సీపీఎస్’ రద్దు చేయాలని ర్యాలీ
మంచిర్యాల టౌన్ : 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ సీపీఎస్ టీఈఏ టీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆదివారం మంచిర్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో గ్రాట్యూటీ చెల్లింపు లేకపోవడం, పెన్షన్ భద్రత లేకపోవడం, ఉద్యోగి మరణిస్తే ఎలాంటి ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
ఈ లోపభూయిష్ట విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని జీవో ఎంఎస్ నంబర్ 652 ద్వారా వర్తింపచేస్తున్నారన్నారు. ఉద్యోగికి ప్రాన్ ఖాతా తెరిచి అతని వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం 10 శాతం నెలనెలా జమచేస్తూ ఈ మొత్తాన్ని ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారన్నారు. ఉద్యోగి విరమణ అనంతరం ఈ మొత్తంలో 60 శాతం నగదులగా చెల్లించి, మిగతా 40 శాతం పెట్టుబడిపై వచ్చే మొత్తాన్ని నెలనెలా ఫించన్ చెల్లిస్తారన్నారు.
కానీ ప్రభుత్వాలు ఉద్యోగి విరమణ అనంతరం వచ్చే మొత్తాలపై కనీస భరోసా కల్పించకపోగా, షేర్ మార్కెట్‌లో నష్టాలు వస్తే ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక పరిస్థితిని నిర్వచించకపోవడం చాలా భాదాకరమన్నారు. దేశంలోని పౌరులకు సామ్యవాద, ప్రజాస్వామ్య తరహా పాలనను అందిస్తామని రాజ్యాంగ పీఠికలో చేర్పించారని, కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అయిన ‘సామాజిక భద్రత పింఛన్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
సీపీఎస్ టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మోకెనపల్లి శ్రీనివాస్, గాదె మహిపాల్, కోఆర్డినేటర్ బండి రమేశ్, శ్రావణ్ కుమార్, జోడె మధు, నాగుల రమేశ్, రమణ, తిరుపతి, నరేశ్‌కుమార్, శివరామకృష్ణ, తుమ్మ వెంకటేశం, వెంకటాద్రి పాల్గొన్నారు.