న్యూఢిల్లీ: మహిళల అభ్యున్నతి, శిశువుల వికాసానికి 2020–21 బడ్జెట్‌లో కేంద్రం నిధుల కేటాయింపులను పెంచింది. గత ఏడాది కంటే ఈ పెంపు ఏకంగా 14 శాతం అధికం. 2019–20లో కేటాయింపులు రూ.26,184.50 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.30,007.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.20,532.38 కోట్లను అంగన్‌వాడీ సేవలకే వినియోగించనున్నారు.
►నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌కు(పోషణ్ అభియాన్) కేటాయింపులను రూ.3,400 కోట్ల నుంచి రూ.3,700 కోట్లకు పెంచారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా.. ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న ఆరేళ్ల లోపు చిన్నారుల సంఖ్యను 2022 నాటికి 38.4 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
►సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో(ఐసీడీఎస్) భాగంగా శిశువుల రక్షణకు నిధుల కేటాయింపులను రూ.1,350 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచారు.
►వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల పథకానికి నిధుల కేటాయింపులను రూ.45 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు పెంచేశారు.
మహిళల అక్రమ రవాణా నియంత్రణ, సహాయ పునరావాసానికి ఉద్దేశించిన ఉజ్వల పథకానికి కేటాయింపులను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచారు.
►నేషనల్ క్రెష్ స్కీమ్‌కు కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద.. ఉద్యోగులైన మహిళలు పని వేళల్లో తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించవచ్చు.
►లైంగిక వేధింపులు, హింస బారినపడే బాధిత మహిళలకు వైద్య సహాయం, న్యాయ, పోలీసు సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఉద్దేశించిన ‘వన్ స్టాప్ సెంటర్’కు కేటాయింపులను రూ.204 కోట్ల నుంచి రూ.385 కోట్లకు పెంచారు.
►ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) పథకానికి 2019–20లో రూ.2,300 కోట్లు కేటాయించగా, 2020–21లో రూ.2,500 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద గర్భిణికి/పాలిచ్చే తల్లికి రూ.6,000 అందజేస్తారు.
►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో.. బేటీ పడావో’కార్యక్రమానికి రూ.220 కోట్లు కేటాయించారు.
►మహిళా శక్తి కేంద్రాలకు రూ.100 కోట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చింది రూ.50 కోట్లే. అంటే కేటాయింపులను ఈసారి రెట్టింపు చేశారు.
►మహిళ రక్షణ, సాధికారత మిషన్‌కు గత ఏడాది రూ.961 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,163 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment