Mudigonda
-
బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు
-
సూతకాలు ఐదు రకాలు..కానీ మూడు మాత్రమే పాటించాలి
-
Photo Feature: కుక్క.. కోతి సయ్యాట
సాక్షి, ఖమ్మం: గ్రామాలు, పట్టణాల్లో ఇటీవల కోతుల సంచారం పెరిగింది. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి తరుముతుంటాయి. కానీ ముదిగొండ మండల కేంద్రంలో జాతి వైరాన్ని మరిచి ఓ కోతి కుక్కపైన ఇలా పడుకుని సేద తీరింది. ఆ తర్వాత కోతి, కుక్క కలిసి ఆడుకోవడం కనిపించింది. ఈ సన్నివేశాలను అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా చూశారు. చదవండి: Photo Feature: హరివిల్లుతో పులకింత -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ముదిగొండ: బంధువుల ఇంట్లో కర్మకాండలకు ఆటోలో వెళ్లి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి సమీపాన గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(60), ఆమె కుమారుడు ఉపేందర్, మనవడు హర్షవర్ధన్ (6) ఆటోలో ఖమ్మం అర్బన్ మండలం ఏదులాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండలకు హాజరై తిరుగు పయనమయ్యారు. వీరి ఆటో గోకినేపల్లి సమీపానికి చేరుకోగానే కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న భారతమ్మ, ఆమె మనవడు హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉపేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారతమ్మ తల తెగిపడింది. కాగా, మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ఆటోఎక్కిన కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చాగంటి రమేశ్ (36) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సింగవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బొడ్డు ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం– కోదాడ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మృతుల కుటుంబీకులు ప్రమాద స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ, ఎస్సైలు ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఉప్పూపప్పు కోసం అసెంబ్లీలో మాట్లాడతా
ముదిగొండ (మధిర): దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.కార్డులు లేనివారిందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. రేషన్ కార్డులు ఈ దఫాలో రానివారికి కూడా వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రాక్టర్ ఉందనో, పిల్లలకు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు ఉన్నాయనో, లేకపోతే రాబడి పొలం ఉందనే కారణంతోనే దరఖాస్తులు తిరస్కరించడం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. కూలీకి వెళ్లే కుటుంబం ఫైనాన్స్ నుంచి సెకెండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కుని, బతుకుదెరువు కోసం ప్రయివేట్ కంపెనీలకు ఉద్యోగాలకు పోయిన బిడ్డలున్న కుటుంబాలకు మానవతా హృదయంతో కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధిక నిధులు ఉన్న మన రాష్ట్రంలో గతంలో చేసిన దానికంటే కాస్త ఎక్కువగా ప్రజలకు చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతోపాటు 9 రకాల వస్తువులను సంచిలో పెట్టి ‘అమ్మహస్తం’ పేరుతో ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు సరకులు ఎత్తేసి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. బియ్యంతో పాటు గతంలో ఇచ్చిన సరుకులు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తాను గతంలో అసెంబ్లీలో మాట్లాడాను.. మళ్లీ మాట్లాడతాను అని స్పష్టం చేశారు. పప్పులు, ఉప్పులు, నూనెలు, చింతపండు కూడా కొనలేని పరిస్థితులు ఉండడంతో పేదలకు రేషన్‌లో ఆ వస్తువులు ఇవ్వాలని కోరారు. -
ఆ రైతు కుటుంబంలో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు..
ఆ రైతుకు ఐదుగురు పిల్లలు. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. తాను పడుతున్న కష్టం తన బిడ్డలు పడకూడదనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నా అందరినీ ఉన్నత చదువులు చదివించాడు. వారు కూడా అహర్నిశలు శ్రమించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. సాక్షి, ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె నాగమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. రెండో కుమార్తె జానకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రెండు ఉద్యోగాలకు ఎంపికైంది. మున్సిపల్ శాఖలో శానిటరీ, హెల్త్ ఇన్స్పెక్టర్ల పోస్టులను సాధించింది. మూడో కుమార్తె శిరీష అమెరికా వెళ్లి ఫార్మ రంగంలో స్థిరపడింది.నాలుగో కుమార్తె మనోజ, కుమారుడు ప్రవీణ్ గోపి రెడ్డి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రులు మంగిరెడ్డి, లక్ష్మి కష్టంతోనే తాము ఉన్నతస్థాయికి ఎదిగామని వారు పేర్కొంటున్నారు. పట్టుదలతో విజయం.. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి ఎంఎస్సీ బీఈడీ చదివాను. డిసెంబర్ 2018లో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ప్రకటించిన హెల్త్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుకు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. మహిళా విభాగంలో రెండింట్లోనూ ప్రథమస్థానం. తండ్రి మంగిరెడ్డి, తల్లి లక్ష్మి, భర్త ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి ప్రోత్సహించారు. పట్టుదలతో విజయం సాధించాను. – కాకుమాను జానకి -
మృత్యువులోనూ వీడని స్నేహం
ముగ్గురు స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతుంటారు. నూతన వస్త్రాలు ధరించి పండగ రోజు కూడా కలుసుకున్నారు. మరికొందరితో కలిసి కాలనీ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం కొందరు ఇంటికి వెళ్లారు. నలుగురు మాత్రం సమీపంలోని ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకున్నారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. అందులో ఒకరు కొద్ది దూరంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. మూత్ర విసర్జనకు వెళ్లిన యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషాదకర∙సంఘటన ముదిగొండలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సాక్షి, ముదిగొండ: ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన బలంతు ప్రవీణ్(20), ఇరుకు శ్రీను(20), గుద్దేటి నవీన్(19) ముగ్గురు ప్రాణ స్నేహితులు. సూర్యాపేటలో బీఎస్సీ ఎంఎల్టీ చదువుతున్న బలంతు ప్రవీణ్ పండగకు మూడు రోజుల ముందే ఇంటికి వచ్చాడు. ఇరుకు శ్రీను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్నాడు. గుద్దేటి నవీన్ ముదిగొండలోనే ఇంటర్ సెంకడియర్ చదువుతున్నాడు. వీరు వేర్వేరుగా చదువుకుంటున్నా, పండగ, శుభకార్యాలలో, సెలవు దినాలలో కలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో విజయదశమి పండగ రోజు కూడా ముగ్గురు కలుసుకున్నారు. వీరితోపాటు మరో యువకుడు ఉసికల గోపి, మరికొందరు స్నేహితులు కలిసి సరదాగా తమ కాలనీ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం పక్కనే ఉన్న ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు ప్రవీణ్, శ్రీను, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. మూత్ర విసర్జనకు కొద్ది దూరం వెళ్లిన మరో యువకుడు ఉసికల గోపి స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలో ఉన్న స్నేహితులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికే ముగ్గురు యువకులు విగతజీవులుగా పడి ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు బలంతు ప్రవీణ్ మృతదేహం; గుద్దేటి నవీన్ మృతదేహం; ఇరుకు శ్రీను మృతదేహం గ్రామంలో ఒకేసారి ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణస్నేహితులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. యువకుల తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూపరులను కంటతడి పెట్టించింది. దసరా పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు రెక్కాడితే కాని డొక్కాడనవి. మూడూ దళిత కుటుంబాలే. చదువుకుని ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివిస్తున్నారు. బలంతు ప్రవీణ్ తల్లిదండ్రులు బాబు, వెంకటమ్మ నిరుపేదలు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు చందు పదో తరగతి చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్న కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఇరుకు శ్రీను తల్లిదండ్రులు ఏసు, అలివేలు. సోదరికి వివాహమయింది. వీరిదీ పేద కుటుంబమే. డిగ్రీ చదువుతున్న కుమారుడు తమకు ఆసరా అవతాడనుకుంటున్న సమయంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గుద్దేటి నవీన్ తల్లిదండ్రులు గాలయ్య, విజయమ్మలు కూడా పేదలే. తమ్ముడు కార్తీక్ పదో తరగతి చదువుతున్నాడు. ఇంటర్ చదువుతున్న కుమారుడు పండగపూట మృతవాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పలువురి పరామర్శ మృతదేహాలను సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ముదిగొండ సర్పంచ్ మందరపు లక్ష్మి, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, టీఆర్ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్‌యాదవ్, కొమ్మినేని రమేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ మందరపు నాగేశ్వరరా వులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇన్చార్జి తహసీల్దా ర్ కరుణాకర్‌రెడ్డి బుధవారం మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున నగదు అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ సంఘటనా స్థలాన్ని బుధవారం ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజు రమేష్ సందర్శించారు. వివరాలను ఎస్ఐ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఎస్ఐ మహేష్, సిబ్బంది ఉన్నారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు ఒకేసారి ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో క్రికెట్ ఆడిన మిత్రులు ఇక లేరనే విషయాన్ని మిగతా స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరితో కలివిడిగా ఉంటారని, ముగ్గురు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు, బంధువులతోపాటు గ్రామస్తులందరూ కదిలివచ్చి యువకులకు కన్నీటి వీడ్కోలు పలికారు. విషణ్ణ వదనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఈసారి ‘డేగ’ వంతు
సాక్షి, ముదిగొండ: ఏసీబీ వలలో ఎప్పుడూ అవినీతి చేపలే పడతాయి. ఈసారి మాత్రం ‘డేగ’ చిక్కుకుంది. పట్టాదారు పాత పాస్ పుస్తకంలో నమోదైన నాలుగు ఎకరాల 12 కుంటల భూమిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు ఓ రైతు నుంచి పదివేల రూపాయలను లంచంగా ఇవ్వాలని వీఆర్ఓ డేగల రాజేంద్రం డిమాండ్ చేశాడు. ఈ అవినీతి ‘డేగ’ పైకి ఏసీబీ అధికారులు వల విసిరారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు. మండలంలోని గంధసిరి గ్రామ రైతు చెమట నాగేశ్వరరావు పేరిటగల పట్టాదారు పాత పాస్ పుస్తకంలో నాలుగు ఎకరాల 12 కుంటల భూమి వివరాలు నమోదయ్యాయి. వీటిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు నాగేశ్వరరావు కుమారుడు వేణు, నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి వీఆర్ఓ డేగల రాజేంద్రం వద్దకు, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పదివేల రూపాయలు ఇస్తేనే, కొత్త పాస్ పుస్తకంలోకి భూమి వివరాలు ఎక్కిస్తానని డేగల రాజేంద్రం స్పష్టంగా చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వేణు చెప్పారు. కొద్ది రోజుల తరువాత, ఎనిమిదివేల రూపాయలకు వీఆర్ఓ దిగొచ్చాడు. ఈ మొత్తాన్ని ఆయనకు వేణు సమర్పించుకున్నాడు. కొత్త పాస్ పుస్తకం చేతికొచ్చింది. తీరా చూస్తే... అందులో, కేవలం రెండు ఎకరాల 23 కుంటల భూమి మాత్రమే ఎక్కింది. మిగతా, ఒక ఎకరం 28 కుంటలన్నర ఎక్కించలేదు. దీని కోసం, వేణు మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు వెళ్లినా వీఆర్ఓ డేగల రాజేంద్రం పట్టించుకోవడం లేదు. మరో ఐదువేల రూపాయలు ఇస్తే... పని పూర్తవుతుందని వేణుకు గురువారం డేగల రాజేంద్రం ఫోన్ చేశాడు. వెంటనే ఖమ్మం చేరుకున్న వేణుకు, ఏం చేయాలో పాలుపోలేదు. తన గోడును వినిపించేందుకు ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లాడు. అవినీతి ‘డేగ’ను ఇలా పట్టేశారు... లంచం కోసం వేణును, అతడి తండ్రిని పీక్కు తింటున్న ఆ ‘డేగ’ను వల వేసి పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పథకం వేశారు. ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద వేణు నుంచి ఐదువేల రూపాయలు తీసుకుంటున్న డేగల రాజేంద్రాన్ని వరంగల్ ఏసీబీ డీఎస్పీ ఎస్.ప్రతాప్, సీఐలు ఎస్వీ రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వెంకట్... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడి నుంచి రైతు కుమారుడు వేణును, వీఆర్ఓ డేగల రాజేంద్రాన్ని ముదిగొండ తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. డీటీ కరుణాకర్‌రెడ్డి, వీఆర్ఓ నాగలక్ష్మి నుంచి వివరాలు తెలుసుకున్నారు. రైతు వద్దనున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించారు. అతని నుంచి వివరా లు సేకరించి రికార్డ్ చేశారు. వీఆర్ఓ డేగల రాజేంద్రాన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు విలేకరులకు డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏసీబీ అధికారులకు 94407 00049 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. -
వారిద్దరూ మాటల మాయగాళ్లు
సాక్షి, కొణిజర్ల/ముదిగొండ: ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటలతో గారడీ చేసే మాయగాళ్లని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వైరా, మధిర నియోజకవర్గాల పరిధిలోని కొణిజర్ల, ముదిగొండ మండల కేంద్రాల్లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న పరిస్థితులు ఉన్నాయని, అధికారం, సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి ఏర్పడిందన్నారు. కేసీఆర్.. ప్రధాని మోదీని, ఢిల్లీలో తన స్నేహితులను ప్రసన్నం చేసుకునేందుకు ఎనిమిది నెలల ముందుగానే ఎన్నికలకు పోయారన్నా రు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలంటే మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను ఓడించాలన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి.. అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని, మళ్లీ ఎన్నికలు రాగానే కొత్త హామీలతో ప్రజల ముందుకొస్తున్నారన్నారు. ముదిగొండ సభకు హాజరైన కార్యకర్తలు కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేస్తే, కేసీఆర్ నాలుగున్నరేళ్లయినా చేయలేకపోయాడన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కేసీఆర్ వంద గదుల ఇల్లు కట్టుకున్నాడని, రాష్ట్రంలోని నిరుపేదలకు మాత్రం రెండు గదుల ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేకపోయాడన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, మహిళల హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల కోసం సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి పోరాడుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టాలని, టీఆర్ఎస్ ద్రోహిగా నిలిచి పేదలను మోసం చేసిన వ్యక్తికి ఓట్లు వేయొద్దని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల మొసలి కన్నీరును నమ్మొద్దన్నారు. వితంతువులకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని, యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు బీఎల్ఎఫ్తోనే సాధ్యమని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మార్పు గాలి వీస్తోందన్నారు. వైరా, మధిర సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులు భూక్యా వీరభద్రం, కోట రాంబాబుకు ఓటు వేసి గెలిపిస్తే పోడు సాగుదారుల సమస్యలు, మహిళా, కూలీల సమస్యలపై పోరాడుతారన్నారు. కొణిజర్ల సభకు హాజరైన కార్యకర్తలు వడ్లమూడి నాగేశ్వరరావు, వాసిరెడ్డి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థులు భూక్యా వీరభద్రం, కోట రాంబాబు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరారావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త దేవి, వ్యవసాయ కార్మిక సం«ఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్, నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, తాళ్లపల్లి కృష్ణ, వైరా, కొణిజర్ల ఎంపీపీలు బొంతు సమత, వడ్లమూడి ఉమారాణి, కొణిజర్ల మండల ఇన్చార్జి గట్టు రమాదేవి, కొప్పుల కృష్ణయ్య, బండి పద్మ, ఇరుకు నాగేశ్వరరావు, భట్టు పురుషోత్తం, ప్రభావతి, ఎం.వెంకటేశ్వర్లు, దామోదర్ పాల్గొన్నారు. -
బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు..
సాక్షి, నల్గొండ : జిల్లాలోని దేవరకొండ మండలం ముదిగొండలో దారుణం జరిగింది. సందగళ్ల సుభాష్(28) అనే యువకుడిని అతి కిరాతకంగా బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు. మృతుని మానసిక స్థితి సరిగా ఉండదని గ్రామస్థులు చెపుతున్నారు. కాగా దుండగులు అర్ధరాత్రి సమయంలో సుభాష్ కాళ్ళు, చేతులు కట్టేసి ఊరి బయట పొలాల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతుని కుటుంబ సభ్యులు అంతా దేవరకొండలో ఉంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖమ్మంలో రైతులకు శాపంగా మారిన చైనా ఫ్యాక్టరీ
-
రామాలయం వాచ్‌మన్‌కు రూ.5 లక్షలు
- మనవరాలి చికిత్సకు సాయమందించిన సీఎం సాక్షి, హైదరాబాద్: శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పని చేసే ఓ తాత్కాలిక ఉద్యోగి మనవరాలి వైద్యానికి అయ్యే ఖర్చులకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఫిబ్రవరి 16న సీఎం సందర్శించారు. ఆ సమయంలో అక్కడ వాచ్‌మన్‌గా పని చేస్తున్న షేక్ మస్తాన్ సీఎంకు తన గోడు వినిపించాడు. ఆ సందర్భంలో మస్తాన్ తన మనవరాలు షేక్ సహారీ బేగం దుస్థితి వివరించాడు. ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోందని, తండ్రి చనిపోవటంతో తన వద్దే ఉంటోందని, ఆమెకు వైద్యం చేయించే స్తోమత తనకు లేదని మస్తాన్ సీఎంకు చెప్పాడు. దీంతో చలించిన సీఎం ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులపై సీఎంవో అధికారుల ద్వారా ఆరా తీయించారు. వైద్య ఖర్చులు రూ.5 లక్షలు అవుతాయని తేలడంతో ఆ మొత్తాన్ని విడుదల చేశారు. సంబంధిత చెక్కును సీఎంవో అధికారులు సోమవారం మస్తాన్‌కు అందించారు. -
అగ్నిప్రమాదం: రూ. 20 లక్షల ఆస్తి నష్టం
ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్లాస్టిక్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని యాజమానులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావను చంపిన బావమరిది
ముదిగొండ (ఖమ్మం) : కుటుంబ కలహాల నేపథ్యంలో బావ బావమరుదులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో బావ మరిది కర్రతో బావ తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం దండసిరి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బావ, మరుదులు ఎర్గి వెంకటరత్నం(38), శ్రీనుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో శ్రీను కర్రతో వెంకటరత్నం తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
ముదిగొండ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురంలో శుక్రవారం ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారంతో ఎస్ఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.61 వేలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో మహిళాకూలీ మృతి
ఖమ్మం (ముదిగొండ) : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌తో వడ్డేపూడి పుల్లమ్మ(55) అనే మహిళా కూలీ మృతిచెందింది. పొలంలో కూలి పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు
ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. రేషన్ షాపు నంబర్ 5 లో అక్రమంగా పెద్ద మొత్తంలో సరుకులు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, 1.5 క్వింటాళ్ల పంచదారను సీజ్ చేశారు. నిర్వాహకుడు వెంకయ్యపై నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. -
మహిళా దొంగ అరెస్టు
ముదిగొండ: ఖమ్మం జిల్లాలో ఓ మహిళా దొంగ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మదిగొండ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పసుపు లేటి పద్మ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడింది. ఆమెను మదిగొండ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితురాలు నుంచి రూ 6.5 లక్షల విలువు చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
గ్రానైట్ కార్మికుడి బలవన్మరణం
ముదిగొండ (ఖమ్మం): ఓ గ్రానైట్ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం, ఖానాపురం గ్రామానికి చెందిన ఇమ్మడి రాము (29) కొన్నేళ్లుగా అదే మండలంలోని ఖానాపురంలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే మంగళవారం గ్రామంలోని మామిడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
సత్వరం రుణమాఫీ చేయాలి
ముదిగొండ: సత్వరం రుణమాఫీ చేయాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దమండవ గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు. సర్పంచ్ లంకెల లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. పూలు చల్లి, టపాసులు పేల్చి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ పొంగులేటి గ్రామంలోని ఎస్సీ కాలనీలో దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ దంపతులు ఎంపీని శాలువ కప్పి గజమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కన్వీనర్ మరికంటి గురుమూర్తి పూలమాలతో సన్మానించారు. సన్మాన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నవిధంగా తక్షణమే రైతుంలదరికీ రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఎంపీ కోటా నిధులతో ప్రతి పల్లెకు సాగు, తాగు నీరందిస్తామని చెప్పారు. తన నిధులు మొట్టమొదటగా పెద్దమండవ గ్రామానికే ఖర్చు పెడతానని అన్నారు. వ్యవసాయ సీజన్ కాలం దాటిపోతోందని, రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అన్నారు. వందేళ్ల కాంగ్రెస్, 30 ఏళ్ల టీడీపీ కంటే మిన్నగా జిల్లా ప్రజలు తనకు రాజకీయ ఘనత అందించారని తెలిపారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందిన రైతు నాగార్జునను ఎంపీ పరామర్శించారు. గ్రామంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దమండవ సర్పంచ్ లంకెల లక్ష్మి, ఎంపీటీసీ శెట్టిపోగు సునీత, జిల్లా నాయకులు లంకెల బ్రహ్మారెడ్డి, మండల కన్వీనర్ మరికంటి గురుమూర్తి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మోర్తాల నాగార్జునరెడ్డి, సర్పంచ్‌లు బత్తుల వీరారెడ్డి, పడిశాల భద్రయ్య, వేముల రాజకుమారి, శెట్టిపల్లి రమాదేవి, నాయకులు లంకెల లక్ష్మీకాంతారెడ్డి, కనగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలి బోనకల్: ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో డీసీసీబీ డెరైక్టర్ బోజడ్ల అప్పారావు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులోత మాట్లాడారు. రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, విత్తనాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. మోటమర్రిలోని బయ్యారం లిఫ్టు పనిచేయడంలేదని, రైతులు తన దృష్టికి తెచ్చారని, ఐడీసీ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయిస్తానని చెప్పారు. రాయన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి పాలకేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని అఖిలపక్ష నాయకులు కోరారని, ఎంపీ కోటా నిధులతో రోడ్డు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఐలూరి వెంకటేశ్వరెడ్డి, తూమాటి నర్సిరెడ్డి, మండల కన్వీనర్ చావా హనుమంతరావు, బండి వెంకటేశ్వర్లు, గుడ్డురి గోవిందమ్మ, కన్నెపోగు వెంకటరమణ, ఇరుగు యశోద తదితరులు పాల్గొన్నారు. -
రావెళ్ల ఇకలేరు
ముదిగొండ, న్యూస్‌లైన్: తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం అస్వస్థతతో కన్నుమూశారు. ముదిగొండమండలం గోకినేపల్లిలోని తన స్వగృహంలో రావెళ్ల తనువుచాలించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావెళ్ల గోకినేపల్లిలో 1927 జనవరి 31న రైతు కుంటుంబంలో జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకి పట్టి దళకమాండర్‌గా పని చేసి ప్రత్యర్థులను గడగడలాడించిన ధీశాలి ఆయన. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైన రావెళ్ల 1944 లో ఆంధ్రమహాసభలో చేరారు. 1947 ప్రాంతంలో నవభారత, స్వాతంత్రభారత పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపదశైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో తొలిదశ కమాండర్‌గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ పోరాట ఉద్యమం నిర్వహించారు. 1948 అక్టోబర్ నుంచి 1952 డిసెంబర్ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్, బీడ్, ఢిల్లీ, ఖమ్మం తదితర జైళ్లలో గడిపి...జైళ్లలో దుస్థితిని మార్చాలని 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చదవడం, రాయడం సౌకర్యాన్ని సాధించడం విశేషం. ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి దశరధదేవ్, కె ఎన్ సింగ్, బర్మా, కెప్టెన్ మహ్మద్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు. 1952 డిసెంబర్ 8వ తేదీన ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఆతరువాత గోకినేపల్లి కవిత కుటీరంలో నిరాడంబర జీవితం గడుపుతూ రచనలు సాగించారు. రావెళ్ల పద్యరచనతో పాటు అనేక వ చన రచనలు సైతం చేశారు. రావెళ్ల కవితా ఖండికల్లో అనంతల్పం, పల్లెభారతి, రాగజ్యోతుల్లాంటివి ముఖ్యమైనవిగా ఉన్నాయి. నాయకుల ఘననివాళి.... రావెళ్ల మృతదేహాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంతాపం ప్రకటించారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, గోకినేపల్లి సర్పంచ్ కొమ్మినేని రమేష్‌బాబు, ఐద్వా నాయకురాలు మచ్చా లక్ష్మి, అడ్వకేటు జేఏసీ నేత బిచ్చాల తిరుమలరావు, బీజేపి జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మధిర, పాలేరు నియోజకవర్గాల ఇన్ చార్జీలు బొమ్మెర రామ్మూర్తి, బత్తుల సోమయ్య, నేలకొండపల్లి, ముదిగొండ మండలాద్యక్షులు కొండూరి వేణు, సీతారాములు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి రావుల పాటి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సామినేనిరమేష్, బేగ్, అబ్దుల్నబీ రావెళ్ల వెంకటరామారావు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కాగా, గోకినేపల్లిలో జరిగిన సంతాపసభలో టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రావెళ్ల వెంకటరామారావు మృతి సాహితీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్‌రావెళ్ల రాసిన తెలంగాణ గేయాన్ని పాడి వినిపించారు. కాగా, గోకినేపల్లిలో మంగళవారం రావెళ్ల కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయానికి అంతిమసంస్కారం నిర్వహించారు.