా రాబడి తగ్గుతూ ఎంచుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన నిధుల సమీకరణకు సమస్యలెదురైనప్పుడు అందరినీ మెప్పించేలా బడ్జెట్‌ ప్రతిపాదనలుండటం అసాధ్యం. మెప్పిం చడం మాట అటుంచి ఇప్పుడున్న సంక్షోభం పేట్రేగకుండా చూస్తే అదే పదివేలు. కానీ  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతి పాదనలు అందుకనుగుణంగా ఉన్నట్టు తోచదు. వినిమయాన్ని పెంచడానికి మధ్యతరగతి చేతుల్లో డబ్బులుండేలా చూడాలి. ఉపాధి అవకాశాలు పెరిగితే వారికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం పన్నుల రూపంలో పెద్దగా పోనప్పుడు వారు తమ అవసరాల కోసం ఖర్చు పెట్ట గలుగుతారు. అయితే ఈ క్రమంలో ఖజానా పెద్దగా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను వసూళ్లు తగ్గకుండావున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రజల కొనుగోలు శక్తి పెంచి విని మయం బాగుండేలా తీసుకునే చర్యలకూ, ఖజానా దండిగా నిండటానికి చేసే ప్రయత్నాలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది. దీన్నెంత ఒడుపుగా చేయగలుగుతారన్న దాన్నిబట్టే ఆర్థికమంత్రి చాకచక్యం వెల్లడవుతుంది.

 మిగిలినవాటి మాటెలావున్నా ప్రతి బడ్జెట్‌కు ముందూ మధ్యతరగతి ఆశగా ఎదురు చూసేది ఆదాయం పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థికమంత్రి కనికరించి గడిచిన సంవత్సరంకన్నా పన్ను భారం మరింత తగ్గిస్తే బాగుండునని మధ్యతరగతి జీవులు ఆశిస్తారు. ఆ విషయంలో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఈసారి నిర్మలా సీతారామన్‌ ఆదాయం పన్ను వసూలుకు సంబం ధించి రెండు రకాల విధానాలు ప్రతిపాదించారు. ఇప్పుడున్న మూడు శ్లాబ్‌లను యధాతథంగా కొనసాగిస్తూ, దాంతోపాటు ఏడు కొత్త శ్లాబ్‌లు ప్రకటించారు. కొత్త శ్లాబుల్ని ఎంచుకుంటే కొన్ని మినహాయింపులు ఎగిరిపోతాయని ఆమె చావు కబురు చల్లగా చెప్పడంతో అందరూ నీరసపడ్డారు. ఇంతకూ కేంద్ర ఆర్థికమంత్రి చేసిందల్లా ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ వేతన జీవులకివ్వడమే. రెండూ కత్తులే. ఏ కత్తి మెత్తగా తెగుతుందో ఎవరికి వారు తేల్చుకోవాల్సివుంటుంది. నిపుణులు చెబు తున్నదాన్నిబట్టి ఈ చర్య వల్ల ఆదాయం పన్ను గణన, రిటర్న్‌ల దాఖలు ఎంతో సంక్లిష్టంగా మారాయి.

 కొత్త శ్లాబుల్లోకి మారదల్చుకున్నవారికి నిరాకరిస్తున్న మినహాయింపులు హేతుబద్ధంగా అనిపించడం లేదు. రూ. 15 లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి పాత విధానంలో రూ. 2,73,000 ఆదాయం పన్ను చెల్లించాల్సివస్తే... కొత్త విధానం ప్రకారం రూ. 1,95,000 చెల్లిస్తే సరిపోతుంది. అంటే కొత్త విధానంలో రూ. 78,000 మిగులుతుంది. కానీ అదే సమయంలో వారు గృహ రుణంపై చెల్లించే వడ్డీ, బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకయ్యే ఫీజులు, పీపీఎఫ్‌ వంటివాటిపై ఇప్పు డున్న మినహాయింపులన్నీ కోల్పోతారు. ఇవే కాదు... 80జీ కింద విరాళాలపై ఉండే మినహాయింపు, 80 జీజీ కింద నెలకు రూ. 5,000 వరకూ ఉండే మినహాయింపు మాయమవుతాయి. ఇలా దాదాపు 70కి పైగా మినహాయింపులను తొలగించారు. అయితే మున్ముందు సమీక్షించి మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ సంగతలా వుంచితే... గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వర్త మానంలో ఇలా మినహాయింపులు తొలగించడం ఆ రంగానికి చేటు కలిగించదా? అలాగే బీమా ప్రీమియంలు చెల్లించేవారికిచ్చే మినహాయింపులు కూడా కొత్త విధానంలో కనుమరుగయ్యాయి. ఆదాయం పన్ను మినహాయింపు కోసం అధిక శాతంమంది ఆశ్రయించేది బీమా ప్రీమియంలు చెల్లించడం. ఆ మినహాయింపు కాస్తా ఎత్తేస్తే, ఎవరైనా బీమా జోలికి వెళ్తారా? అది ఆ వ్యాపారంపై ప్రభావం చూపదా? ఉన్నంతలో సాగురంగానికీ, గ్రామీణ రంగానికీ  కేటాయింపులు మెరుగ్గానే ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచడం మంచి చర్యే.

జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)లోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రానికి ఎల్‌ఐసీలో పది శాతం వాటావుంది. ఇందులో ఏమేరకు విక్ర యిస్తారో చూడాలి. దండిగా లాభాలు ఆర్జిస్తున్న ఎల్‌ఐసీలో ప్రైవేటీకరణకు వీలుకల్పించే ఈ చర్య అమలు అంత సులభం కాదు. దీన్ని ప్రతిఘటిస్తామని బీమా ఉద్యోగులు  హెచ్చరించారు. కేంద్రం నిధులు సమకూరిస్తే తప్ప నడిచే అవకాశం లేని సంస్థలను వదిలిపెట్టి నిక్షేపంలా ఉండే సంస్థలను ప్రైవేటు పరం చేయడమేమిటన్నది వారి ప్రశ్న. ఎల్‌ఐసీ ఏ రోజూ ఆర్థికంగా ఇబ్బందుల్లోపడలేదు. ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. సరిగదా... నష్టాల్లో మునిగిన అనేక పబ్లిక్‌ రంగ సంస్థల్ని బతికిం చడానికి  దాని నిధులే అక్కరకొస్తున్నాయి. బీమా రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా, ప్రజలు ఎల్‌ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఆ సంస్థే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో కేంద్రం పునరాలోచించడం ఉత్తమం.

వివిధ మౌలిక సదుపాయ రంగ ప్రాజెక్టులకు అవస రమైన నిధులు సమీకరిస్తూనే, ద్రవ్యలోటు రాకుండా చూడటానికి ఎల్‌ఐసీలోనూ, ఐడీబీఐలోనూ ఉన్న వాటాలను కేంద్రం విక్రయించదల్చుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఏమేరకు సాధ్యమో చూడాల్సివుంది. అయితే ద్రవ్య లోటును నిర్దేశించిన పరిమితికి లోబడివుండేలా చూడాలన్న లక్ష్యంలో సంక్షేమ పథకాలకు కోత పడకుండా చూడటం ముఖ్యం. బడ్జెట్‌ గణాంకాలు గమనిస్తే ముగుస్తున్న సంవత్సరంలో ఆహార సబ్సిడీలో రూ. 75,532 కోట్లు, గ్రామీణ ఉపాధిలో రూ. 9,502 కోట్లు కోతపడ్డాయి. ప్రజల్లో వినిమయాన్ని పెంచి, డిమాండ్‌ పెరిగేలా చేసినప్పుడే తయారీ రంగం కోలుకుంటుంది. అందు కవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటేనే వృద్ధి రేటు నిర్మలా సీతారామన్‌ ఆశించినట్టు 10 శాతానికి చేరుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement