
ముదిగొండ: బంధువుల ఇంట్లో కర్మకాండలకు ఆటోలో వెళ్లి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి సమీపాన గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(60), ఆమె కుమారుడు ఉపేందర్, మనవడు హర్షవర్ధన్ (6) ఆటోలో ఖమ్మం అర్బన్ మండలం ఏదులాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండలకు హాజరై తిరుగు పయనమయ్యారు.
వీరి ఆటో గోకినేపల్లి సమీపానికి చేరుకోగానే కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న భారతమ్మ, ఆమె మనవడు హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉపేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారతమ్మ తల తెగిపడింది. కాగా, మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ఆటోఎక్కిన కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చాగంటి రమేశ్ (36) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సింగవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బొడ్డు ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం– కోదాడ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మృతుల కుటుంబీకులు ప్రమాద స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ, ఎస్సైలు ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment