ముదిగొండ: సత్వరం రుణమాఫీ చేయాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దమండవ గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు. సర్పంచ్ లంకెల లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. పూలు చల్లి, టపాసులు పేల్చి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ పొంగులేటి గ్రామంలోని ఎస్సీ కాలనీలో దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సర్పంచ్ దంపతులు ఎంపీని శాలువ కప్పి గజమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కన్వీనర్ మరికంటి గురుమూర్తి పూలమాలతో సన్మానించారు. సన్మాన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నవిధంగా తక్షణమే రైతుంలదరికీ రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఎంపీ కోటా నిధులతో ప్రతి పల్లెకు సాగు, తాగు నీరందిస్తామని చెప్పారు. తన నిధులు మొట్టమొదటగా పెద్దమండవ గ్రామానికే ఖర్చు పెడతానని అన్నారు.
వ్యవసాయ సీజన్ కాలం దాటిపోతోందని, రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అన్నారు. వందేళ్ల కాంగ్రెస్, 30 ఏళ్ల టీడీపీ కంటే మిన్నగా జిల్లా ప్రజలు తనకు రాజకీయ ఘనత అందించారని తెలిపారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందిన రైతు నాగార్జునను ఎంపీ పరామర్శించారు. గ్రామంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పెద్దమండవ సర్పంచ్ లంకెల లక్ష్మి, ఎంపీటీసీ శెట్టిపోగు సునీత, జిల్లా నాయకులు లంకెల బ్రహ్మారెడ్డి, మండల కన్వీనర్ మరికంటి గురుమూర్తి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మోర్తాల నాగార్జునరెడ్డి, సర్పంచ్‌లు బత్తుల వీరారెడ్డి, పడిశాల భద్రయ్య, వేముల రాజకుమారి, శెట్టిపల్లి రమాదేవి, నాయకులు లంకెల లక్ష్మీకాంతారెడ్డి, కనగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలి
బోనకల్: ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో డీసీసీబీ డెరైక్టర్ బోజడ్ల అప్పారావు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులోత మాట్లాడారు. రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, విత్తనాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. మోటమర్రిలోని బయ్యారం లిఫ్టు పనిచేయడంలేదని, రైతులు తన దృష్టికి తెచ్చారని, ఐడీసీ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయిస్తానని చెప్పారు.
రాయన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి పాలకేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని అఖిలపక్ష నాయకులు కోరారని, ఎంపీ కోటా నిధులతో రోడ్డు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఐలూరి వెంకటేశ్వరెడ్డి, తూమాటి నర్సిరెడ్డి, మండల కన్వీనర్ చావా హనుమంతరావు, బండి వెంకటేశ్వర్లు, గుడ్డురి గోవిందమ్మ, కన్నెపోగు వెంకటరమణ, ఇరుగు యశోద తదితరులు పాల్గొన్నారు.
సత్వరం రుణమాఫీ చేయాలి
Published Mon, Jul 21 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement
Advertisement