తల్లిదండ్రులతో జానకి
ఆ రైతుకు ఐదుగురు పిల్లలు. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. తాను పడుతున్న కష్టం తన బిడ్డలు పడకూడదనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నా అందరినీ ఉన్నత చదువులు చదివించాడు. వారు కూడా అహర్నిశలు శ్రమించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు.
సాక్షి, ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె నాగమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. రెండో కుమార్తె జానకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రెండు ఉద్యోగాలకు ఎంపికైంది. మున్సిపల్ శాఖలో శానిటరీ, హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను సాధించింది. మూడో కుమార్తె శిరీష అమెరికా వెళ్లి ఫార్మ రంగంలో స్థిరపడింది.నాలుగో కుమార్తె మనోజ, కుమారుడు ప్రవీణ్ గోపి రెడ్డి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రులు మంగిరెడ్డి, లక్ష్మి కష్టంతోనే తాము ఉన్నతస్థాయికి ఎదిగామని వారు పేర్కొంటున్నారు.
పట్టుదలతో విజయం..
నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి ఎంఎస్సీ బీఈడీ చదివాను. డిసెంబర్ 2018లో టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ప్రకటించిన హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. మహిళా విభాగంలో రెండింట్లోనూ ప్రథమస్థానం. తండ్రి మంగిరెడ్డి, తల్లి లక్ష్మి, భర్త ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి ప్రోత్సహించారు. పట్టుదలతో విజయం సాధించాను.
– కాకుమాను జానకి
Comments
Please login to add a commentAdd a comment